మతానికి, దైవభక్తికీ విశ్వాసం అనేది ప్రాణం. విశ్వాసం అంటే ఒకానొక విషయాన్ని గాని, వ్యక్తిని గానీ, సిద్ధాంతాన్ని గానీ ప్రగాఢంగా నమ్మడమే. విశ్వాసం లేని భక్తికి విలువ ఉండదు. అప్పటివరకూ ప్రభువుతోపాటు నడిచిన శిష్యుల్లో తోమా ఒకడు. పునరుత్థానం తర్వాత ప్రభువు కనిపించాడు అని చెబితే, ఆ సమయంలో తాను లేనందున తోమా దాన్ని నమ్మలేదు. సరికదా, ‘నేను నా కళ్లారా చూస్తే గానీ నమ్మనంటే నమ్మను’ అని భీష్మించాడు. అయనతో పోల్చుకుంటే, నేటి తరం విశ్వాసుల నమ్మిక చాలా గొప్పది! గాయపడ్డ క్రీస్తును కండ్లారా చూసి, ప్రభువుకు అయిన గాయాల్లో వేలు పెట్టి గానీ నమ్మలేని దుర్దశలో ఉన్నాడు తోమా! ఈ లెక్కన ప్రభువును చూడకుండానే నమ్ముతున్న విశ్వాసులు ఎంతటి ధన్యులో కదా!
పునరుత్థానం తర్వాత క్రీస్తు.. మరోసారి ప్రత్యక్షమై తన గాయాల్ని చూపించినప్పుడు గానీ తోమా నమ్మలేదు. విశేషం ఏమిటంటే.. ప్రభువుపై విశ్వాసం పెంచడానికి నడుం బిగించి మన భారతావనిపై కాలుమోపిన వ్యక్తి మరెవరో కాదు తోమానే! పునరుత్థానం తర్వాత క్రీస్తు నలభై రోజులపాటు ఈ నేలపై తిరిగాడని బైబిల్ చెబుతున్నది. అప్పుడప్పుడూ శిష్యులకు కనిపించి, వారు చేయవలసిన పనులను సూచించేవాడు. ‘మీరు నమ్మిన సిద్ధాంతాన్ని అందరికీ బోధించమ’ని ప్రభువు వారికి చెప్పాడు. ఓసారి మేడ మీది గదిలో శిష్యులంతా గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో ప్రభువు తనలోని మహాశక్తిని వారిపైకి ఊది తేజోవంతులను చేశాడు. తర్వాత మరో వారానికి ఆయన శిష్యులకు కనబడినప్పుడు తోమా కండ్లు తెరుచుకున్నాయి. అతనికి జ్ఞానోదయం అయింది. పశ్చాత్తాపం చెందాడు. కండ్ల నుంచి జలజలా రాలిన బాష్పాలతో తోమా చూపులు ఈ నేలవైపునకు దృష్టి సారించాయి (యోహాను 20:19-31).
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024