ఒకనొక మహానగరం విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరింది. ఓ ఆధ్యాత్మిక గురువు అందులో ప్రయాణిస్తున్నాడు. ఆయన పక్క సీటులోని వ్యాపారవేత్త ఆ గురువును ఇలా ప్రశ్నించాడు. ‘కొంతకాలంగా నేనొక సమస్యతో సతమతమవుతున్నాను. నిద్ర రావడం లేదు, అన్నం సహించడం లేదు. దాన్నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి?’ అని అడిగాడు. ‘ఏదైనా మనకు మించింది కాదు కదా, ఆ సమస్యను పట్టించుకోవద్దు. తక్షణం వదిలేయ్’ అని బదులిచ్చాడు గురువు.
‘అలా వదిలేస్తే ఎలా? జరగరానిది జరిగితే?’ అని ఎదురు ప్రశ్న వేశాడు వ్యాపారి. ‘నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా జరగాల్సిందే జరుగుతుంది. జరిగినదాన్ని అంగీకరించక తప్పదు. నువ్వు ప్రయత్నించినా, ప్రయత్నించకపోయినా ఏదో ఒకరోజు సమస్య పరిష్కారం అవుతుంది. అంతవరకు మనం ప్రేక్షకపాత్ర వహిస్తే చాలు!’ అని సెలవిచ్చాడు గురువు. ‘అయితే నన్ను ఏమీ చేయకుండా, ఊరకే ఉండి పొమ్మంటారా?’ అని అడిగాడు వ్యాపారి.
‘ఊరకే ఉండువాడు ఉత్తమ యోగి అని వినలేదా’ అన్నాడు గురువు. కాసేపు మౌనం వహించిన వ్యాపారి ‘మరి దానికి పరిష్కారం ఎలా?’ అని అడిగాడు. ‘కాలం గడిచే కొద్దీ సమస్య చిన్నదవుతుంది. మనం అంతవరకు వేచి చూడాలి!’ అని సలహా ఇచ్చాడు గురువు. ఆ సమాధానానికి విస్తుపోయిన వ్యాపారి ‘కాలం గడిచే కొద్దీ సమస్య ఎలా చిన్నదవుతుంది?’ అని మళ్లీ ప్రశ్నించాడు. ‘ఇందాక మనం విమానం ఎక్కిన ఊరు మహానగరమని నమ్ముతావా’ అని అడిగాడు గురువు.
‘అందులో అనుమానమేముంది? నేను పుట్టినప్పటినుంచీ చూస్తున్నాను. రోజురోజుకూ నగరం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు!’ ధీమాగా చెప్పాడు వ్యాపారి. ‘ఒకసారి విమానం కిటికీలో నుంచి తొంగి చూడు. నగరం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చెప్పు’ అన్నాడు. అలాగే తొంగిచూశాడు వ్యాపారి. ఆ మహానగరం చిన్న ఊరులా కనిపించింది వ్యాపారికి. కొద్ది సేపటికి తేరుకొని ‘నిజమే! అప్పటికప్పుడే సమస్యని చూస్తే అది ఏనుగులాగా అనిపిస్తుంది. కాసేపు వేచి ఉంటే.. అదే సమస్య చీమంత అవుతుంది’ అని తెలుసుకున్నాడు వ్యాపారి.
…? ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821