సూర్యుడు అనంత చైతన్య స్వరూపుడు. అఖండ శక్తి సమన్వితుడు. కాలాన్ని నడిపించేదీ, కాల గమనాన్ని శాసించేదీ ఆయనే. గూటిలోని గువ్వపిట్టను మేల్కొలిపేదీ, నిద్రపుచ్చేదీ ఆయనే. మనలో జఠరాగ్నిని రగిల్చేదీ, కడుపు నింపేదీ కూడా ఆ ప్రత్యక్ష దైవమే. చెట్టూ పుట్టా జనమూ జలమూ అన్నిటికీ భాస్కరుడే బలం. అంతెందుకు, అవతార పురుషుడైన రామచంద్రుడికే అలసిన వేళ ఆలంబన అయ్యింది అద్భుతమని చెప్పుకోదగ్గ ఆదిత్య హృదయం. భానుడు సాక్షాత్తూ వేద స్వరూపుడు అంటుంది మంత్రం. ఆయన అనుగ్రహం అక్షయం. అందుకే ఆయన కదిలితే పండుగ. ఆయన మరలితే పర్వం. పన్నెండు రాశుల్లోనూ సంచరించే సూర్యుడు ఇప్పుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆ సందర్భాన్నే మకర సంక్రాంతిగా ఊరూవాడా జరుపుకొంటుంది. ఆయన ప్రసాదమైన ధాన్యపురాశుల్ని ముంగిట నింపుకొని ఆనందపు హేలలో మునిగితేలుతుంది. కాలగతి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగిడుతున్న వేళ.. ఆ అక్షయ మూర్తికి అక్షర నీరాజనమిది.
సప్తాశ్వ రథ ఆరూఢుడై భానుడు కదలి వస్తుంటే… తెలిమంచు తెరలు తీస్తుంది. ఇలాతలం ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతుంది. భోగిమంట ధూపమేస్తుంది. కళ్లాపి చప్పుళ్లు జేగంటలు మోగిస్తాయి. సప్తవర్ణాల ముగ్గులు బంగారు కిరణాలతో జతకూడి, సంరంభ సమాయత్తం చేస్తాయి. గొబ్బిళ్లు, చిక్కుళ్లు, రేగిపళ్లు సవినయంగా స్వాగతాంజలి ఘటిస్తాయి. సంక్రాంతి పండుగ అచ్చంగా సూర్యుడి పండుగే. సకల శుభంకరుడూ, సర్వ మంగళుడూ అయిన సూర్యుడు మరిన్ని మంగళాలను కలిగించే కాలానికి ప్రారంభం ఇది. అందుకే ప్రకృతినీ, మనిషినీ మమేకం చేస్తూ వేడుక చేసుకుంటాం ఇప్పుడు.
నిరంతర చైతన్యశీలి అయిన సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించి, తన రథ గమనాన్ని ఈ రోజు ఉత్తర దిశగా మళ్లిస్తాడు. ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. దిక్కుల్లో ఉత్తమైనదిగా దీనికి పేరుంది. అందుకే ఈ సమయం ఉత్తరాయణ పుణ్యకాలమైంది. ఈనాటి నుంచే దేవతలకు పగలు ప్రారంభమవుతుంది. ఇప్పటినుంచి దక్షిణాయనం ప్రారంభమయ్యే వరకూ వారికి ఉదయ సమయం. అందుకే ఈ నెలల్లో పండుగలు ఎక్కువ. ఆధ్యాత్మిక ఉపాసకులకు పరమోత్తమ కాలం. దేవతల అనుగ్రహం మెండుగా లభించే ఈ సమయాన భానుడు ప్రచండుడుగా వెలుగులు విరజిమ్ముతుంటాడు. అనంతవిశ్వం నుంచి ఆధ్మాత్మిక తరంగాలను ఆయన కిరణాల ద్వారా జనులందరిపైనా కురిపించి తరింపజేస్తాడు.
సూర్యుడు కాల స్వరూపుడు. సమయమూ భానుడూ వేరు వేరు కాదు. ఆదిత్యుడు ఆలస్యంగా ఉదయించే కాలాల్లో గడియారాలను ఓ గంట వెనక్కి మళ్లించడాన్నీ, ఆయన తొందరగా వచ్చే సమయాన వాటిని మళ్లీ అదే గంట ముందుకు జరపడాన్నీ పాశ్చాత్య దేశాల్లో మనం గమనిస్తున్నాం. అంటే సూర్యుడి రథ చక్రానికి సమాంతరంగా గడియారం ముళ్లు నడుస్తాయి. నడవాలి కూడా! ఎందుకంటే, మనలో జీవశక్తిని మేల్కొలిపే ఆయన కిరణ శక్తి లేకపోతే శరీరం ఎలా పనిచేస్తుంది? అలాగని ఒక్క రోజూ, ఒక్క నిమిషమైనా ఆయన ఆలస్యం చేసిన దాఖలాలూ కనిపించవు. ఆ విషయం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలను పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది.
ఏడాదిలో ఒక రోజు ఒక చోట ఎన్నింటికి ఉదయించి, ఎన్నింటికి అస్తమిస్తాడో… మళ్లీ అదే రోజు ఠంచనుగా అదే సమయానికి తూరుపు వేదిక మీద వెలుగుల పువ్వుగా వికసిస్తాడు. అంటే 2025 జనవరి 1వ తేదీన హైదరాబాద్లో సూర్యోదయం 6:46 గంటలకు అయితే, 2035, 2050 అయినా సరే జనవరి ఒకటో తేదీ సూర్యోదయం 6:46 గంటలకే ఉంటుంది. అలాగే అస్తమయమూ. ఆ రోజు 5:53 సూర్యాస్తమయం అయితే మళ్లీ జనవరి 1 ఎప్పుడు వచ్చినా అదే సమయానికి పడమటి రేవున పయనమైపోతాడు. అంత నిక్కచ్చిగా ఉండబట్టే కాలాలు సక్రమంగా సాగుతున్నాయి. పంటలు పండి మనుషుల ఆకలి తీరుతున్నది. అదే సూర్యుడు ఒక్క 3 రోజులు కనిపించకపోతే వాయు మండలంలోని జలం ఘనీభవించి మంచు తుపాను చెలరేగుతుంది. భూమి అంతా అమాంతంగా చల్లబడిపోయి సమస్త ప్రాణికోటి అంతరించిపోతుంది. నిరంతరం ప్రభవించే వెచ్చటి కిరణాలతో మనల్ని చల్లగా కాపాడుతున్నాడు కనుకనే ఆయన ప్రత్యక్ష నారాయణుడు.
భారతీయులు, భారతదేశం… లాంటి పదాల్లోనే ఇక్కడి ప్రజలకు సూర్యుడు అంటే ఎంతో ప్రీతి అన్న విషయం దాగి ఉంది. భా… అంటే ప్రకాశం, వెలుగు అనే అర్థాలున్నాయి. రతము… అంటే ప్రేమ, ప్రీతి, మక్కువ. అలాగే భరతుడు అంటే అగ్నిహోత్రుడు. అంటే సూర్యుడే. భారతీయులు అంటే వెలుగు పైన మక్కువ కలిగిన వారు అని అర్థం. వెలుగు మరోపేరు అఖిల విద్యలకున్… అంటుంది శాస్త్రం. విద్యల మీదా, ఇంకా లోతుకు వెళితే జ్ఞానం మీదా మక్కువ కలిగిన వారు భారతీయులు. అందుకే భారతదేశం జ్ఞానభూమి అయింది. ఆ వెలుగుకు ప్రత్యక్ష స్వరూపుడు సూర్యుడు. అందుకే మన దగ్గర సూర్యుడికి దివాకర్, ప్రభాకర్, భాను, రవి, భాస్కర్, సూర్య, ఆదిత్య, తేజస్వి, సవిత, మిత్ర, అర్క, మార్తాండలాంటి పేర్లు లెక్కకు మిక్కిలి ఉంటాయి. ప్రపంచ వాఙ్మయంలో సూర్యుడికి ఇన్ని పేర్లు మరెక్కడా కనిపించవు. అదీ భారతీయులకు భానుడి మీద ఉన్న ప్రీతి. మన దేశంలో ఇప్పటికీ సూర్యుడిని చూడనిదే భోజనం ముట్టని వాళ్లు ఉన్నారు.
మన దగ్గర వేదకాలంలోనే భూమికి సూర్యుడి నుంచి ఉన్న దూరాన్ని సుస్పష్టంగా లెక్కవేశారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు, అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇక్కడ భారతీయులు పరమ పవిత్ర గ్రంథంగా భావించే రామాయణంలోని ఓ విషయాన్ని చెప్పుకోవాలి. బాల్యంలో హనుమంతుడు నారింజ రంగులోని సూర్యుణ్ని చూసి పండు అనుకుని, తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం ఆయన వెళ్లిన దూరాన్ని, ‘యుగ సహస్ర యోజన పరభాను’ అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే… ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు… 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ‘భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరం 14.98 కోట్ల కిలోమీటర్లు’ అని శాస్త్రవేత్తలు చెబుతున్న లెక్కకు అటూ ఇటుగా సరిపోతుంది.
సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యోపాసనకు ప్రత్యేక స్థానముంది. పంచాయతనాల్లో సౌరం ఒక ఆరాధనా పద్ధతి. అందులో సూర్యుడే ప్రధాన దేవత.
‘నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే’
‘జగత్తుకు నీవే కన్ను. సృష్టి స్థితి లయలకు కారకుడివి. సత్వ రజో తమో గుణాలూ నీలోనే ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య మూర్తీ నమోస్తుతే’ అంటూ ప్రార్థిస్తాం. భానుడు త్రిమూర్తుల సమైక్య రూపం కాబట్టే ప్రభాతంలో బ్రహ్మగా, మధ్యాహ్నం వేళ శివ స్వరూపుడిగా, సాయం సంధ్యలో విష్ణు రూపుడిగా కొలుస్తాం. భవిష్య, మార్కండేయ, బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లో సూర్యమండల వర్ణన అద్భుతంగా ఉంటుంది.
రామాయణ, మహాభారతాల్లో అనేక చోట్ల సూర్యుడి ప్రస్తావన కనిపిస్తుంది. ప్రశ్న, తైత్తరీయ, ఛాందోగ్య, బృహదారణ్యకాది ఉపనిషత్తులూ ఆయన్ను అమిత బలవంతుడిగా చూపించాయి. అసలు వేదమంతా కలుపుకొంటే సూర్యమండలమే. సూర్యుడి జననానికి సంబంధించి పురాణేతిహాసాల్లో పలు రకాల కథలు ఉన్నాయి. బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు సూర్యుడు జన్మించాడు. తల్లి కడుపులో ఉండగా సూర్యుడి వేడి వల్ల గర్భం విచ్ఛిన్నమవుతుంది. దైవానుగ్రహంతో ఆ గర్భం నుంచే సూర్యుడు ప్రభవించాడంటారు. అందుకే సూర్యుడిని మృతాండుడు, మార్తాండుడు అనే పేర్లతో పిలుస్తారు.
సూర్యుడు ఒక్కడిగా కనిపించినా ఆయన చుట్టూ పెద్ద పరివారమే ఉంటుంది. ఏడు విభిన్న గణాలు ఉంటాయందులో. అందులో ద్వాదశ ఆదిత్యులు కూడా ఉన్నారు. మహాభారతం ప్రకారం.. వీళ్లంతా కశ్యప, అదితి సంతానమే. వీరి పేర్లు ధాత, మిత్ర, అర్యమ, ఇంద్ర, వరుణ, అంశు, భగ, వివస్వంత, పూష, సవిత, త్వష్ట, విష్ణు. వీళ్లు పన్నెండు మాసాల్లో సూర్యుడి శక్తిని పన్నెండు రకాలుగా భూమికి అందిస్తారు. ఇక మిగిలిన ఆరు గణాలు అప్సరస, రుషి, అసుర, సర్ప, యక్ష, గంధర్వులు. మొత్తంగా ఒక్కో సూర్యుడితో కలిసి వీళ్ల గణాల నుంచి ఒక్కొక్కరు ఒక్కో నెలను పరిపాలిస్తారు. ఆ కారణంగానే మాసాలు మారుతున్న కొద్దీ ప్రకృతితో మన అనుభూతీ విభిన్నంగా ఉంటుంది.
పవళించే భువనాలను తన పావన కిరణ స్పర్శతో మేలు కొలుపుతాడు భానుడు. ఆయన సరిగ్గా కనిపించని రోజు శరీరాన్ని బద్ధకం ఆవరిస్తుంది. రోజులపాటు భానుడి ప్రతాపం తగ్గిందా అది కుంగుబాటుగానూ మారుతుంది. అమెరికాలాంటి దేశాల్లో చలికాలంలో ప్రతి 10 మందిలో నలుగురిని మానసికమైన దిగులు ఆవరిస్తున్నదని అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ ఒక అధ్యయనంలో వెల్లడించింది. అంతేకాదు తీవ్రమైన కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్లాంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్యా తక్కువేం కాదు. ఐరోపా దేశాల్లోనూ ఈ సమస్య పెద్ద స్థాయిలోనే కనిపిస్తుంది. సూర్యరశ్మి సరిగ్గా సోకకపోతే శరీరంలో మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్ల స్థాయుల్లో తేడా రావడమే దీనికి కారణం. ఇవి నిద్రను, మనసుని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు… సూర్యరశ్మి లేదా అంతకు సమానమైన కాంతి కలిగిన ప్రత్యేక లైట్లతో దీనికి ‘లైట్ థెరపీ’ అనే చికిత్స చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే మానసిక సమస్యలకూ సూర్యుడే మందు. ఈ విషయం రామాయణంలో సీత విషయంలోనూ కనిపిస్తుంది. సీతను క్షోభకు గురిచేయాలని భావిస్తాడు రావణుడు.
రామలక్ష్మణుల మాయా తలలను తెచ్చి, యుద్ధంలో చంపానంటూ ఆమె ముందుంచుతాడు. వాటిని చూసి కంపించిపోతుంది సీత. తీవ్ర దుఃఖితురాలైన ఆమెతో అసలు నిజాన్ని చెబుతుంది విభీషణుడి కూతురు. అది అబద్ధమని తెలిసినా ఆమె దిగ్భ్రమ నుంచి బయటికి రాలేకపోతుంది. ఆ శోకం నుంచి విముక్తి పొందేందుకు ధ్యానంలోకి వెళుతుందామె. ప్రభాకరుడిని ఆశ్రయించు అంటూ మది నుంచి వచ్చిన సూచనతో సూర్యుడికి నమస్కారం చేస్తుంది. ఆ విధంగా కుంగుబాటు నుంచి బయటపడిందట. అంతేకాదు, అవసరమైనప్పుడు అనన్య సామాన్యమైన బలాన్నీ సూర్యుడు అందిస్తాడు. అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు ద్రౌపదిని చూసి మోహిస్తాడు కీచకుడు.
ఏదో ఒక సాకుతో తన మందిరానికి రప్పించుకుంటాడు. అక్కడికి వెళ్లవలసిన తప్పని పరిస్థితి ఏర్పడ్డప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకుంటుంది ద్రౌపది. అప్పుడు తన గణాల్లోంచి ఓ రాక్షసుడిని ఆమె వెంట అదృశ్య రూపంలో పంపుతాడు ప్రత్యక్ష నారాయణుడు. అంతే కీచకుడు ద్రౌపది చేయి పట్టుకోగానే చప్పున దూరి తన పని పూర్తిచేస్తాడు. మహా బలవంతుడిగా పేరున్న కీచకుడు కూడా ద్రౌపది చేయి విదల్చగానే ఆమడదూరంలో ఎగిరిపడి, వణికి పోతాడు.
సూర్యకాంతికీ, మనం ఎత్తుకు-వయసుకు తగ్గ బరువు ఉండటానికీ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ)గా పిలిచే ఇది చాలా కోణాల్లో మనం ఎండలో ఉండటం మీద ఆధారపడుతుంది. విటమిన్-డి అన్నది జీవక్రియ (మెటబాలిజం) బాగా జరగడానికి, తిన్న ఆహారంలోని క్యాలరీలు ఖర్చు అవ్వడానికి తోడ్పడుతుంది. విటమిన్-డి లోపం ఉన్న పిల్లల్లో జీవక్రియావేగం మందగించి ఊబకాయం తలెత్తుతున్నదట. మన శరీరంలోని లెప్టిన్ అనే హార్మోన్ ఆకలి లేదా, కడుపు నిండిన భావనలను నియంత్రిస్తుంది. ఇది సక్రమంగా విడుదలై పనిచేయడానికి సూర్యకాంతి సహకరిస్తుంది.
ఉదయ, సాయంత్రాల్లో ఎండలో ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గడాన్ని జంతువుల మీద చేసిన వివిధ ప్రయోగాల్లో గుర్తించారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సూర్యరశ్మి ఎంతగానో సహకరిస్తుంది. మెదడు ఏకాగ్రంగా పనిచేయడానికీ, మనసు ఆహ్లాదంగా ఉండటానికీ ఇదే కీలకం. శరీర గాయాలను మాన్పడంలోనూ ఎండ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమాలాంటి ఎముక, శ్వాస సంబంధ వ్యాధుల నివారణకూ ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనీయకుండా చేయడమే కాదు, మనలోని రకరకాల హార్మోన్లను నియంత్రణలో ఉంచేందుకూ ఇది మూలంగా పనిచేస్తుంది.
అందుకే ‘ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్’ అంటుంది శాస్త్రం. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆ కారణంగానే ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలను సూచిస్తుంది యోగ శాస్త్రం. సూర్య నమస్కారాలు మొత్తం 12 ఆసనాల సమాహారం. ఇందులో ప్రణామాసనంతో పాటు హస్త ఉత్థానాసనం, పాదహస్తాసనం, పర్వత, భుజంగాసనాల్లాంటివి ఉంటాయి. వీటన్నిటికీ ద్వాదశాదిత్యులకు సంబంధించిన మంత్రాలూ ఉంటాయి. అవి చదవడం, చదవకపోవడం అన్నది వ్యక్తిగత ఇష్టం. ఇక, ఉచ్ఛాస నిశ్వాసలను సమన్వయం చేసుకుంటూ ఈ నమస్కారాలు చేయాలి.
రక్తశుద్ధికి, రక్తప్రసరణ బాగా జరగడానికి, బరువు నియంత్రణలో ఉండటానికి, థైరాయిడ్, థైమస్లాంటి వివిధ గ్రంథులు సక్రమంగా పనిచేయడానికీ ఇవి బాగా ఉపకరిస్తాయి. వీటిలో ఒక్కొక్క ఆసనానికీ ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు చేతులు పైకెత్తి వెనక్కి వంగి చేసే హస్త ఉత్థానాసనం వల్ల వెన్ను బలంగా అవుతుంది, నడుము నొప్పులు రావు. అలాగే నడుము వంచి అరచేతులతో పాదాలను పట్టుకునే పాదహస్తాసనం వల్ల గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది. మైగ్రెయిన్, బీపీలాంటివి నియంత్రణలో ఉంటాయి. పెరిగే పిల్లలు వీటిని సాధన చేస్తే శరీరం దృఢంగా తయారవుతుంది.
జగత్తుకు మూలకర్తా, పోషకుడూ అయిన సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం అక్షయం. అది మనకు పురాణేతిహాసాల్లో పలు సందర్భాల్లో ప్రస్ఫుటం అవుతుంది. మహాభారతంలో పాండవుల వనవాస ఘట్టంలో అలాంటి కరుణామృత ధార దర్శనమిస్తుంది. కుంతీ పుత్రులు, పరివారంతో కలిసి అడవులకేగినప్పుడు వాళ్ల వెంట రుషి ముని గణం కూడా బయల్దేరుతుంది. ‘అయ్యో నేనే రాజ్యాన్ని వదిలి, కుటుంబంతో కలిసి కానలకు పోతున్నాను. మేమంటే ఏదో కందమూలాలు తిని జీవిస్తాం. మిమ్మల్ని నేనెలా పోషించగలను. అయినా ఈ రాజ్యానికి రాజు దుర్యోధనుడు మీరు ఆయనతో ఉండాలి కదా…’ అంటాడు ధర్మరాజు. ‘మాకు పదవులతో పనేం ఉంది.
ధర్మం వెంటే ఉంటాం, ధర్మం గెలవడం కోసం తపస్సు చేస్తాం…’ అని వాళ్లూ పాండవులతో పాటు కదిలారు. ఆ సందర్భంలోనే ధర్మరాజు సూర్యుణ్ని ఉపాసిస్తాడు. ఆయన అవసరాన్ని గ్రహించి, అద్భుతాలకే అద్భుతం అయిన ‘అక్షయ పాత్ర’ను ప్రసాదిస్తాడు భానుడు. ఏ పదార్థం ఎంత కావాలన్నా ఇస్తూ, వేల మంది ఆకలి తీర్చే ఆ అమృతభాండం ఆయన అపార కరుణకు నిదర్శనం. అంతెందుకు, రోజుకు పన్నెండు బారువుల బంగారాన్నిచ్చే ‘శమంతక మణి’ని సత్రాజిత్తుకు వరంగా ఇచ్చిందీ ఆదిత్యుడే. అందుకే ఆయన అక్షయమూర్తి. ప్రత్యక్షనారాయణుడిని ఉపాసిస్తే జయం, అక్షయ శుభం కలుగుతుందన్నది వేదవాక్కు.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్
అంటుంది ఆదిత్య హృదయంలోని మరో శ్లోకం. శాస్త్ర పరంగా జయం అంటే… ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నిటా సంపూర్ణత్వాన్ని పొందడం. అలాంటి విజయవంతమైన జీవితాన్ని ప్రసాదించమని ఆ ప్రత్యక్ష నారాయణుడిని ఈ పండుగ వాకిట వేడుకుందాం… సూర్య నారాయణా వేద పారాయణా అంటూ మనస్ఫూర్తిగా పాడుకుందాం!
శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధంలో ఉన్నాడు. ఈయన అవతార పురుషుడైతే ఆయన తపోసంపన్నుడు. అనేక వరాలు పొందినవాడు. అందుకే, యుద్ధ సమయంలో దెబ్బ తిన్నా మళ్లీ మళ్లీ బలం పుంజుకుని తిరిగి వస్తున్నాడు. దీంతో సాక్షాత్తూ రామభద్రుడికే ఓసారి విపరీతమైన అలసట ఆవరించిందట. ఆ సమయంలోనే రాముణ్ని సమీపిస్తాడు అగస్త్య మహర్షి.
‘రామచంద్రా! నీకు అమిత బలప్రదాయిని అయిన ఓ దివ్య స్తోత్రాన్ని ఉపదేశిస్తాను దానివల్ల యుద్ధంలో నువ్వు ఇట్టే విజయం సాధించగలవు’ అంటూ ఉత్సాహపరుస్తాడు. అలా అగస్త్యుడు రాముడికి ఉపదేశించిన మంత్రమే, సూర్యగీతగా ప్రసిద్ధి చెందిన‘ఆదిత్య హృదయం’. ఇందులో సూర్యుడి వైభవం ఉంటుంది. ఆయన ఈ సృష్టికి చేస్తున్న మేలు ఉంటుంది. సూర్యుడి నామాల ప్రస్తావన కనిపిస్తుంది. భానుణ్ని కొలవడం వల్ల ఎంతటి మహత్తర ప్రయోజనాలు లభిస్తాయన్న వివరమూ ఉంటుంది. అందులో ఒక శ్లోకం ఇలా చెబుతుంది…
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాఁల్లోకాన్ పాతి గభస్తిభిః
సూర్యుడు సర్వదేవాత్మకుడు. ఆత్మ అనే పదానికి స్వరూపం, శరీరం అనే అర్థం కూడా ఉంది. అంటే సర్వదేవతలకూ స్వరూపం ఈయనే. అందరికీ ఆత్మ ఇతడు. తేజస్వి అనే పదానికి కాంతి అనే కాదు, బీజశక్తి అనే అర్థం కూడా ఉంది. అంతమంది దేవతల ఏకీకృత రూపమైన ఈ పరమాత్మ సర్వజగత్తునూ తనలో దాగి ఉన్న బీజాలతో వ్యాప్తి చేస్తున్నాడు. రశ్మిభావనః అంటే రశ్ములను కలిగించువాడు. రశ్మి… అంటే అన్నప్రదాత. రశ్ములు అంటే సర్వ జీవులనూ పోషించే సూర్య కిరణ శక్తులు. అవి పై నుంచి కిందకి వస్తూ ప్రతి జీవిలోకీ ప్రవేశిస్తాయి. సూర్య రశ్ములను ప్రకృతి అంతా పొందుతుంది. సూర్యుడి వెలుగు తగలగానే అప్పటివరకూ మొగ్గలుగా ఉన్నవి పువ్వులుగా విచ్చుకుంటాయి. పక్షులు గూళ్లు వదులుతాయి.
పర్వతాలు, ఇతర జడ పదార్థాలు, చెట్లూ పుట్టలూ వాటి వాటి ధర్మానుసారం రశ్ముల్ని తీసుకుంటాయి. మనిషి శరీరం ఒకలా స్వీకరిస్తుంది. అన్ని దిక్కులా వ్యాపించి ఉండే ఈ కిరణాల నుంచి వసువులు మొదలైన దేవతలు కూడా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ రశ్ములు ప్రతి జీవిలోకీ ప్రవేశిస్తాయి. దేవతల ఆహారమేమిటో వారికి, మన ఆహారం మనకు, జంతువుల ఆహారం జంతువులకు… ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి ఆయన తేజస్వీ రశ్మిభావనః. ఆ సూర్యుడే తన చుట్టూ వ్యాపించి ఉన్న దేవ అసుర గణాలతో, ఆయన కిరణాల ద్వారా ఈ భూమిని పాలిస్తున్నాడు. ఇందులో సూర్యుడు పరమేశ్వరుడు ఎలా అయ్యాడో చెప్పారు. ఇక, ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభాలకే శుభం జరుగుతుంది. దీర్ఘాయుష్షు, సంపద, బ్రహ్మ వర్చస్సు.. కలుగుతాయి. ఇది శోక వినాశిని, శత్రు నాశిని అని చెబుతాడు అగస్త్య మహర్షి. ఆయన మాట ప్రకారం రాముడు దీన్ని విని పఠనం చేశాడు. ఒకే ఒక్క దెబ్బలో రావణున్ని పడగొట్టి అఖండ విజయాన్ని సాధించాడు. అంతటి శక్తిమంతమైనది కాబట్టే సూర్య ఉపాసనా సంప్రదాయంలో దీనికి విశిష్ట స్థానముంది.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి