రామ పట్టాభిషేకానికి దశరథుడు నిర్ణయించిన సమయం కావస్తున్నది.
సీతమ్మ తన అంతఃపురంలో సంతోషంగా ఉంది.
ఇంతలో రాముడు వచ్చాడు. ఆయన ముఖంలో ఏ ఆనందమూ లేదు. వెంట ఎవరూ రాలేదు. పట్టాభిరాముడికి ఛత్రం లేదు. వందిమాగధుల స్తోత్రాలు లేవు. ఏదో నిర్లిప్త వాతావరణం.
సీతమ్మ దగ్గరికి రావడానికి ముందే.. రాముడు తన తల్లి కౌసల్య మందిరానికి వెళ్లాడు. పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్తున్నట్టూ చెప్పాడు. బాధతో విలవిలలాడిన తల్లిని ఊరడించాడు. పద్నాలుగేండ్లు ఇట్టే గడిచిపోతాయని ధైర్యం చెప్పాడు. చిరునవ్వుతో తల్లిని అనునయిస్తూ.. ఆమెను శాంతపరిచాడు.
సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖంలో ఏదో వెలితి. జరిగినదంతా చెప్పాడు. తనను తాను నిగ్రహించుకోలేపోయాడు. ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యాడు. అడవులకు వెళ్తున్నందుకు కాదా బాధ! సీతను పద్నాలుగేండ్లు విడిచిపెట్టాల్సి వస్తున్నదని.
‘నువ్వు జాగ్రత్త! నీ జ్ఞాపకాలు నన్ను పద్నాలుగేండ్లు నిలువనిస్తాయా?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అప్పుడు సీతమ్మ ‘నన్ను వదిలి ఒంటరిగా వెళ్తానంటారేమిటి? మీరెక్కడో, నేనూ అక్కడే!’ అంది.
వారించాడు రాముడు. వనవాసం అంటే మాటలు కాదన్నాడు. క్రూరమృగాలు ఉంటాయన్నాడు. రాక్షసుల ముప్పు పొంచి ఉంటుందన్నాడు.
భర్తను అనుగమించడమే తన ధర్మం అంటుంది సీత. అది పురమైనా, వనమైనా తనకు ఒకటే అని నిశ్చయంగా చెబుతుంది.
‘పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా॥’- సుఖదుఃఖాల్లో, లాభనష్టాల్లో భర్తను నీడలా అనుసరించమని వివాహ సమయంలో తండ్రి జనకుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది సీత. అయోధ్యలో ముగ్గురు అత్తలు, ముగ్గురు తోడికోడళ్ల మధ్య ప్రశాంతంగా జీవించే అవకాశం ఉన్నా.. రాముడి సన్నిధిలో ఉండటం కన్నా వేరే సుఖం లేదని తలచింది. ‘నేను నీ బాటలోనే వస్తాను’ అంటూ సీతమ్మ భర్త వెంట కానలకు కదిలింది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఎప్పుడూ తోడుగా ఉండాలని ఈ సందర్భం చాటి చెబుతుంది.