ఓ మహిళ హడావుడిగా ఆశ్రమానికి వచ్చింది. గురువుతో నిష్టూరంగా ‘ఎన్నో ఏండ్లుగా గుళ్లూ, గోపురాలూ తిరుగుతున్నాను. ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాను. పూజలు, వ్రతాలు, నోములు చేశాను. ఉపవాసాలు ఉన్నాను, భజనలు చేశాను. కానీ, ఏ దేవుడూ నా కోరిక మన్నించలేదు’ అని బాధపడింది. గురువు నవ్వుతూ ‘నీకు ఇద్దరు పిల్లలు ఉండి, వారిలో ఒకరు ఆరోగ్యంగా, మరొకరు అనారోగ్యంగా ఉంటే.. నువ్వు ఎవరి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తావు?’ అని అడిగాడు. ‘అనారోగ్యంతో ఉన్నవాడి మీదే’ అన్నది తల్లి. ‘దేవుడికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. నీకున్న సమస్యలు నీకు పెద్దవిగా అనిపించొచ్చు. కానీ, నీకన్నా పెద్ద సమస్యలు ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు.
వారిపట్ల దేవుడు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. దేవుడు వారి కోరికలు తీర్చడంలో తలమునకలై ఉన్నాడేమో! అందుకే, నీ కోరిక ఫలించడానికి ఆలస్యం జరుగుతుందేమో! దేవుడికి ఎవరిపైనా పక్షపాతం ఉండదు. భక్తుడి సమస్య తీవ్రతను బట్టి కరుణిస్తాడు. చల్లని చూపులు అందిస్తాడు. మనవంతు వచ్చే వరకూ ఓపికగా వేచి ఉండాలి’ అని ధైర్యం చెప్పాడు గురువు. ‘నిజమే! మనకు అన్నీ అనుకూలంగా జరగాలని దేవుణ్ని వేడుకుంటాం. కానీ, కొందరు పరిష్కారం దొరకని సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. వారి కొండంత కష్టాలతో పోలిస్తే నా గోరంత కష్టం ఏ పాటి? అసహనంతో దేవుడిపై నిందలు వేయడం సరికాదు’ అని అనుకుంది ఆ ఇల్లాలు.