శ్రావణం వర్షాలు తీసుకొస్తుంది. హర్షాతిరేకాలను మోసుకొస్తుంది. ఈ మాసం ఆగమనంతో మేఘాలు వర్షిస్తాయి. చెరువులు, కుంటలు నిండుతాయి. పంటలు ప్రాణాలు పోసుకుంటాయి. ఇది ప్రకృతిలో కనిపించే మార్పు. ఆధ్యాత్మిక ప్రపంచంలో శ్రావణం ప్రత్యేకమైనది. ఈ నెలలో ప్రతిరోజూ ఏదో ఒక పర్వం పలకరిస్తుంది. పండుగలకైతే కొదువే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహానికి అనువైన మాసం ఇది. మంగళగౌరీ ఆశీస్సులు పొందడానికి ఇదే ఉత్తమ సమయం. తరలి వస్తున్న శ్రావణం శివారాధనకు, శ్రీకృష్ణభగవానుడి సేవకూ సిద్ధమవ్వాలని చెబుతున్నది.
నకోపి వాసరోయత్ర వ్రత శూన్యః ప్రదృశ్యతే
ప్రాయేణ తిథయశ్చాపి వ్రతవత్యోత్ర మాసివై’
శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారమూ పవిత్రమైందే. ప్రతి తిథి విశేషమైందే. ఆధ్యాత్మిక చైతన్యంతో లౌకిక జీవనాన్ని సంస్కరించుకునే పవిత్ర మాసం ఇది. వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. శ్రావణాన్ని శివరూపంగా పేర్కొన్నది స్కాంద పురాణం. ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే.. ‘పన్నెండు నెలల్లో సాక్షాత్తూ నేనే శ్రావణ మాసాన్ని’ అని పరమేశ్వరుడే స్వయంగా సనత్కుమార మహర్షికి చెబుతాడు. అంతేకాదు, మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే సంప్రాప్తించే ఫలితం.. శ్రావణంలో శ్రవణ మాత్రంతో (వినడంతోనే) కలుగుతుందని పురాణ కథనం.
ఈ నెలలో శ్రావణ మాస వ్రతం (నక్త వ్రతం) ఆచరిస్తారు కొందరు. శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలు బహుళ అమావాస్య వరకు వ్రతం కొనసాగిస్తారు. ఈ నెల రోజులపాటు ఈశ్వరారాధనను చేస్తూ ఉపవాసం ఉంటారు. రాత్రి పూట మాత్రమే భోజనం చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపైనే నిద్రిస్తారు. సాధన సంపత్తిని పెంచుకోవడానికి, ఈశ్వర అనుగ్రహం సంపాదించడానికి శ్రావణ వ్రతం చేస్తారు.
శ్రవణం శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం. శ్రీమహావిష్ణువు అర్ధాంగి అయిన శ్రీమహాలక్ష్మిని ప్రత్యేకంగా అర్చించడం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. పరిశీలన చేస్తే లక్ష్మీదేవి, మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి వీలైన మాసం ఇది. వేదాలను కాపాడటానికి శ్రీమహావిష్ణువు హయగ్రీవునిగా అవతారం ధరించింది ఈ నెలలోనే. అందువల్ల ఈ నెలలో వేద గ్రంథ ముద్రణకు సహకరించడం పుణ్యప్రదం. కనీసం వేద విద్యార్థులకు గ్రంథాలు దానం చేసినా శ్రీమహావిష్ణువును సేవించిన ఫలితం కలుగుతుందని
శ్రావణ సోమవారాల్లో మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలి. కాశి, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శైవక్షేత్రాలు.. శ్రావణ సోమవారాల్లో భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ రకంగా శివ కేశవ అభేదాన్ని ఈ మాసం చాటుతుంది. శ్రీకృష్ణపరమాత్మ అవతరించింది శ్రావణంలోనే. గరుత్మంతుడు అమృతభాండాన్ని సాధించింది కూడా ఈ నెలలోనే. శ్రావణంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజించాలని శాస్త్రం సూచించింది. ఈ ప్రకారం శ్రావణ సోమవారాల్లో పరమేశ్వరుడు; మంగళవారాల్లో గౌరీ వ్రతం లేదా అర్చనలు; బుధవారం విఠలేశ్వరుడు; గురువారాల్లో గురుదేవుడు; శుక్రవారాల్లో లక్ష్మీదేవి లేదా తులసి పూజలు; శనివారాల్లో శనీశ్వరుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయ స్వామికి విశేషంగా అర్చనలు చేయాలని పేర్కొన్నారు.
శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం: ఈ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి వారి వ్రతం చేయాలని చెబుతారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఉన్ననాడు ఈ వ్రతం ఆచరిస్తే అత్యంత శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. మంగళగౌరీ వ్రతం: శ్రావణంలో ప్రతి మంగళవారం ముత్తయిదువులందరూ విధి నియమాలు, ఆచారాల ప్రకారం మంగళగౌరీ దేవిని భక్తిశ్రద్ధలతో అర్చించి, వ్రతం చేస్తారు. ప్రత్యేకించి, నూతన వధువులు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. దీనిని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడని పురాణ కథనం. శ్రావణంలో నెల రోజులు పగటిపూట నిద్రించకూడదు. ఒక పూట మాత్రమే భోజనం చేసి, మంగళగౌరీ దేవిని అర్చిస్తే సకల శుభాలు, మాంగళ్య సౌభాగ్యం కలుగుతాయి.
శ్రీ వరలక్ష్మీ వ్రతం : శ్రావణమాసం అనగానే గుర్తుకువచ్చే వ్రతం ఇది. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏ కార్యానికైనా ‘సిద్ధి’ ప్రధానం. అది లేకపోతే కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే ‘సిద్ధి’ అనేది మొదటి లక్ష్మి. ఈ దేవత అనుగ్రహం కలిగితే కార్యభారం నుంచి విముక్తులవుతాం. ఆ ముక్తి.. ‘మోక్షలక్ష్మి’. ప్రతికూల పరిస్థితులను దాటడమే ‘జయలక్ష్మి’. కార్యసాధనకు కావలసిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, నిర్ణయశక్తి, విజ్ఞానం మొదలైనవి ‘విద్యాలక్ష్మి’. అంటే ‘సరస్వతి’. ఈ సరస్వతి ఫలితంగా పొందే సంపద, ఆనందం ‘శ్రీలక్ష్మి’. దానివల్ల కలిగే శ్రేష్ఠత్వం, ఉన్నతి ‘వరలక్ష్మి’. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం ఉంది. ఈ శ్రేష్ఠత లక్ష్మీ స్వరూపం. శ్రేష్ఠమైన/ ఉన్నతమైన లక్ష్మి (సంపద)ని పొందడమే అందరికీ చివరి గమ్యం. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ దేవిని అర్చించి, శాస్త్ర నియమానుసారంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయి.