దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా, దక్షిణాయనం రాత్రివేళగా పేర్కొంటారు. ఉత్తర-దక్షిణాయనాలకు సంధిలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా అభివర్ణిస్తారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి, ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించి తరిస్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకోవడంతో తమ జన్మ పునీతమైందనే అనుభూతికి లోనవుతారు.
వైకుంఠం అంటే కుంఠములు లేని ప్రదేశం అని అర్థం. అంటే ఆందోళనలు, ఆత్రుతలు, ఆరాటాలు లేని ప్రదేశం అన్నమాట. అదే విష్ణు ధామం. పరంధామం. భౌతిక జగత్తుకు అతీతంగా ఉండే ఈ వైకుంఠ ధామం నుంచి శ్రీమహావిష్ణువు లోకంలోకి దిగి వస్తే, ఆ రూపాన్ని అవతారం అంటారు. ధర్మ సంస్థాపనార్థం, భక్తజన రక్షణార్థం ఆ దేవదేవుడు దిగి వస్తాడు. కొన్ని సమయాలలో ఆ భగవంతుడు, తన ఉత్తమ భక్తులను కూడా ఈ లోకానికి పంపిస్తాడు. భారతావనిలో ఆళ్వార్లు అన్న భాగవతోత్తములు అవతరించి సామాన్యులకు వైకుంఠ ప్రాప్తిని పొందే మార్గాలు బోధించారు.
వారిలో ఒకరు నమ్మాళ్వార్లు. వారు తన జీవితమంతా శ్రీవారి సేవలో ఉంటూ భగవంతుడి కీర్తిని, లీలలను వ్యాప్తి చేశారు. ఆ భాగవతోత్తముడు తన సేవలను సంపూర్ణంగా సమర్పించి తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. తన ఉత్తమ భక్తుడు తిరిగి వైకుంఠానికి వస్తున్న విషయం తెలిసి ఆ శ్రీవారు స్వయంగా తానే వైకుంఠ ద్వారానికి వేంచేసి స్వయంగా ఆ భక్తుడిని లోనికి తీసుకొని వెళ్లారట. ఇది తన భక్తులపై స్వామివారికి ఉండే వాత్సల్యాన్ని, అనుగ్రహాన్ని తెలియజేస్తుంది. ఈ వైకుంఠ ప్రవేశం ఏకాదశి నాడు జరగడంతో ఈ తిథిని వైకుంఠ ఏకాదశి అంటారు.
ఈ భగవత్ లీలను పురస్కరించుకుని అన్ని వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాన్ని అలంకరించి, ఆగమ పద్ధతుల ప్రకారం ద్వార పూజలు చేసి, వైకుంఠ ద్వారాన్ని స్థాపిస్తారు. ఈ పర్వదినం నాడు భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేయగలిగితే వారికి మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. ఆ భక్తులు ఈ లోకంలో క్లేశ రహితులై, జన్మాంతరం వైకుంఠానికి చేరుకుంటారు. భగవంతుడి అనంత కృపకు ఇది నిదర్శనం.
వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు కొన్ని నియమాలను పాటిస్తే, భగవంతుడి కృపకు పాత్రులు అవుతారనడంలో సందేహం లేదు. ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. కొందరు నిర్జల ఉపవాసం ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు.. పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి, సగ్గుబియ్యం, పల్లీలు, బెల్లం తీసుకోవచ్చు. ఉపవాసం ఆచరించడంతోపాటు రోజంతా భగవంతుడి చింతనలో గడపాలి. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మహామంత్రాన్ని సదా పఠించాలి. కనీసం 108 సార్లు అయినా జపించాలి. 16 మాలలు (ఒక మాల 108 సార్లు) జపిస్తే అనంత పుణ్యం దక్కుతుందని పెద్దల మాట. అంతేకాదు, ఈ రోజు చేసే దానాలు ఉన్నతమైన ఫలితాలు అందిస్తాయి. గోసేవకు ఉదారంగా దానాలు చేయాలి.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తారు. భక్తులందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఆ వైకుంఠనాథుడి దర్శన భాగ్యం లభిస్తుంది.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 96400 86664