క్రీస్తు సందేశం
కన్న బిడ్దలు తిరిగి ప్రేమిస్తారు కదా అని భవిష్యత్తును ఊహించి ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలను ప్రేమించడం మొదలెట్టరు. సహజంగానే వారిపై అవ్యాజమైన ప్రేమను పెంచుకుంటారు. అదే మరి కన్న ప్రేమంటే! అలాగే మన ప్రేమ పరిణామంతో గానీ, పరిధితో గానీ ఏమాత్రం సంబంధం లేకుండానే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అదే దైవ ప్రేమ! మానవులంతా ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకోవాలని, ఆ ప్రేమ… దేవుడి మూలంగానే కలుగుతుంది కాబట్టి, ప్రేమించే ప్రతివాడూ దేవుణ్ని బాగా తెలుసుకోగలడు. దేవుడు ప్రేమాస్వరూపి. అదే ప్రేమతోనే ఆయన్ను దర్శించుకోవాలి. ఏ ప్రేమా లేనివాడు దేవుణ్ని తెలుసుకోలేడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మన కోసం తన ప్రియ కుమారుడిని ఇక్కడికి పంపించాడు. మనం ఆయన ద్వారా మాత్రమే విమోచన పొందేలా, జీవించేలా చేశాడు.
ఒకసారి ఏసు వచ్చి ఓ జన సమూహాన్ని చూశాడు. వారు కాపరి లేని గొర్రెల్లా ఉండేసరికి జాలిపడి, వారికి అనేక సంగతుల్ని బోధించాడు. చాలా పొద్దు పోయిన తర్వాత ఆయన శిష్యులు భోజనం గురించి ఆలోచించడం మొదలెట్టారు. తన ప్రబోధం వినడానికి వచ్చిన వారికి భోజనం పెట్టడంలో విఫలం చెందారు. అందుకు ప్రభువు ‘మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడమ’ని చెప్పడంతో.. వాళ్లు అయిదు రొట్టెలు, రెండు చేపలున్నాయని తెలిపారు. అప్పుడు ప్రభువు పచ్చిక మీద వారందరినీ కూర్చోబెట్టాడు. ఆ అయిదు రొట్టెల్ని రెండు చేపల్ని పట్టుకొని, ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, అక్కడి జనాలకు వడ్డించేందుకు తన శిష్యులకిచ్చాడు. ఆ రెండు చేపల్ని అందరికీ పంచాడు. వారంతా తృప్తిగా తిని పొంగిపోతారు. ఆకలైన వేళ పట్టెడన్నం పెట్టిన వాడే భగవంతుడు అని చెప్పడానికి ఎవరూ సందేహించరు కదా!
ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024