యా దేవీ మధుకైటభ ప్రశమనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణ చండముండ దమనీ యా రక్తబీజాశినీ
యా శుంభాది నిశుంభ దైత్య దమనీ యా సిద్ధలక్ష్మీః పదా
సా చండీ నవకోటి శక్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ॥
చండీ స్వరూపం మహోగ్రమైంది. సకల రాక్షస శక్తుల్ని నిర్జించే శక్తి కలిగిన ప్రచండ రూపం ఇది. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ శక్తులు, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమ్మేళనం ఇది. వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ, సింహ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. దేవీ భాగవతంలో చండీ అమ్మవారి వైభవం విస్తారంగా వర్ణితమై ఉంటుంది. మధుకైటభులు, చండముండులు తదితర రాక్షసులను సంహరించిన సంహారశక్తి ఈ స్వరూపం. జగన్మాతను చండీ స్వరూపంలో అర్చిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అడ్డంకులు తొలగి కార్యసాధన జరుగుతుంది. అమ్మకు ఎర్రటి వస్త్రం అలంకరించాలి. పులిహోర, కట్టెపొంగలి నివేదన చెయ్యాలి. ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. ముత్తయిదువులను పూజించాలి. చండీ సప్తశతీ పారాయణం చెయ్యాలి. అవకాశం ఉన్నవారు చండీహోమం చేస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయి.