క్రీస్తు సందేశం
ఇహలోకంలో తమ మనుగడను సుఖమయం చేసుకోవాలన్నదే చాలామంది జీవితాశయంగా ఉంటుంది. కానీ, కోరుకోకుండానే మనిషికి కష్టాలు ఎదురవుతుంటాయి. ఈ కష్టాలు మనిషి మనసు పరివర్తనకో, మనుగడ మార్పునకో దారితీస్తాయి. సామాన్య జనుల మధ్య సాగిన క్రీస్తు జీవనం సుఖమయంగా కాకపోయినా, ఎంత హృదయానందంగా గడిచిందో తెలిసిందే! కానీ, మనిషి కోసం మనిషి కష్టపడాలి.
త్యాగం చేయాలి అనే సందేశం ఇవ్వడానికి కష్టాలకే చివరిస్థాయి అయిన మరణాన్ని అనుభవించాడు ప్రభువు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించిన ఆయన, మరణాన్ని కావాలనే ఆహ్వానించుకున్నాడు. కష్టం అంటేనే క్రీస్తు అని నిర్వచనంగా మిగిలాడు. చిన్నపాటి కష్టానికే ఎందుకిలా భయపడతారు అని హెచ్చరికలు చేస్తూ ప్రభువు ధైర్యం ఇస్తుంటాడు.
లేనిపోని కోరికలతో కష్టాలను కొనితెచ్చుకునేవారు ఎందరో! ఇతరుల సౌఖ్యం కోసం, క్రీస్తుపై ప్రేమాతిశయం వల్ల తమ జీవితాల్లో హింసల్ని ఆహ్వానించుకున్న క్రైస్తవ మహర్షులు ఎందరో ఉన్నారు. అలాంటివారిలో స్టీఫెన్ మహర్షి, పునీత సెసీలియా, మరియా గొరెట్టీ తదితరులు కనిపిస్తారు. చిన్నపాటి కష్టాలకే ఉలిక్కిపడే వారికి, వీరంతా ఒక మహా సందేశంలా నిలిచిపోతారు.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024