ఇస్లాం బోధ
‘ఆహారం విషయంలో హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు’ అని ఖురాన్ హెచ్చరిక. ఆహార వృథాను ఈ పవిత్ర గ్రంథం తీవ్రంగా ఖండించింది.‘తినేటప్పుడు ఆహార వస్త్రంపై పడిన మెతుకులను తీసి తినేవారిని అల్లాహ్ కరుణిస్తాడు’ అని ముహమ్మద్ ప్రవక్త (స) చెప్పారు. అంటే ఒక్క మెతుకు కూడా వృథా కారాదన్నది దీని సారాంశం. అన్నం మెతుకుల్ని పారేయడానికి ఎంతో సమయం పట్టదు. కానీ, ఆ మెతుకులు మన నోటిదాకా చేరడానికి నెలలు శ్రమించాల్సి వస్తుంది.
ఆహారం దేవుడు ఇచ్చిన వరం. దానిపట్ల మర్యాదగా వ్యవహరించాలి. ఆహార వృథా అరికట్టడం, అన్నదానం ఇవి రెండూ సత్క్రియలే. బీదబిక్కీ, దారిద్య్రంలో మగ్గుతున్న వారిని గుర్తించి వారి ఆకలి తీర్చడం మంచి లక్షణంగా ఖురాన్ పేర్కొంది. అల్లాహ్ మీది ప్రేమతో పేదలకూ, అనాథలకూ, ఖైదీలకూ అన్నం పెడుతూ.. ‘మేము కేవలం అల్లాహ్ కోసమే మీకు అన్నం పెడుతున్నాం. మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, కృతజ్ఞతలను గానీ ఆశించటం లేదు’ అన్న ఖురాన్ మాటలు ఆచరించే వాళ్లు ధన్యులు.
ప్రవక్త సహచరులు తమ జీవితాంతం ఏ ఒక్కరినీ ఆకలిదప్పులతో గడపనిచ్చేవారు కాదు. తాము పస్తులుండైనా సరే తమ తోటివారి ఆకలి తీర్చేవారు. వారు స్వయంగా అగత్యం కలవారైనప్పటికీ, తమకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ‘పొరుగువాడు ఆకలితో ఉండి తాను మాత్రం కడుపారా భుజించినవాడు ఎన్నటికీ విశ్వాసి కాలేడు’ అన్న ఖురాన్ వచనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎదుటివాడి ఆకలి తీర్చాలి. మన ఆకలి తీర్చుకునేటప్పుడు అన్నం వృథాకాకుండా చూసుకోవాలి. ఖురాన్ చెప్పిన సత్యమిదే!
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076