అనంత ఫలాన్ని ఇచ్చే పుణ్యప్రదాయిని తొలి ఏకాదశి. ఈ పర్వదినం ఉపవాస ప్రధాన పండుగ. దశమి నాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలు, ద్వాదశి రాత్రి ఉపవాసం చేయాలి. ఇలా త్రిరాత్ర ఉపవాస వ్రతం ఆచరించే విధానం ఉంది. మూడు రోజుల్లో నాలుగు పూటలు ఉపవాసాలు ఉండటం దీనిలోని ప్రత్యేకత. దశమి నాటి రాత్రి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్లి.. మహావిష్ణువును అర్చిస్తారట. ఆ సమయంలో మనం కూడా ఉపవాసం పాటిస్తూ మహావిష్ణువును ధ్యానం చేస్తే.. సమస్త దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ఏకాదశి రోజు రెండు పూటలా ఉపవాసం ఉండి హరినామ సంకీర్తనలతో తరించాలి.
మర్నాడు పగటిపూట పారణ చేయాలి. అంటే స్వామి ప్రసాదంగా భావించి సాత్విక ఆహారం తీసుకోవాలి. రాత్రికి మళ్లీ ఉపవాసం పాటిస్తే.. ఏకాదశి వ్రతం ముగుస్తుంది. ఈ ఉపవాస దీక్ష వెనుక వైద్యపరమైన విశేషాలు కనిపిస్తాయి. ఆషాఢం మొదలు వానలు పుంజుకుంటాయి. వాతావరణంలో ఊహించని మార్పులు వస్తుంటాయి. వాటిని తట్టుకొనేందుకు వీలుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడమే ఏకాదశి ఉపవాస దీక్ష లక్ష్యంగా చెబుతారు పెద్దలు. దీని ఫలితంగా రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు జీర్ణకోశంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాతి కాలంలో వాతావరణ మార్పులకు శరీరం తట్టుకునేందుకు ఇది సాయపడుతుంది.