తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి (TTD) భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు అదనపు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం (ఈ నెల 23న) ఆన్లైన్లో ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
అలాగే ఈ నెల 26 నుంచి 28 మధ్య రోజుకు అదనంగా 5వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్ విధానంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేటాయించనున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అదనపు కోటాను విడుదల చేస్తున్నది. మార్చి నెలకు సంబంధించి రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
అలాగే మార్చి నెలకు సంబంధించి రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది. విషయాన్ని భక్తులు గమనించి tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.