ఈ ప్రపంచంలో ఎన్నో గోడలు ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ కూల్చివేసే ఒకే ఒక్క శక్తి ‘మానవత్వం’. మనిషిని మనిషిగా ప్రేమించడం, ఎదుటివారి కన్నీటిని తుడవడం అనేది కేవలం ఒక మంచి పని మాత్రమే కాదు, అది సాక్షాత్తూ అల్లాహ్ ఆదేశం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలో ‘మక్కా విజయం’ ఒక అద్భుతమైన మలుపు. అది కేవలం ఒక నగరాన్ని గెలవడం కాదు, మానవత్వాన్ని గెలిపించడం. ఆ రోజు ఎదురుగా నిలబడ్డ ఖైదీల సమూహంలో తనను రాళ్లతో కొట్టిన వారున్నారు, తన అనుచరులను చంపిన వారున్నారు.
మక్కా విజయం తర్వాత ప్రవక్త తమకేం శిక్ష విధిస్తాడోనని వాళ్లంతా వణికిపోతూ వేచి చూస్తున్నారు. కానీ, కరుణా మూర్తి అయిన ప్రవక్త వారి వైపు చూసి, కేవలం మానవతా దృక్పథంతో ఇలా అన్నారు: ‘వెళ్ళండి, ఈ రోజు మీపై ఎలాంటి ఆరోపణలు లేవు.. మీరందరూ స్వతంత్రులు’. ఒక మనిషి మరొకరిపై చూపగల అత్యున్నతమైన దయకు ఇది నిదర్శనం. ఎదుటివారిని భయపెట్టడం లేదా ఆయుధంతో బెదిరించడం లాంటివి మనిషిని అల్లాహ్ కరుణకు దూరం చేస్తాయి.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076