‘తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగలేని పశుపక్ష్యాదులు ఎన్నో ఉన్నాయి. అల్లాహ్ వాటికి ఉపాధిని సమకూరుస్తాడు. మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ ఎరిగినవాడూను’ అంటుంది ఖురాన్ (29:60). ‘భూమ్యాకాశాలలోని నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. తాను కోరిన వారికి ఆయన పుష్కలంగా ఉపాధిని ఇస్తాడు. తాను కోరినవారికి ఆయన ఆచితూచి ఉపాధిని ఇస్తాడు’ అని కూడా సెలవిచ్చింది. పక్షులు ఉషోదయాన ఆకలితో తమ గూళ్లను వదిలి, సంధ్యా సమయానికి కడుపు నింపుకిని తిరిగి తమ గూటికి వస్తాయి. వాటన్నింటికీ ఆహారాన్ని అందించేది దైవమే.
ఈ సృష్టిలో జీవరాశుల పోషణ బాధ్యత అల్లాహ్దే అన్నది ఖురాన్ చెబుతున్నది. భూమిపై లెక్కలేనన్ని జంతువులు ఉన్నాయి, అవి తమ జీవనోపాధిని నిల్వ చేయవు. ఆహార సేకరణ గురించి చింతించవు. భూమిలోపల తలదాచుకుంటున్న కీటకాలు, చీమలు మొదలుకుని, ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో నివసించే చేపలు, ఇతరత్రా జీవరాశులన్నిటికీ ఆ దైవమే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు.
అసంఖ్యాకమైన పక్షులు, పశువులు వీటిలో ఏదీ తన ఉపాధిని తానే మోసుకుంటూ తిరుగదు. అవి ఎక్కడికి వెళ్లినా దైవానుగ్రహం వల్ల వాటికి ఏదో ఒక విధంగా ఉపాధి లభిస్తూనే ఉంటుంది. ఒక్కొక్క పిట్ట గూడును, ఒక్కొక్క పురుగు బిలాన్నీ అల్లాహ్ ఎరుగును. ఏ ప్రాణి ఎక్కడ ఉందో దైవానికి బాగా తెలుసును. అందుకే ‘మీరు ఉఫాధి గురించి యోచించి ధైర్యం సడలి కూర్చోకండ’ని మానవజాతికి సూచిస్తున్నాడు అల్లాహ్. పక్షుల మాదిరిగానే మానవులు కూడా ఉపాధి కోసం అన్వేషిస్తే తప్పకుండా అల్లాహ్ అనుగ్రహం లభిస్తుంది.
చీమలు, కీటకాల ఆహారాన్ని అందించడానికి ఇంత శ్రద్ధ వహించినప్పుడు, సృష్టిరాశుల్లో ఉత్తమ జీవి అయిన మనిషి పై ఇంకెంత శ్రద్ధవహిస్తాడో కదా! అల్లాహ్ అనుగ్రహాన్ని, దయ స్వరూపాన్ని, కారుణ్యాన్ని మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఉపాధి కోసం అడ్డదారులు తొక్కి ద్రోహానికి పాల్పడుతుండటం విచారకరం. ఇలా అడ్డదారుల్లో ప్రయాణించిన వాళ్లు అంతిమ దినాన చింతించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవాన్ని విశ్వసించి, సన్మార్గంలో నడిచిన వారిపై అల్లాహ్ దయ సదా ఉంటుంది.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076