Colours | హోలీ రోజు మన జీవితం కూడా ఉత్సాహం, ప్రేమ అనే రంగులతో వికసించాలి. మన ముఖం ఆనందంతో వెలిగిపోవాలి. స్వరంలో మాధుర్యం ప్రతిధ్వనించాలి. జీవితం రంగులమయం కావాలి. ఆ రంగులు దైవంపై ప్రగాఢ విశ్వాసం ఉన్నప్పుడు ఉద్భవిస్తాయి. కోపం, తృష్ణ, దురాశ, రాగద్వేషాలు, కామం లాంటి ‘అశుభకరమైన రంగుల’కు బదులు సుగంధ సౌందర్యాలతో జీవితాన్ని నింపండి.
విభిన్న మనస్తత్వాలను, స్వభావాలను అర్థం చేసుకుని, జీవితాన్ని విశాల దృక్పథంతో చూడటమే హోలీ పరమార్థం! జీవితంలో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఈ జీవన యానంలో మనకన్నా భిన్నంగా ఆలోచించే, ప్రవర్తించే వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి రావచ్చు. అయితే, విశాల దృక్పథంతో చూసినప్పుడు.. ఒకానొక సమయంలో చాలా తీవ్రమైనవిగా కనిపించే సమస్యలు కొన్నాళ్లకు చిన్నవిగా మారిపోవచ్చు. వాటిని వదిలేసి ముందుకు సాగడమే నిజమైన జీవితం.
మన వ్యక్తిత్వానికి భిన్నంగా ఆలోచించేవారిని మనం చాలాసార్లు దూరంగా ఉంచుతుంటాం. కానీ, ఆ వ్యక్తులు ఎప్పటికీ అలాగే ఉండకపోవచ్చు. కాలక్రమంలో వారిలో మార్పు రావచ్చు. వాళ్లు నిజంగానే మారితే మంచిదే! మారకపోతే వాళ్లను వదిలేసి ముందుకు వెళ్లడమే! మనల్ని విభేదించే వ్యక్తులు మనలోని నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికే అలా ఉన్నారేమో అనుకోవాలి. అలాంటి వాళ్లు మీలోని సంభాషణ చాతుర్యాన్ని, భిన్న పరిస్థితుల్లో సానుకూలంగా ప్రవర్తించే వైఖరిని వెలికితీస్తారు! ప్రతి వ్యక్తిలోనూ ప్రతికూల, సానుకూల లక్షణాలు రెండూ ఉంటాయి.
ప్రతికూలతలను అధిగమించి ఉన్నతంగా మారడం ఎవరికి వారు సాధించాల్సిన విజయం. ఇతరులు ఎలా మెరుగుపడాలనే విషయాన్ని, వారికే వదిలేద్దాం. వీలైతే వారికి మంచిని నేర్పుదాం. ఈ ప్రయత్నంలో వారిపట్ల కరుణతో వ్యవహరించాలి. వారి జీవితం బాగుపడాలని ప్రార్థించాలి. ఇతరులను బాధపెట్టేవారు ఏదోరకంగా బాధపడతారు. ఇక్కడ సూత్రం ఏంటంటే, మనం ఏది చేస్తే.. ప్రకృతి అదే తిరిగి ఇస్తుంది. మనం ఇతరులకు దుఃఖాన్ని ఇస్తే, మనం దుఃఖాన్నే తిరిగి పొందుతాం! ఆనందాన్ని ఇస్తే, ఆనందాన్నే పొందుతాం.
మనదగ్గర ఉన్నదానిలో కొంచెం ఇతరులతో పంచుకుంటే, అది అనేక రెట్లుగా తిరిగి వస్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రేమ, సంతోషపు సుగంధాలు వ్యాపించేలా మన ప్రవర్తన ఉండాలి. పరిస్థితులతో సంబంధం లేకుండా, మనం స్థిరంగా, సంతోషంగా, తృప్తిగా ఉండాలి. ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండాలి. మనలో అంతర్గత సంతృప్తి ఉంటే, మన కోరికలను తీర్చుకోవడమే కాకుండా, ఇతరుల కోరికలను కూడా తీర్చగలుగుతాం. మనదైన వికాసంతో ఈ రంగుల పండుగకు దివ్యత్వాన్ని తీసుకొద్దాం.
సబ్కో సన్మతి
జాతిపితకు నచ్చిన ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్’ గీతంలో చెప్పినట్లు, ప్రతీ ఒక్కరి మనసు, బుద్ధి స్వచ్ఛంగా ఉండేలా, వారిని సరైన దిశలోకి మళ్లించమని దైవాన్ని ప్రార్థిద్దాం. ఈ భూమ్మీద అన్ని రకాల మనుషులూ ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రపంచం మరింత రంగులమయంగా ఉంటుంది. అటువంటివారు మనలోనూ కొన్ని భావోద్వేగాలను రేకెత్తిస్తారు. వాటికి మనం ఎలా స్పందిస్తాం అన్నది జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి!