తెలుగింటి ఆడబిడ్డలకు రంగురంగుల ముగ్గుల పండుగ సంక్రాంతి. పిల్లలకు గాలిపటాల జోరు పంచే పండుగ ఇది. పచ్చని పంటలు చేతికందే సస్య సంక్రాంతి ఈ పర్వం. ఉత్తరాయణం ప్రవేశించి.. ఉత్తమ గమనం చాటే పండుగ కూడా ఇదే! తన మది దోచిన కొలని దోపరితో ఆండాళమ్మకు కల్యాణ పండుగ, దైత్యుల గండరగండడు అండగ నిలువగ ప్రియభక్తులకిది పెద్ద పండుగ.
‘సం’ అంటే మంచి అని,‘క్రాంతి’ అంటే అడుగు పెట్టడం అని అర్థం. నూతన సంవత్సరంలో మంచి మార్గంలో పయనించాలని ఎన్నో సంకల్పాలు చేసుకుంటాం. శుభపరిణామాలకు సైతం ఎదురుచూస్తాం. అందుకు సరైన సమయమే ‘సంక్రాంతి’. సమాజాన్ని క్రాంతి పథంలో నడిపే భారతీయ సంస్కృతి విధానానికి సంక్రాంతి ఓ ఆయువుపట్టు. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల ముచ్చటైన ఈ పండుగకు సూర్యుని శుభ సంక్రమణమే ఓ మూల కారణంగా చెప్పుకోవచ్చు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే (సంక్రమణం) ఆ రాశికి సంక్రాంతిగా వ్యవహరిస్తారు. కానీ, మకర సంక్రమణంతో మాత్రం అంతవరకూ ఆరు మాసాలపాటు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఇక ఉత్తర దిక్కుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. దీంతో దేవతా లోకాల్లో కూడా పగలు ప్రారంభమవుతుందని శాస్త్రం వివరిస్తుంది. అంటే, మనుషులు నిర్వర్తించే వివిధ యజ్ఞయాగాదులను స్వీకరించి మనకు అవసరమయ్యే వాటిని ప్రకృతి ద్వారా అందించే దేవతలు తిరిగి కార్యోన్ముఖులయ్యే ఈ సమయాన్ని పర్వదినంగా జరపడమే ఈ ‘మకర సంక్రాంతి’ లోని విశిష్టతన్నమాట.
ఈ ఒక్క విశిష్టతే కాదు. భూదేవి అంశగా, విష్ణుచిత్తుల ముద్దుబిడ్డగా జన్మించిన గోదాదేవి తాను ఆచరించిన వ్రత ఫలితాన్ని అందుకొని ఆ శ్రీరంగనాథుడిని పరిణయమాడిన శుభతిథి కూడా భోగి పర్వదినమే కావడం మరో విశేషం. ఏడాది పొడువునా ఎన్ని కల్యాణోత్సవాలున్నా, గోదా కల్యాణం మాత్రం అన్నిటిలోకీ ప్రత్యేకం. అన్ని కల్యాణోత్సవాలలో స్వామిదే వైభవమైతే, గోదా రంగనాథుల కల్యాణ క్రతువులో మాత్రం వైభవమంతా గోదా అమ్మవారిదే. సీతమ్మ గానీ, రుక్మిణీదేవి గానీ భగవంతుణ్ని తమలా కదిలే రూపంలోనే వివాహమాడితే, గోదాదేవి మాత్రం విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ని తన ఆచరణతో కదిలేట్టు చేసుకుంది. స్వయం భగవంతునికీ, భగవంతుని విగ్రహ స్వరూపానికీ ఎటువంటి వ్యత్యాసం లేదని నిరూపించింది. స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు అద్భుతమైన వ్రతాన్ని ఆచరించడమే గాక, అందరూ ఆచరించేటట్టుగా లోకానికి అందించింది గోదా అమ్మవారే. ఇదివరకూ ఇటువంటి వ్రతాన్ని బృందావనంలోని గోపికలు చేశారని విన్నాం. కానీ, వాటి పూర్తి వివరాలు మాత్రం భాగవతంలో తెలియపరచలేదు. బహుశా ఆ మాధుర్య భక్తిలోని మధురిమను అందరికీ అందించాలనేనేమో, సుమారు పన్నెండు వందల సంవత్సరాల కిందట గోదాదేవి అందించిన ఆ పాశురాలే పాశుపతాస్ర్తాలై జీవుని శరణాగతికి అడ్డువచ్చే అవాంతరాలను సుదూరంగా తరిమి పరమాత్మను చేరే మార్గాన్ని సుగమం చేస్తున్నాయి.
దక్షిణాదిలోని శ్రీవిల్లిపుత్తూరు అనే పుణ్యక్షేత్రంలో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవారు. శ్రీకృష్ణుడు వటపత్రశాయిగా కొలువైన ఈ పవిత్రధామంలో స్వామికి నిత్యం పుష్పమాలలను అల్లి సమర్పించేవారు విష్ణుచిత్తులు. జనక మహారాజుకు సీతమ్మ లభించిన విధంగా, ఒకనాడు ఇంటనున్న తులసీవనంలో విష్ణుచిత్తులు పాదులు తీస్తుండగా అయోనిజ అయిన చంటిపాప లభించింది. ఆ వటపత్రశాయి ప్రసాదంగా భావించి, ‘కోదై’ (పూలమాల) అని పేరుపెట్టి గారాబంగా పెంచుకోసాగారు విష్ణుచిత్తులు.
చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడి లీలలను వింటూ ఆడుతూపాడుతూ పెరిగిన కోదైకు క్రమేణా తండ్రి విష్ణుచిత్తుని భక్తిప్రపత్తులు కూడా సంప్రాప్తించాయి. కన్నయ్య లీలా మాధుర్యంలో తన్మయత్వం చెందేది. ప్రతిరోజూ వటపత్రశాయి కోసం విష్ణుచిత్తుడు రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే నల్లనయ్యను చూసుకొని మురిసిపోయేది. ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనేపడింది. తన సేవలో అపచారం జరిగిపోయిందని కుంగిపోయిన విష్ణుచిత్తునికి కృష్ణుడే కలలో కనిపించి గోదాదేవి స్పృశించిన మాలలు తనకు అమితానందాన్ని ఇస్తున్నాయన్న విషయాన్ని చెప్పగా కోదైలోని విశుద్ధ మాధుర్య భక్తిని గ్రహించాడు ఆ తండ్రి.
యుక్తవయస్సు వచ్చేసరికి కోదై హృదయంలో శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ నాటుకుపోయింది. వివాహమంటూ జరిగితే ఆయనతోనే అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. తాను ఆచరించటమేగాక తోటి స్నేహితురాళ్లనే గోపికలుగా భావించి తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది. ఇక తామున్న ఆ గ్రామమే వ్రజపురమైంది. అలా ప్రతిరోజూ తన స్నేహితురాళ్లను ప్రాతఃవేళలోనే నిద్రలేపుతూ, మాధుర్య కృష్ణ భక్తిని చాటుతూ ఆమె ఆలపించిన గేయాలే పాశురాలు. తిరుప్పావైగా లోక ప్రసిద్ధి చెందాయివి. ముప్పయ్ రోజుల పాశుర వ్రతం భగవంతుని సన్నిధానాన్ని చేరుస్తుంది. నిస్వార్థ భక్తి ప్రపత్తులతో చేసిన ఎంతటి చిన్న సేవనైనా భగవంతుడు పరమోన్నతమైనదిగా స్వీకరించి అనుగ్రహిస్తాడనటానికి నిదర్శనమే ఆ పల్లె భక్తురాళ్ల విజయం. ఇది యావత్ భక్త ప్రపంచానికి గోదాదేవి అందించిన విజయం.
తన భక్తుల మాధుర్యభక్తిని మధుపంలా ఆస్వాదించేందుకు భగవంతుడు సైతం కదలివస్తాడా అని సంశయించేవారికి శ్రీ చైతన్య మహాప్రభువుల వారు చూపిన భక్తిమార్గం సైతం మరో సమాధానం. సుమారు 500 సంవత్సరాల క్రితం అవతరించిన శ్రీచైతన్య మహాప్రభువులు భగవన్నామ సంకీర్తనే ఈ కలియుగంలో మనమందరం ఆచరించదగ్గ అత్యున్నత యుగధర్మమని తెలిపారు. వారి బోధనలు ఆధ్యాత్మిక మార్గ సంక్రమణానికి నేటి సమాజానికి అందివచ్చిన మార్గదర్శకాలు. హరే కృష్ణ!
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984