దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు గోలోక బృందావనం నుంచి ఈ లోకానికి దిగివచ్చిన పర్వదినం శ్రీకృష్ణాష్టమి. సర్వ స్వతంత్రుడైన కృష్ణభగవానుడు ఎప్పుడు, ఎక్కడ అవతరించాలన్నది తానే నిర్ణయిస్తాడు. శ్రీమద్భాగవతం ప్రకారం, శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడి కాలగమనం ప్రకారం వారి ఒక్కరోజు పగటికాలంలో ఒక్కసారి మాత్రమే ఈ లోకంలో అవతరిస్తాడు. మానవుడి కాలగతిలో ఇది 432 కోట్ల సంవత్సరాలకు సమానం.
Krishna janmashtami | లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు అవతరణ సమయంలో తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు సర్వాభరణ భూషితుడైన విష్ణుమూర్తిగా తొలుత దర్శనమిచ్చాడు. తర్వాత దేవకీదేవి వినతిపై మానవ మాత్రుడైన పసివాడిలా రూపాంతరం చెందాడు. శ్రీకృష్ణుడి అసాధారణమైన ఈ ఆవిర్భావంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే, దేవదేవుని అవతరణ కేవలం వారి ఆంతరంగిక శక్తితో జరుగుతుంది కానీ, ఎలాంటి లౌకిక సదుపాయాలు, నియమాలపై ఆధారపడి ఉండదు.
ప్రాపంచిక వాస్తవాలను మనకు గుర్తు చేయడానికి, జనన-మరణాలను దాటించడానికే పరమాత్మ అవతరించాడు. శాశ్వతమైన, నిరంతరాయమైన ఆనందాన్ని పొందాలనే మనలోని కోరికను మనకు గుర్తుచేస్తూ, సనాతనమైన మన నిజ స్వరూప స్థితిని మనకు తెలిపేందుకే భగవానుడు అరుదెంచాడు. భగవద్గీత రెండో అధ్యాయంలో (2.13) అందరినీ ఆశ్చర్యపరుస్తూ, మనమంతా ఈ భౌతిక దేహాలం కాదని, ఆత్మ స్వరూపులమని శ్రీకృష్ణుడు వివరించాడు. ఆత్మస్వరూపులమైన మనమందరం శాశ్వతత్వం, నిరంతర ఆనందం, సంపూర్ణ జ్ఞానం కోసం తపిస్తున్నాం. కానీ, ఈ భౌతిక ప్రపంచం ఈ తపనలను తీర్చలేదు! అంటే, మనది కాని ఏదో పరాయి ప్రాంతంలో మనం ఉంటున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులైన ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు దీనిపై వివరిస్తూ, ‘మన పరిస్థితి నీటిలో నుంచి బయటకొచ్చి నేలపై పడిన చేపలా ఉన్నద’ని అంటారు. చేప సంతోషం కోసం నేలపై దానికి ఎన్ని ఏర్పాట్లు చేసినా, అది సంతోషంగా ఉండలేదు.
లోకంలో అధర్మం ప్రబలి ధర్మం క్షీణించినప్పుడల్లా తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేశాడు. అయితే, కలహ, కల్మషాలతో కూడిన ప్రస్తుత యుగంలో కూడా శ్రీకృష్ణుడు అవతరించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడా అని ఎవరైనా అనుకోవచ్చు. అదృష్టవశాత్తూ ఆ పరమాత్మ మన మధ్యే ఉన్నాడన్నది ఊరట కలిగించే విశేషం! ప్రస్తుత కలియుగంలో శ్రీకృష్ణుడు నామ రూపంలో అవతరిస్తాడని శాస్ర్తాలు పేర్కొన్నాయి! ‘కలికాలే నామ రూపే కృష్ణావతార’ – ప్రస్తుత యుగంలో కృష్ణావతారం శబ్దరూపంలో ఉంటుంది. ఎవరైతే ఈ కృష్ణ నామాన్ని బిగ్గరగా జపిస్తారో, వారు కృష్ణావతార ప్రత్యక్ష సన్నిధానంలో ఉన్నట్టే! సర్వశక్తిమంతుడైన భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలలో అవతరించగలడు. ఆ నామ రూపాన్ని ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు పరంపరానుగతమైన మహామంత్రంగా మనకు అందించారు. అదే..
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరేరామ హరేరామ రామ రామ హరే హరే॥
శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఈ మహామంత్రాన్ని సదా జపించి, ఆ పరంధాముడి దివ్యానుగ్రహాన్ని పొందుదాం.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984