మనం చాలామందిమి జీవితం అంటే కేవలం ఆటలు, సరదాలు, ఆస్తులు, మంచి ఉద్యోగం, సంసారం అనుకుంటాం. కానీ, ఈ జీవితం ఒక్కసారే దొరుకుతుంది. ఇది కేవలం పరీక్ష మాత్రమే. సుఖమైనా, కష్టమైనా, కలిమి అయినా, లేమి అయినా… అన్నీ మనల్ని పరీక్షించడానికే! ఇక్కడ మనం చేసే పనులన్నింటికీ పరలోకంలో జవాబు చెప్పుకోవాలి అని చెబుతుంది ఖురాన్. ‘నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరేదాని కొరకూ సృష్టించలేదు’ అని పేర్కొన్నాడు అల్లాహ్. అంటే, మన జీవిత లక్ష్యం ఆ సృష్టికర్తను ఆరాధించడం కావాలి. ఆరాధన అంటే కేవలం పూజలు, నమాజులు మాత్రమే కాదు.
ఆరాధన అంటే మన జీవితంలో ప్రతి రంగంలోనూ దైవ ధర్మాన్ని పాటించడం. ఇంట్లో ఉన్నా, పనిచేసే చోటులో ఉన్నా.. ఎక్కడ ఉన్నా మంచి పనులు చెయ్యాలి. మన హక్కులు, బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. మంచిని ప్రోత్సహించాలి. చెడును అడ్డుకోవాలి. ఈ అమూల్యమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని తాత్కాలిక ప్రాపంచిక విషయాల మాయలోపడి దైవాన్ని విస్మరించకూడదు. సృష్టికర్త ఆదేశాలకు అనుగుణంగా బతికినవారికి ఎప్పటికీ అంతం లేని, శాశ్వతమైన స్వర్గం దొరుకుతుంది.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076