దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సరిసమానుడు గానీ, అధికుడు గానీ మరొకరు లేరు. బలంతో శ్రీకృష్ణుడిని ఎవరూ జయించలేరు. అంతేకాకుండా, శ్రీకృష్ణుడు బలవంతంగా నిర్వర్తించవలసిన కర్తవ్యాలంటూ ఈ ముల్లోకాల్లో ఏవీ లేవు. అలాంటి శ్రీకృష్ణుడు ఏది చేసినా, అది ఆనందానుభూతి కోసమే! తన స్వీయ సంకల్పంతో మాత్రమే నిర్వహిస్తాడు. అంతేకానీ, మరో కారణంతో మాత్రం కాదు. మరి అంతటి శ్రీకృష్ణుడు రాధారాణిపై ఎందుకు ఆధారపడటం? శ్రీకృష్ణుడు అజితుడైనప్పటికీ ఆయనలో ఒక అద్భుతమైన గుణం ఉంది. అదే తన భక్తుల ప్రేమకు లొంగిపోవడం. తాను దేవాది దేవుడైనప్పటికీ, భక్తుల విశుద్ధ భక్తియుత సేవలకు ఆయన బద్ధుడు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా, నిస్వార్థంతో చేసే భక్తియుత సేవ భగవంతుణ్ని ఆకర్షించేటంత గొప్పది. శ్రీకృష్ణుడు సర్వ ఆకర్షకుడు. అయితే, ఆయనను సైతం ఆకర్షించే శక్తి మరేదైనా ఉందా? అంటే, అది శ్రీకృష్ణుడి ఆంతరంగిక శక్తి స్వరూపిణి అయిన పరదేవత శ్రీరాధిక. సకల లక్ష్ములకు ఆదిమూలం శ్రీమతి రాధారాణి.
దేవీ కృష్ణమయీ ప్రోక్తా రాధికా పరదేవతా
సర్వలక్ష్మీమయీ సర్వకాన్తిః సమ్మోహినీ పరా
‘దివ్యదేవతా స్వరూపిణి అయిన రాధారాణి శ్రీకృష్ణుడి అర్ధాంగి. లక్ష్ములలో ఆమె ప్రధానురాలు. సర్వ ఆకర్షకుడగు భగవానుడిని ఆకర్షించే శక్తి ఆమెలో ఉన్నది. రాధారాణే దేవదేవుడి ఆది అంతరంగ శక్తి. (చైతన్య చరితామృతం 4.83, బృహత్ గౌతమీయ తంత్రం) శ్రీకృష్ణుడిని ఈ భౌతిక ప్రపంచంలోని సౌందర్యాలేవీ ఆకర్షించలేవు. కృష్ణ పరమాత్మకు చేసే సకల సేవలూ రాధారాణి ద్వారానే స్వామిని చేరుతాయి. ‘రాధిక’ అంటే అత్యున్నత ఆరాధన అని అర్థం. ఆమె విశుద్ధమైన భక్తి తత్వం కలిగి ఉన్నది. అందుకే, ఆమె పట్ల శ్రీకృష్ణుడు ఆకర్షితుడయ్యాడు.
హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్భాగవత సారాన్ని వివరిస్తూ ఒకానొక చోట ‘బృందావన ధామంలోని విశుద్ధ భక్తులందరూ సదా రాధారాణి కృప కోసం ప్రార్థిస్తారు. సకల శక్తితత్వ ప్రతిరూపమైన రాధారాణి ఈ భౌతిక ప్రపంచంలో పరిపూర్ణమైన స్త్రీ స్వరూపాన్ని పోలి ఉంటుంది. తల్లి లాంటి రాధారాణి కృప భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. రాధారాణి కరుణ పొందిన భక్తులను శ్రీకృష్ణుడు తక్షణమే స్వీకరిస్తాడు. కాబట్టి, శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగోరే భక్తులు, నేరుగా కన్నయ్యను కాకుండా.. రాధారాణి కటాక్షం కోసం ప్రార్థిస్తుంటారు. తద్వారా భక్తియుత సేవల పట్ల మనలో నిద్రాణమై ఉన్న సహజమైన ప్రేమను తిరిగి మేల్కొల్పగలం.
భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమి పర్వదినంగా చేసుకుంటారు. రాధారాణికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరాధాకృష్ణులకు పుష్పాంజలి సమర్పిస్తూ ‘ఓ రాధారాణి! దీనుడనైన నాపై దయచూపమని దయచేసి నీ కృష్ణుడికి తెలుపు’ అని ప్రార్థిస్తుంటారు. ‘శ్రీకృష్ణుడు రాధారాణి సొత్తు. కనుక ఆమె ద్వారానే మనం శ్రీకృష్ణుడి శరణు వేడాల’ని అంటారు శ్రీల ప్రభుపాద. శ్రీచైతన్యుల పరంపరలోని ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు నిర్విరామంగా శ్రమిస్తూ, ఆ భగవత్ ప్రేమను ప్రపంచానికంతా అందజేసిన మహనీయులు. భగవంతుడితో జీవుడు తన సంబంధాన్ని పునఃస్థాపించుకునేందుకు మహాప్రభువుల వారు అందించిన అత్యంత సరళమైన మార్గమే హరినామ సంకీర్తన. ప్రతి ఒక్కరూ ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామ రామ హరే హరే’ అనే శ్రీకృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజూ కనీసం 16 మాలలు జపించాలని శ్రీల ప్రభుపాదులవారు సూచించారు. ఈ మహామంత్రాన్ని జపిస్తూ, శ్రీచైతన్య మహా ప్రభువులను ఆశ్రయించిన భాగ్యజీవులు అజ్ఞాన అంధకారమయమైన ఈ కలియుగాన్ని సులభంగా దాటి, జీవిత పరిపూర్ణతను సాధించగలరు. రండి! శ్రీ రాధాకృష్ణుల నామాలను అందరమూ జపిద్దాం. ఆనందంగా జీవిద్దాం.
(నేడు రాధాష్టమి)
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి 93969 56984