ఉపనిషత్ వాక్యం
యథా మూఢో యథా మూర్ఖో యథా బధిర యేవ వా
తథా వర్తేత లోకస్య స్వ సామర్థ్యస్య గుప్తయే॥
‘లోకానికి తన సామర్థ్యం తెలియనీయకుండా యోగి మూఢునిలాగా, మూర్ఖునిలాగా, చెవిటి వానిలాగా మెలగాలి’ అని పై ఉపనిషత్ వాక్య భావం. దత్తాత్రేయుడి రెండో అవతారం పేరు శ్రీ నరసింహ సరస్వతి స్వామి. ఒకసారి స్వామివారు అమరపురం అనే ఊరిలో భిక్ష కోసం వెళ్లారు. ఆ ఊరిలో గర్భ దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి గంపెడు సంతానం. భిక్షాటనే జీవనాధారం. భిక్ష దొరకనినాడు గుడిసె ముందున్న బచ్చలి తీగ ఆకులతో అతని భార్య ఏదో ఇంత వండేది. ఒకసారి నరసింహ సరస్వతి స్వామి ఈ గతిలేని వ్యక్తి ఇంటికి భిక్ష కోసం వచ్చాడు. అప్పటికే భిక్షకు వెళ్లి వచ్చిన ఆ ఇంటాయన జోలెలో ఆనాడు గుప్పెడు గింజలు పడలేదు. ఆ ఇంటావిడ బచ్చలికూరతో ఏదో వండింది. భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన నరసింహ సరస్వతి స్వామిని సాదరంగా లోనికి ఆహ్వానించారు ఆ దంపతులు. స్వామి పాదాలు కడిగి పూజించారు.
ఇంట్లో ఉన్న బచ్చలికూర పదార్థమే స్వామికి నివేదించారు. ఆ ఇంటిల్లిపాదీ స్వామివారికి ప్రణిమిల్లారు. ‘మహాలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు’ అని దీవించారు స్వామి. ఆ దంపతులు సంతోషించారు. స్వామి బయటికి వస్తూ వాకిట్లో ఉన్న ఆ బచ్చలి తీగను తీక్షణంగా చూసి.. ఎడమ చేతితో దాన్ని వేళ్లతో సహా పెకిలించి అవతల పడవేసి వెళ్లిపోయారు. స్వామివారి చర్యతో ఆ ఇంటి ఇల్లాలు ఖిన్నురాలైంది. ‘ఏ భిక్షా దొరకని నాడు ఆకలి తీర్చే బచ్చలి తీగను స్వామివారు ఇలా చేశారేమిటి? ఇదేమి పిచ్చిపని’ అని బోరుమన్నది. ఇరుగుపొరుగు ఈ దృశ్యం చూసి ‘స్వామివారు ఇలా మూర్ఖంగా ప్రవర్తించారేమిటి?’ అని చెవులు కొరుక్కున్నారు. కానీ, ఆ ఇంటాయన భార్యను ఓదార్చి ‘బచ్చలి తీగ కోసం ఏడుస్తావా పిచ్చిదానా! మళ్లీ నాటుదాం!’ అన్నాడు. నాటడానికి పారతో తవ్వుతుంటే ఖంగు ఖంగుమని మోగింది. మట్టినంతా తొలగిస్తే వారికి రాగి బిందె దొరికింది. దాని నిండా మెరిసే బంగారు కాసులు కనిపించాయి! ఆ గృహస్తు భార్య ఆశ్చర్యంతో అలా ఉండిపోయింది. అప్పుడు ఆమె భర్త నవ్వుతూ ‘స్వామి వారు చేసింది మూర్ఖులు చేసే పనే అంటావా!’ అన్నాడు.