భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు కనిపిస్తుంది. రామాయణంలో రామలక్ష్మణుల మొదలు చరిత్రలో ఎందరో కీర్తిమంతులు గురుకుల విద్యాభ్యాసంతోనే వన్నెకెక్కారు. తక్షశిల, నలంద, వారణాసి, ధాన్య కటకం వంటి గురుకుల విశ్వవిద్యాలయాలు మహోన్నత విద్యావ్యవస్థకు పట్టుగొమ్మలుగా నిలిచాయి.
అసలు గురుకుల విద్యే భారతీయ విద్యావ్యవస్థకు మూలం. గురు శుశ్రూషతో నిరంతర అధ్యయనం, పర్యావరణ పరిరక్షణ, ఆత్మరక్షణ, యుద్ధకౌశలం, మనోనిబ్బరం, సత్ప్రవర్తన వంటి అంశాలు విద్యార్థులకు అలవడుతాయి. రామాయణకాలంలో విద్యావ్యవస్థపై వాల్మీకి మహర్షి నిక్షిప్తం చేసిన పద్ధతులు అద్భుతం. నేడు ప్రతీ విద్యార్థి శ్రీరాముడిలా సౌశీల్యవంతుడిగా, ధర్మాచరణతో జీవనం సాగించాలంటే విద్యాభ్యాస సమయంలోనే నైతిక విలువలు నేర్పించడం గురువుల ప్రధాన కర్తవ్యం.
ఈ కాలంలోనూ పల్లెల నుంచి పట్నం వరకు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో నేటి గురుకులాలు నాటి రామాయణ కాలం నాటి కొన్ని పద్ధతులను అనుసరిస్తే విద్యార్థుల భవిత మరింత అద్భుతంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లల్లో గుండె నిబ్బరాన్ని పెంపొందించే దిశగా రామాయణ కాలం నాటి విద్యావ్యవస్థలోని కొన్ని అంశాలు దోహదం చేస్తాయనేది నిస్సందేహం.
దశరథ మహారాజు రాజ్యంలో శాస్త్రజ్ఞానం లేనివాడు, అశక్తుడు, విద్యలేనివాడు, అసత్యవాది, నాస్తికుడు లేరని వాల్మీకి చెప్పారు. అయోధ్యలో నగర ప్రజలు తమ పిల్లలను గురువుల పర్యవేక్షణలో గురుకులాలలో ఉంచి విద్యాబుద్ధులు చెప్పించేవారు. గురువులు తమ శిష్యుల మనోవికాసాన్ని పెంపొందించుతూ సుశిక్షణతో సభ్యత, సంస్కారాలను నేర్పి అన్ని విధాలా వారిని యోగ్యులుగా తీర్చిదిద్దేవారు.
విద్యార్థులకు చదువుతోపాటు సమాజంలో ఆదర్శవంతులుగా మెలగడానికి అవసరమైన వ్యక్తిత్వవికాస సూత్రాలను నేర్పేవారు. చక్రవర్తి కుమారులైన రామలక్ష్మణులు కూడా వసిష్ఠాశ్రమంలో శిష్యరికం చేశారు. ఆ తర్వాత విశ్వామిత్రుడి వెంట వెళ్లి దర్భలపై నిద్రించి ఒక తపస్సులాగే విద్యను ఉపాసించారు. సుధన్వుల వద్ద ధనుర్విద్యను అభ్యసించారు.
విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచర్య నిష్ఠను పాటిస్తూ, గురువులను వినయవిధేయతలతో సేవిస్తూ, ఆశ్రమ పరిశుభ్రత, హోమద్రవ్య సేకరణ, బ్రాహ్మీముహూర్త స్నానం, త్రిసంధ్యోపాసన, అగ్నికార్యం ఇవన్నీ నిత్యకృత్యాలుగా సహనంతో చేసేవారు. ఇలా విద్యాభ్యాస సమయంలో నియమబద్ధ జీవనం గడపడం వల్ల ఆ తర్వాత వారి ప్రయాణంలో ఎంతటి కష్టం వచ్చినా చలించకుండా ఉండే మానసిక ధృఢత్వాన్ని రామలక్ష్మణులు సంతరించుకున్నారని చెబుతారు వాల్మీకి మహర్షి.
తమ దగ్గర ఉన్న అన్ని విద్యలతో పాటు నిగూఢ విద్యలు కూడా నేర్పి వారిని సర్వతోన్ముఖులుగా తీర్చిదిద్దడం ఆనాటి గురువుల నైజంగా రామాయణం చెబుతుంది. సత్యం, ఇంద్రియ నిగ్రహం, కర్తవ్య నిష్ఠ, పవిత్ర జీవనం ఉత్తమ విద్యావంతుని లక్షణాలుగా వాల్మీకి చెప్పారు. అవి కలిగిన శిష్యులను గురువులు ప్రత్యేకంగా ఎంచుకుని వారికి నిగూఢ విద్యలు నేర్పించేవారని, విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలను బోధించడం కూడా ఇందులో భాగమేనని రామాయణంలో పేర్కొన్నారు. కొన్ని విద్యలు మంత్రశాస్త్ర రహస్యాలతో కూడుకుని సమాజానికి చేటుచేసేవి కాగా, వాటిని అత్యవసరమైతే తప్ప వినియోగించకూడదంటూ శిష్యులతో ప్రమాణం చేయించి నేర్పించేవారు.
రాముడు 14వేల మంది రాక్షసులను గంటా పన్నెండు నిముషాల్లో సంహరించినప్పుడు శూర్పణఖకు బాగా తెలిసిన బలగామినీ విద్యతో క్షణకాలంలో రావణుని ముందు వాలిందట. కైక తండ్రి కేకయరాజు జృంభమనే చీమ మాటలను గ్రహించడానికి పశుపక్ష్యాది సమస్త ప్రాణికోటి భాషలను తెలుసుకునే సర్వభూత రుత విద్యే కారణమని, నూరు యోజనాల దూరం చూడగలిగే ఛష్ముతీ విద్యను గురించి జటాయువు సోదరుడు సంపాతి మాటల్లో చెప్పడం.. ఇవన్నీ రామాయణంలో ప్రస్తావించిన విద్యలు.
ఇవే కాకుండా ఏ రూపాన్నైనా ధరించగలిగే కామరూపధారిణీ విద్య, పిల్లలను భూతప్రేతాల నుంచి రక్షించే భూతనాశినీ విద్య, హనుమంతుడు సుందరకాండలో పలుచోట్ల ఉపయోగించిన అణిమ, లఘిమ అనే సిద్ధ విద్యలను రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రస్తావించారు. ఈ విద్యలన్నీ నిగూఢమైనవి. మనోనిగ్రహం, ఏకాగ్రత, సమయస్ఫూర్తిని ఆధారంగా చేసుకుని అలాంటి లక్షణాలు ఉన్న వారికే ఈ విద్యలను గురువులు బోధించేవారు.
ఇక విద్యార్థులు తెల్లవారుజామునే లేచి సొంతంగా చదువుకోవడంతో పాటు విశ్రాంతివేళల్లో కుస్తీ వంటి పోటీలలో పాల్గొనేవారు. వాటిద్వారా వారికి శారీరక వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరిగేవి. ఇక ఆనాడే బృంద చర్చలకు కూడా చాలా ప్రాధాన్యం ఉండేది. శ్రీరాముడు గొప్ప వక్త. తన పక్షంలో న్యాయాన్ని గెలిపించుకోవడానికి చర్చలలో పాల్గొనేవారని, రాముడే కాకుండా సామాన్యులు కూడా తోటల్లో, ఇతర ప్రాంతాల్లో చర్చాగోష్ఠులు చేసి ఆ విశ్లేషణా సరళితో తమ విజ్ఞానానికి మరింత పదును పెట్టుకునేవారని రామాయణం చెబుతున్నది. ఇలా విలువలతో కూడిన విద్యతో పాటు శారీరక, మానసిక వికాసానికి అవసరమైన అనేక ప్రయోగాలు చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధానం రామాయణంలో కనిపిస్తుంది.
అటువంటి విలువలు ప్రస్తుత విద్యావిధానంలో తప్పనిసరిగా అవసరమవుతున్నాయి. విద్యార్థులు మనోనిబ్బరంతో, సత్యనిష్ఠతో, ఇంద్రియనిగ్రహంతో ఉండగలిగినప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. రామాయణ విద్యావ్యవస్థలో ఉన్న అంశాలను నేటి తరానికి అన్వయించుకుంటూ కాలానికి
తగ్గ మార్పులతో మూలసూత్రాలను వదిలివేయకుండా విద్యాలయాలు పరిణితి చెంది విలువల పరిరక్షణ జరగాలని ఆకాంక్షిద్దాం.
– రంగనాథ్ మిద్దెల,
9866573461