ఇస్లాం బోధ
అబ్దుల్ ఖాదర్ జీలానీ (రహ్మాలై) గొప్ప పండితుడు. ముస్లిం సమాజం ఆ మహనీయుణ్ని నిత్యం స్మరించుకుంటుంది. ఆయన బోధనలను గుర్తుచేసుకొని స్ఫూర్తి పొందుతుంది. అబ్దుల్ ఖాదర్ జీలానీ (రహ్మాలై) ఇరాన్‌కు వాయువ్య ప్రాంతంలో ఉన్న ‘గీలాన్’ ప్రాంతంలోని ‘నీఫ్’ గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా, అబూ సాలిహ్ మూసా అల్ హసనీ. తల్లి సమక్షంలోనే ప్రాథమిక విద్యను నేర్చుకున్నారు. ఆ తరువాత గీలాన్లోనే ఒక మదర్సాలో ఆయనను చేర్పించారు. ఖాదర్ జీలానీ (రహ్మాలై) చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండేవారు. ఏదైనా ఒక్కసారి విన్న విషయాన్ని ఆయనలా గుర్తుంచుకునేవారు. అతిచిన్న వయసులోనే ఆయన అక్కడి మదర్సా విద్యను పూర్తి చేసుకున్నారు. ఆయన పదకొండేళ్లకు చేరేసరికి తండ్రిని కోల్పోయారు. బాగోగులన్నీ తల్లి చూసుకునేవారు. కొడుకు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు ఆమె ఎంతగానో పాటుపడ్డారు.
అబ్దుల్ కాదర్ జీలానీ (రహ్మాలై)ని దివ్య ఖురాన్ విద్య నేర్చుకోవాల్సిందిగా బాగ్దాగ్కు పంపాలని అనుకుంది అతని తల్లి. తాము ఉండే గీలాన్ నుంచి బాగ్దాద్‌కు 40 మైళ్ల దూరం. పిల్లాడికి అన్ని జాగ్రత్తలూ చెప్పి ప్రయాణానికి సిద్ధం చేసింది. కుర్రాడి చొక్కాలోపల జేబులో 40 దినార్లు ఉంచి పైనుంచి కుట్లు వేసింది. ‘నాన్నా! ప్రాణాల మీదికి వచ్చినా అబద్ధం చెప్పొద్దు’ అని హితవు చెప్పింది. బాగ్దాద్‌కు బయల్దేరాడు జీలానీ. దట్టమైన అడవి గుండా వెళ్తూ మార్గంలోని ఓ బిడారుకు చేరుకున్నాడు.
అదే సమయంలో ఓ బందిపోటు ముఠా ఆ బిడారుపై దాడికి దిగింది. అందరినీ నిలువునా దోచుకున్నారు దొంగలు. జీలానీని చూసిన దొంగలు ‘నీ దగ్గర ఏముందో చెప్పు?’ అని గద్దించారు. ఆ కుర్రవాడు తడుముకోకుండా ‘నా దగ్గర 40 దీనార్లున్నాయి’ అని చెప్పాడు. ఆ మాటకు ఆశ్చర్యపోయిన దొంగలు పిల్లాడిని తమ ముఠా నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. బందిపోటు నాయకుడి ముందు కూడా జీలానీ అదే సమాధానం ఇచ్చాడు. ‘మరైతే ఆ దీనార్లు ఎక్కడ?’ అడిగాడు ముఠానాయకుడు. ‘చంక కిందిభాగంలో చొక్కా లోపలి జేబులో కుట్టి ఉన్నాయి’ అని చెప్పాడు. ‘నా దగ్గరేమీ లేవు అంటే నీ దీనార్లు నీకు మిగిలేవి కదా?’ అని సందేహంగా అడిగాడు ముఠా నాయకుడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదని మా అమ్మ చెప్పిందండీ.
అమ్మ మాటను జవదాటకూడదు కదా’ అన్నాడు జీలానీ. ఆ మాటలకు ముఠా నాయకుడికి కనువిప్పు కలిగింది. వెంటనే ఆ దోపిడీ దొంగలు ఆ కుర్రాడి చేతులపై చేయి వేసి జీవితంలో ఎన్నడూ దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడమని ప్రతిజ్ఞ చేశారు. బందిపోటు ముఠా పశ్చాత్తాపంతో కుంగిపోయేలా చేసిన జీలానీ బాగ్దాద్ చేరుకొని, విద్యావంతుడిగా ఎదిగారు. గొప్ప పండితుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ముస్లిమ్ సముదాయానికి ఆదర్శమూర్తిగా నిలిచారు. ఏటా ఆయన జయంతి, వర్ధంతులను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ముస్లిమ్‌లు. ఈ నెల 14న ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా రబీ ఉస్సాని నెల అంతా కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇస్లామ్ సమాజానికి ఆయన చేసిన సేవలను తలుచుకుంటారు.
…? ముహమ్మద్ ముజాహిద్ 96406 22076