గురువారం 22 అక్టోబర్ 2020
Devotional - Sep 30, 2020 , 03:28:04

ఆధ్యాత్మిక జీవనానికి పునాది

ఆధ్యాత్మిక జీవనానికి పునాది

ఆరోగ్యం, సహజత్వం, సరళత్వం, కృతజ్ఞత, వినయం, ప్రేమ, వీరం, జ్ఞానం, సమర్థత, స్వతంత్రత, శాంతం, ఆనందం.. కలిసి పండించే శుభజీవన సంపదే శివం. దానిని పండించేదే విద్య. ఐహిక వికాసానికి, ఆధ్యాత్మిక పరిణతికి మార్గం వేసే మూలచైతన్య శక్తికూడా విద్యనే. సహజాతాల వికృత విజృంభణలను నియంత్రిస్తూ, సత్యశోధన వైపు వాటిని నిశిత పరుస్తూ, సమష్టి సమాజ సంక్షేమంపై ప్రసరింపజేసే సాంస్కృతిక మహోపకరణంగా విద్యను పేర్కొనాలి. అభ్యసన శీలం మనిషి నైజం. అది అతని మౌలికావసరం కూడా. జీవితం ఎప్పటికీ భద్రతతో వర్ధిల్లాలంటే మనిషి నిత్యవిద్యార్థిగా మసలుకోవలసి ఉంటుంది. విపరీతమైన వేగంతో, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, విజ్ఞాన ఫలాలనూ, ప్రభుత్వాలనూ, శాసనాలనూ నియంత్రిస్తున్న ప్రపంచస్థాయి వ్యాపార ప్రాబల్యంతో మారిన వర్తమానంలో మనిషి తనను తాను నిత్యవిద్యార్థిగా సంసిద్ధుణ్ణి చేసుకోవడం అనివార్యం. ఒకప్పుడు సమాజ వ్యవస్థలో భాగమైన విద్య ఆధునిక కాలంలో ప్రభుత్వ వ్యవస్థలో భాగమైంది. ఫలితంగా విద్య అంశాలూ, ఆశయాలు, బోధనాక్రమం, ప్రయోజనాలూ అన్నిటినీ ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో విద్య ‘మౌలిక లౌకికవిద్య’గా రూపొందింది. ఫలితంగా ‘ఆధ్యాత్మిక విద్య’ ఆనుషంగికాంశంగా లేదా నిస్సంబంధ విషయంగా మారింది.

ఆధ్యాత్మికత (శుభజీవన శివసంపద)ను మతానికి ముడి పెట్టడం వల్ల ఏర్పడిన అజ్ఞాన దుస్థితి ఇది. విద్య ఎవరి సారథ్యంలో సాగినా సంక్షేమం, అభ్యుదయం, భద్ర భవిష్యత్తు అన్నవి ముఖ్యం. ఇవన్నీ ప్రజల ప్రవర్తనలో సమాజం పట్ల, ప్రకృతి పట్ల ప్రకటితమయ్యే కృతజ్ఞత, వినయం, ఆదరణలపైనే ఆధారపడి ఉంటాయన్నది ప్రబల సత్యం. ఆయా స్థాయిలకు తగినట్లు విద్యాబోధన జరగాలె. విద్యా ప్రణాళికలలో భాగంగా వివిధ కార్యక్రమాలద్వారా విద్యార్థుల హృదయాల్లో అందుకు తగిన బీజాలు పడేటట్లు చూడాలె. ఇది ‘మతాతీతమైన సర్వజన సుఖకర సత్యం’ అన్న అవగాహన విద్యార్థి దశలోనే స్పష్టంగా కలగాలి. అప్పుడే, అసలైన ఆధ్యాత్మిక జీవనానికి చక్కని పునాది పడుతుంది. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగ జీవితంలో కూడా బలంగా నిలబడటానికి, ఉన్నతిని సాధించడానికి సంబంధిత విషయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను కాలానుగుణంగా నవీకరించుకోవలసిన అవసరం ఉంటుంది. వాటితోపాటు పెరిగే బాధ్యతలను, సవాళ్లను నిర్మాణాత్మకంగా ఎదుర్కొని, ఆరోగ్యకరంగా పరిష్కరించడానికి అందుకు తగినంతగా ఆధ్యాత్మిక బలాన్నికూడా పెంపొందించుకోవాలి. నవీన విద్యలో ఆధునిక శాస్త్రవిజ్ఞానంతో ప్రాచీన యోగ, వైద్య, గణిత, న్యాయ, నిర్మాణ, తత్త్వ, భాషాది శాస్ర్తాలను తగిన ప్రయోగానుభవం ఆధారంగా అనుసంధానించగలగాలి. దీనివల్ల విద్యలో ‘శుష్కలాభ దృష్టి’ పోతుంది. ఆత్మీయతతో కూడిన బాధ్యతాయుత దృష్టి పరిఢవిల్లుతుంది.

అప్పుడు సహజంగానే సమాజంలో తగిన ఆధ్యాత్మిక పరిణతి కలిగి, అంధ మత విశ్వాసం, విరోధం తొలగి దైవీయ మానవ మూల్యాలు బలపడుతై. ఇవి సమగ్ర శాంతిమయ పురోగతికి దారివేస్తాయి. అజ్ఞానం, పిడివాదాలకు తావులేని సత్యనిష్ఠతో బహుముఖీనమైన శాస్త్రవిజ్ఞానాన్ని సాంకేతికాభివృద్ధికే కాక తత్త్వసంస్కరణలకు, వ్యాప్తికి కూడా వాడుకోవలసిన అవసరం చాలా ఉంది. స్వచ్ఛ హృదయ విస్తృతిని పెంచే ఆధ్యాత్మిక మాధుర్యంతో శాస్త్రవిజ్ఞాన ఫలాల ఉత్పత్తినీ, వినియోగాన్నీ స్వచ్ఛందంగా నియంత్రించవలసి ఉంటుంది. అప్పుడు వివిధ సంకుచిత శృంఖలాలను విదిలించుకున్న, ఆత్మీయమైన వికాస సమాజం విశ్వగురువుగా విలసిల్లుతుంది. ఈ విధంగా మానవాళి చింతనలో శాస్త్రీయతను, చిత్తంలో ఆధ్యాత్మికతను సంపుష్ఠం చేసే నవ్య విద్యయే అఖండ జగద్రక్ష.


- యముగంటి ప్రభాకర్‌ 94401 52258


logo