Ganesh Chaturthi | ప్రతి పూజా కార్యంలో మొదటగా గణపతిని ఆరాధించడం అనాదికాలంగా వస్తున్న ఆచారం. ఏ కార్యక్రమానికైనా తొలిగా వినాయకుని పూజించడం ద్వారా అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పంగా తెల్లతామర పుష్పం ప్రసిద్ధి చెందింది. తెల్లతామరతో పూజించిన పూజారికి సకల కార్యాల్లోనూ ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. అలాగే తెల్ల జిల్లేడు, చామంతి, శంఖపుష్పం, పసుపు, తెల్ల, ఎర్ర గన్నేరు, బొండుమల్లి వంటి పుష్పాలతో కూడా వినాయకుడిని పూజించవచ్చని పేర్కొంటున్నారు.
శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, శివునికి ప్రీతిపాత్రమైన పుష్పాలు గణపతికి కూడా సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గణేశుడు శివగణాల్లో ప్రధానమైనవాడిగా చెబుతారు. ఈ నేపథ్యంలో గణపతిని ఏ పుష్పంతోనైనా భక్తితో పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం, గణపతి మూర్తులలో కలువ, తామర పువ్వులను ధరించిన ఆకృతులు కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం.. ఎర్ర తామర, తెల్ల తామర గణపతికి ఎంతో ప్రీతికరమైనవి. అయితే గణపతి పూజలో తులసి పత్రం నిషిద్ధమని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్పాల కంటే గరికతో పూజించడమే గణపతికి ఎంతో ఇష్టమైనదని, అలా చేసినప్పుడు భక్తులకు స్వామి త్వరగా అనుగ్రహిస్తాడని పండితులు పేర్కొంటున్నారు. వినాయకుడికి ఎర్ర గన్నేరు పుష్పం కూడా ప్రీతిపాత్రమైనదే. వినాయకుడి ఆలయంలో ఈ చెట్టు కనిపిస్తే దాన్ని నమస్కరించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.