తిరుమల : ప్రముఖ రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Ananth Ambani ) ఆదివారం తెల్లవారుజామున తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.శ్రీవారి దర్శనానికి ముందు అనంత్ అంబానీ స్వామివారికి తలనీలాలు సమర్పించి, స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను సందర్శించారు.
గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం తరహాలోనే తిరుమలలోని టీటీడీ గోశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అనంత్ అంబానీ అంగీకారం తెలిపారు.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, భక్తుల రవాణా సౌకర్యాలలో భాగంగా సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరిన మేరకు టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వాటి నిర్వహణకు అవసరమైన 50 మంది డ్రైవర్లను వారికి అయ్యే జీతభత్యాలను సైతం రిలయన్స్ సంస్థ భరిస్తుందని తెలిపారు. వీటితో పాటు తిరుమల కొండపై ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఛార్జీంగ్ స్టేషన్లను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.