తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల జీతాల పెంపుదలతో పాటు ఇంటి పట్టాలు, పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను మంజూరు చేసింది . మంగళవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, ఈవో, జేఈవోలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పెద్ద జీయంగార్ల వ్యవస్థకు ఏడాదికి 60 లక్షలు, చిన్న అయ్యంగార్ల వ్యవస్థకు ఏడాదికి రూ.40 లక్షలు పెంపుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. లడ్డూ పోటులోని కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.28 వేల నుంచి 38వేలకు వేతనాలు పెంచాలని నిర్ణయించింది. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన వేతనాలు పెంచాలని, కల్యాణకట్టలో పీస్‌రేట్ బార్బర్ల వేతనాలు కనీసం రూ. 20వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
జార్ఖండ్(Jharkhand ) రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించింది. రూ. 15 కోట్లతో అలిపిరి వద్ద అభివృద్ధి పనులు, రూ. 2.07 కోట్లతో తిరుమలలో పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతును ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని టీటీడీ బోర్లు నిర్ణయం తీసుకుంది.