ఆదిశంకరులు భారతావని నాలుగు దిక్కుల్లో స్థాపించిన చతురామ్నాయ పీఠాలు.. భారతీయ ఆధ్యాత్మికతకు శక్తి కేంద్రాలు. జగద్గురు పీఠాలలో అత్యంత విశిష్టతను, ప్రాముఖ్యతను సంతరించుకున్నది దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం. శంకర భగవత్పాదుల నుంచి కొనసాగుతూ వస్తున్న గురు పరంపర సనాతన ధర్మాన్ని అహరహం కాపాడుతున్నది. ఈ పరంపరలో భాగంగా విధుశేఖర భారతీ స్వామి శారదా పీఠం 37 పీఠాధీశ్వరులుగా, ఉత్తరాధికారిగా యోగపట్టం అందుకుని దశాబ్ది కాలం అవుతున్నది. భారతీతీర్థ మహాస్వామి వారి ఆశీస్సులతో విధుశేఖర భారతి స్వామి శృంగేరి వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిష్ఠించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆ అద్వైత స్ఫూర్తిని స్మరించుకుందాం.
సనానత వైదిక కుటుంబంలో జన్మించిన విధుశేఖర భారతీ స్వామి పూర్వాశ్రమ నామం కుప్పా వేంకటేశ్వర ప్రసాదశర్మ. వీరి పితామహుడు రామగోపాల శర్మ వాజపేయ శ్రౌత యాగం నిర్వహించారు. శారదా పీఠంలో జరిగే అనేక వైదిక క్రతువుల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవారు. తండ్రి కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని వైదిక పండితుడు. తాత, తండ్రితో అడపాదడపా శృంగేరికి వెళ్లేవారు ప్రసాదశర్మ. ఈ క్రమంలో భారతీతీర్థ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జగద్గురువుల దగ్గర శాస్త్ర అధ్యయనం చేయాలనే కోరికను వ్యక్తం చేయడం, అందుకు ఆయన సమ్మతించడం శారదాంబ సంకల్పమే! భారతీతీర్థ స్వామి మార్గదర్శకత్వంలో, శృంగేరిలోని వేదపండితుల సారథ్యంలో సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించారు ప్రసాదశర్మ. వేద, వేదాంగాలు చదువుకున్నారు.
శాస్త్ర అధ్యయనంపై శిష్యుడికి ఉన్న శ్రద్ధను గమనించిన భారతీతీర్థ మహాస్వామి స్వయంగా తర్క, మీమాంస శాస్ర్తాలను బోధించారు. జగద్గురువు ప్రత్యక్ష బోధనలో ఐదున్నరేండ్లు తీవ్ర అధ్యయనం చేసి పండితుడిగా, భక్తుడిగా ఎదిగారు. శృంగేరీ పీఠం గురు పరంపరను కొనసాగించే సకల సామర్థ్యాలనూ ప్రసాద శర్మ సంతరించుకున్నారని భావించిన భారతీ తీర్థ మహాస్వామి.. వారిని 2015లో పీఠానికి ఉత్తరాధికారిగా నియమించడానికి నిర్ణయించారు. అలా మాఘ శుద్ధ విదియ, తదియ తిథుల్లో ఉత్తర పీఠాధిపతి శిష్య స్వీకార మహోత్సవం జరిగింది. తుంగా తీరంలో, అభినవ విద్యాతీర్థ మహాస్వామి అధిష్ఠానంలో శ్రీచరణులు శిష్యుడికి ప్రణవోపదేశం, మహావాక్యోపదేశం చేసి ‘శ్రీ విధుశేఖర భారతి’ అనే యోగపట్టాను అనుగ్రహించారు. ఆనాటి నుంచి శృంగేరీ ఉత్తరాధికారిగా ప్రస్థానం కొనసాగిస్తున్న విధుశేఖర భారతీస్వామి గురుదేవుల మార్గనిర్దేశంలో సనాతన వైదిక ధర్మ రక్షణే ఆలంబనగా పరిశ్రమిస్తున్నారు. అద్వైత దీప్తిగా, లోతైన అనుగ్రహ భాషణంతో ప్రజ్ఞాన కీర్తిగా శారదాపీఠ ప్రభను పెంపుదల చేస్తున్నారు.
– శ్రీ