ధర్మరాజుకు యుధిష్ఠిరుడు అనే పేరు ఎలా వచ్చింది?
వై.ప్రణవ్ దత్త, హైదరాబాద్
పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు యుధిష్ఠిరుడు. నామకరణం సమయంలో ఆకాశవాణి ‘యుధిష్ఠిరుడు’ అని పలికిందట (మహాభారతం ఆది 5-97). ఆ మేరకు అదే పేరు పెట్టారు. యుధిః అంటే యుద్ధంలోనే కాకుండా ధర్మరక్షణలోనూ వెనకడుగు వేయకుండా స్థిరంగా ఉండేవాడని అర్థం. పేరుకు తగ్గట్టే, ధర్మరక్షణలో ఆదర్శంగా నిలిచి సార్థక నామధేయుడు అనిపించుకున్నాడు యుధిష్ఠిరుడు.
‘యతో ధర్మః తతో జయః’ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ‘ధర్మో రక్షతి రక్షితః’ ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తుంటారో వాళ్లని ఆ ధర్మమే రక్షిస్తుందని మన సనాతన ధర్మం చెపుతుంది. ధర్మబద్ధమైన నడవడికకు ప్రతీక ధర్మరాజు. ఎన్ని కష్టాలు ఎదురైనా సహేతుకమైన ధర్మ ప్రవర్తనమే ధర్మరాజును, ఆయన బలగాన్ని కాపాడింది. విజయాన్ని తెచ్చిపెట్టింది. ధర్మ రక్షకుడైన యమధర్మరాజు అంశతో జన్మించడం వల్ల యుధిష్ఠిరుడికి ధర్మనందనుడు అనే మరో పేరు ఏర్పడింది.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370