తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి కోసం వచ్చిన టోకెన్లు గల భక్తులకు నేరుగా దర్శనం అవుతుండగా టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 68,298 మంది భక్తులు దర్శించుకోగా 16,544 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చిందన్నారు.
శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు సోమవారం సాయంత్రం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.