‘భావనమే’ జీవనం. జీవ దేహం కేవలం ఒక ఉపకరణం. ఇంద్రియ గ్రహణం, ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభ్యాసం, అస్తిత్వరూపం, నిర్ణయాలు, పట్టుదల, అనుభూతి విస్తృతి.. అన్నీ భావప్రపంచమే. అయితే .. ఈ భావప్రపంచం సత్య, శాంత, స్పష్ట సమర్థతతో, సుసంస్కారంతో సాగాలంటే.. శరీరం సంతులిత సమర్థతతో పనిచేస్తూ ఆరోగ్యంగా ఉండటం అత్యవసరం. కానీ, తగినంత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా చాలావరకు భావప్రపంచం సమర్థతతో పనిచేయకపోవడం కీలకమైన సమస్య. అందులోనూ అధికారం, ధనం, విద్య (మేధస్సు) ఉన్నవారిలో ఈ దోషం ఉండటం సమాజానికి ప్రబలమైన సమస్య.
భావప్రపంచాన్ని సంస్కారబలంతో నడుపగలిగింది సదా ‘సత్యనిష్ఠ’. సత్యజీవనం.. విద్య. అసత్య జీవనం.. అవిద్య. దైనందిన మానవ జీవనం సత్యాసత్యాల ‘మిశ్రమం’. ‘సమానతా భావమయమైన’ సరళజీవనం, సమష్టి శాంతి, నిర్భయత, ఆరోగ్యం, కృషి, పరస్పర ఆదరణ, ఆధ్యాత్మిక సాధన, సంతృప్తి, ఆనందానుభవం ఇవన్నీ అనివార్యంగా సత్యాన్ని ఆశ్రయించి సాగుతుంటాయి. ‘ఆధిక్యతాభావమయమైన’ సంపద్గత జీవనం, కాంక్ష , ప్రకృతిశోషణ, ఘర్షణ, హననం, ఆక్రమణ, ప్రాణనష్టం, భయం ఇవి అసత్యాన్ని ఆశ్రయించి సాగుతాయి. మానవ ‘జీవితాన్ని శాసించవలసిన సత్యాలు ఇవి..
ఈ సత్యనిష్ఠే లోక శ్రేయస్సుకు ఎప్పటికైనా ఆధారం, ఏకైకమార్గం! ఈ దారిని వదలి చేసే ఇతర ప్రయత్నాలు.. కేవలం గాలిమేడలే!
– యముగంటి ప్రభాకర్,
9440152258