అసుర సంహారానికి పూనుకున్న అమ్మవారికి.. ముక్కోటి దేవతలు ఒక్కటిగా లోకోపకారం కోసం ఆయుధాలన్నీ అందించారు. రక్షణకు, శిక్షణకు ప్రతీకలైన ఆయుధాలవి. విశ్వ చైతన్య విజ్ఞాన రహస్యాలకు ఈ ఆయుధ సమ్మేళనం సూచిక. వీటిని ధరించిన అమ్మవారు మహిషాసురమర్దనం చేసింది. సజ్జనులను రక్షించింది. అస్త్రశస్ర్తాలను ధరించిన జగన్మాత విజయం సాధించింది. ఈ విజయ ముహూర్తంలోనే శ్రీరాముడు రావణసంహారం చేశాడు. అర్జునుడు విజయుడైనాడు. అందుకే పూర్వకాలంలో చక్రవర్తులు, రాజులు తమ ఆయుధాల్ని, వాహనాల్ని, రథాల్ని, శకటాల్ని మహర్నవమి నాడు ప్రత్యేకంగా అలంకరించేవారు. వివిధ వృత్తుల వారు తమకు జీవనోపాధిని అందించే పరికరాలను విజయదశమినాడు ఘనంగా పూజించేవారు.
ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు తాము వాడే ఉపకరణాలను విశేషంగా ఆరాధిస్తారు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా, నిత్యజీవితంలో ఉపకరించే ఆయుధాల్ని పూజించి జీవన సమరంలో విజయాల్ని ప్రసాదించమని అమ్మను కోరుకుంటారు. ముందుగా శుభ్రం చేసిన యంత్ర వాహనాలకు పసుపు కుంకుమలు పెట్టిన తరువాత పూలతో వివిధ ద్రవ్యాలతో అలంకరిస్తారు. తర్వాత హారతిచ్చి, ఎర్రనీళ్లు, బూడిద గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ వంటివాటితో దిష్టి తీస్తారు. ఈ కార్యక్రమాన్ని దుర్గాష్టమి నుంచి దసరా వరకు మూడు రోజుల్లో ఎప్పుడైనా పగటి పూట నిర్వహించుకోవచ్చు.