వేదార్థాన్ని నిర్ణయించే న్యాయాన్ని- పద్ధతిని తెలిపేది ‘మీమాంసా’ శాస్త్రం. ఇది పూర్వ (కర్మ, ధర్మ) మీమాంస, ఉత్తర (బ్రహ్మ, జ్ఞాన) మీమాంస అని రెండు విధాలు. పరమాత్మ, గోపకాంతల అంతరంగాలలో తన యెడల కల అమల అచలమైన ప్రేమను బహిరంగ పరచాలి అన్న ఉద్దేశ్యంతో తాను అపూర్వంగా పూర్వ మీమాంసను- ధర్మాచరణాన్ని సమర్థిస్తూ, వారికి ఉత్తర మీమాంస- జ్ఞానకాండ పరంగా వాదించే పటిమ- ప్రజ్ఞను ప్రసాదించాడు. తన సన్నిధికి విచ్చేసిన ప్రేమ యోగినులైన గోపికలను గోవిందుడు ‘అపరాధినులు’గా బోను ఎక్కించాడు. ‘ఇందువదనలారా! మీరందరూ ఆనందంగా మీ మందకు- బృందావనానికి మరలిపొండి. ఇక్కడ ఉండరాదు. వెళ్లండి- వెళ్లండి’ అంటూ వెంటపట్టాడు. వారి కాళ్ల కింద కంప పెట్టాడు. ఇలా గడుసరియై శ్రీహరి వారిని పరిపరి విధాల పరీక్షకు గురిచేశాడు.
‘నన్ను మనిషిగా భావించి మదనాభిలాషతో వచ్చి ఉంటే యమసదనానికి వెళ్తారు. సమాజంలో అదనం- అధికంగా అప్రతిష్ఠపాలవుతారు’ అని మదన మోహనుడు మొహమాటం లేకుండా హెచ్చరించాడు. అల్లా అనకపోతే వల్లవ (గొల్ల) వనితలకు నల్లనయ్య మీద ఉన్న వల్లమాలిన పరమ ప్రేమ ఎల్ల లోకాలకు వెల్లడి అయ్యేది కాదు కదా! యశోదా నందనుడు గోవిందుడు ఆనందరూపుడైన భగవంతుడే అన్న అమంద- పరిపూర్ణ జ్ఞానం కలవారు గోపికలు. ఇదే వాస్తవ భక్తి. వారికి ఈ జ్ఞానం లేకపోతే అది అవ్వారి- విస్తారంగా జారిణుల- వ్యభిచారిణుల ప్రేమ వంటిదే అయ్యేది! అది మోహమే. నరక యాతన కలిగించేది. కాని, గోపి ప్రేమ పరాప్రేమ. అది పరావిద్య. బ్రహ్మవిద్యకు మారుపేరు!
గోపికలు అడిగారు- గోవిందా! వెనుకకు మరలి మేము ఏమి చెయ్యాలి? భగవంతుడు.. మీ గృహ- గృహిణీ (స్త్రీ)ధర్మాన్ని పాటించండి. గోపికలు.. దానికి ఫలం? పుణ్యం వస్తుంది. పుణ్యానికి ఫలం? పరమాత్మ అనుగ్రహం. దానికి ఫలం? భగవత్ప్రాప్తి! గోపికలు… స్వామీ! ఆ భగవంతుడు ప్రత్యక్షం- ఎదురుగా సిద్ధంగా ఉంటే, మా మీద కినుక పూని మమ్ములను విరుద్ధంగా వెనుకకు పొమ్మంటావేమిటి? పరోక్షం వెంట పడమంటావేమిటి? సిద్ధి లభించిన పిమ్మట కూడా సాధనను పట్టుకు వేలాడటం జడబుద్ధి కాదా జలజనయనా- జనార్దనా? ‘మీ ఇళ్లలో ఉంటూనే నన్ను పూజించి ధ్యానించవచ్చు గదా!’- అన్నావు. అప్రతిమమైన చైతన్యాన్ని వదలి మతిమంతులు జడాలైన పటాలను, ప్రతిమలను అర్చిస్తారా? విశేషం రానంత వరకు సామాన్యం పట్టు వదలరాదు. విశేషం విచ్చేసినాక సామాన్యాన్ని పట్టుకోరాదు.
శుక ఉవాచ- రాజా! ఎడతెగక తాకుతున్న మన్మథ బాణాల కుదుపులకు అదుపు తప్పి ఓపికలు కోల్పోయిన గోపికలు పలికిన దీన వచనాలు విని యోగేశ్వరేశ్వరుడూ, ఆత్మారాముడు (తనలో తాను ఆనందించువాడు) అయిన శ్రీకృష్ణుడు నవ్వి వారితో క్రీడించాడు, వారిని రమింపజేశాడు..
మ॥ ‘కరుణాలోకములం బటాంచల కచాకర్షంబులన్ మేఖలా
కర బాహు స్తన మర్శనంబుల నఖాంకవ్యాప్తులన్, నర్మ వా
క్పరిరంభంబుల మంజులాధర సుధాపానంబులం గాంతలం
గరగించెన్ రతికేళి గృష్ణుడు గృపం గందర్పు బాలార్చుచున్’
పొంగి పొరలే కృపతో కూడిన ఓర చూపులతో, చీరకొంగులను, శిరోజాలను లాగుచూ, మొలనూలు- పిరుదులు, భుజాలు, వక్షోజాల- పాలిండ్ల స్పర్శలతో, గోటి నొక్కులతో, నోటి నర్మ (ప్రియ) వాక్యాలతో, ఆలింగనాలతో, మధురమైన అధరామృత అస్వాదనలతో అంగజు (మన్మథు)ని గర్వాన్ని భంగపరుస్తూ పశుపాంగజుడు- నంద కుమారుడు బాల ముకుందుడు కరుణతో గోపభామలను కామకేళిలో కరిగించాడు. వారు చుట్టూ చేరి మక్కువతో తనను కొలుస్తుండగా, చొక్కపు చక్కదనాల పుట్టినిైల్లెన నందుపట్టి చుక్కల్లో రిక్కల రాయని- చంద్రుని వలె మక్కిలి చక్కగా మెరిశాడు. వనమాలా విరాజితుడు, భువన సుందరుడు, వనజదళాక్షుడు కృష్ణచంద్రడు ఆ బృందావనానికి కనువిందై ఇందు వదన- గోపాంగనలకు తన దివ్యమైన పొందుతో బ్రహ్మానందపు విందు గావించాడు.
శుకుడు- రాజా! ఇతురులెవ్వరికీ చిక్కక ఎదుటివారిని పెక్కు చిక్కుల్లో ముంచే జగదీశుడు, అనితర- సాటిలేని టక్కుల మారి మాయలానికి దక్కి (స్వాధీనపడి) ధన్యత పొందిన సౌజన్యమూర్తులు గోపికలు కామకేళిలో సొక్కి సోలిపోయారు. మహానుభావుడైన (అసంగుడైన) మాధవునితో మార (మన్మథ) క్రీడలు తారస్థాయిలో ముదమారగ అనుభవిస్తున్న గోప వనితలు, తాము భూలోకంలోని స్త్రీలలో భూరి- అధిక భాగ్యవతులమని భావించి ‘సౌభగ మదం’- గర్వం వహించారు. అభిమానం ఉన్నచోట ‘అమాని’- వెన్నుడు ఉండడు. వారి కామోత్కంఠకు- పారవశ్యానికి, గర్వానికి శాంతి కలిగించేందుకు, అనంతరం ఆదరంతో అనుగ్రహించేందుకు అనంత కల్యాణ గుణ సంపన్నుడైన ఆ అరవిందాక్షుడు మురవైరి శౌరి అక్కడే అదృశ్యుడయ్యాడు.
ఉ॥ ‘చిక్కక ఈశుడై యెదిరి జిక్కుల బెట్టిడి మాయలానికిం
జిక్కి కృతార్థలై మరుని చిక్కుల జొక్కి లతాంగు లుండగా
మక్కువ శాంతి సేయుటకు మన్నన సేసి ప్రసన్ను డౌటకుం
జక్కన నా విభుండు గుణశాలి దిరోహితడయ్యె నయ్యెడన్’
ఈ అంతర్ధానానికి అంతరార్థం ఏమిటి? నిత్యడు, సత్యుడు, అంతటా ఉన్నవాడు అంతర్ధాన- అదృశ్యమవగలడా? మానవుని కన్నులకు అహంకారమనే పొర- తెర అడ్డుపడితే అచ్యుతుడు కనిపించడు. గోపిక- జీవాత్మ అహంకారంతో ఉబ్బిపోగా పరమాత్మ కనుమరుగయ్యాడు. అక్కడే ఉన్నా మానవతులు- గోపికలు అబ్బురంగా అతనిని కానలేకపోయారు. ఈ ‘వి’యోగం కూడా విలక్షణం! విశిష్టమైన యోగం! బహిరంగంలో వియోగమైనా అంతరంగంలో వింతైన సంయోగమే! రాధామాధవులు- గోపీకృష్ణులు ఎప్పుడూ ఏకరూపులే! మరి ఈ విరహం? ఇది లీలా మాత్రం. గోపికలు ప్రేమైక జీవులు. మద మానాలు, ముద రోదనలు, రాగద్వేషాలైనా వారికి మండనాలే- అలంకారాలే!
శుకయోగి.. రాజా! ఇలా హరి కనుగప్పి మరుగైన వేళ ఆయనను కనుగొనలేక, తాళ జాలక కరి- మగ ఏనుగును బాసి తిరిగే కరిణుల- ఆడ ఏనుగుల వలె ఉల్లము తల్లడిల్లగా వల్లవ కాంతలు వాసుదేవుని గమన (నడవడి) లీలలు, దరహాస విలాసాలు, వీక్షణలు- చూపులు, విహారాలు, సయ్యాటలు, పాటలు, మాటలు మొదలగు వాటిపై పెల్లుబికిన ప్రేమానురాగాలతో స్వాంతాలు- మనసులు పరవశింపగా తన్మయత్వంతో ‘నేనే గోవిందుణ్ని, నేనే గోపాలుణ్ని’ అని పలవరిస్తూ కనుమరుగైన శ్రీకృష్ణుని గుణాలను చేష్టలను అనుకరిస్తూ వనాలలో తిరుగసాగారు. రాజా! చరాచర భూతాల లోపల, వెలుపల వసించి వెలుగుతున్న వాసుదేవుని వల్లవ వనితలు యమునా తీరమందలి అడవులలో వెదకడానికి ప్రేమతో పాడుతూ వడివడిగా వెళ్లారు. కనిపించిన ప్రతి చెట్టును, తీగను అడిగారు. ఈ చోట బమ్మెర వారు భక్తి తన్మయత్వంలో పరవశించి పారాశరుని (వ్యాసుని) మించి కవితాశిల్పం పెంచి సమంచితంగా, అంతర్హితు- అదృశ్యుడైన కంత (మన్మథ) జనకుని, శ్రీకాంతుని భ్రాంతలై వెదకుతున్న గోపకాంతల ఆర్తిని. ఆవేదనను, ఆందోళనను రసోదంచితంగా కవితా కామినీ కిలకించితంగా వర్ణించి అలరించాడు..
సీ॥ ‘పున్నాగ! కానవే పున్నాగవందితు;
తిలకంబ! కానవే తిలక నిటలు;
ఘనసార! కానవే ఘనసార శోభితు;
బంధూక! కానవే బంధుమిత్రు;
మన్మథ! కానవే మన్మథాకారుని;
వంశంబ! కానవే వంశధురుని
చందన! కానవే చందన శీతలు;
కుందంబ! కానవే కుందరదను;’
తే॥ ‘నింద్రభూజమ! కానవే ఇంద్రవిభవు;
గువలవృక్షమ! కానవే కువలయేశు;
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;
ననుచు గృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు’
ఓ పున్నాగ పాదపమా! పురుష పుంగవులచే ప్రణతులందుకొను వానిని నీవు పరికించావా? తిలకంబ!- ఓ బొట్టుగు చెట్టా! నుదుట కస్తూరి తిలకం ధరించిన వానిని తిలకించావా? ఘనసార!- ఓ కర్పూర వృక్షమా! గొప్ప బలిమి కలిమిచే శోభించు మా చెలిమికాణ్ని కనుగొన్నావా? బంధూక! ఓ మంకెన మహీజమా! అందరికీ ఆత్మబంధువు, ఆప్తమిత్రుడూ అయిన వానిని అవలోకించావా? మన్మథ!- ఓ వెలగ వృక్షమా! మన్మథునికే మన్మథుడయి వెలుగువానిని వీక్షించావా? వంశంబ!- ఓ వెదురు తరువా! వేణువు దాల్చిన వెన్నుని కన్నావా? చందన! ఓ చందన వృక్షమా! చందనం వలె చల్లనైన నల్లవానిని చూచావా? కుందంబ!- ఓ మొల్ల లతికా! మొల్లమొగ్గల వంటి పల్వరుసల వానిని పొడ గన్నావా? ఇంద్రభూజమ!- ఓ మరువకమా! దేవేంద్రుని మించిన వైభవంతో విరాజిల్లు వానిని దర్శించావా? కువల వృక్షమ!- ఓ రేగుచెట్టా! కువలయ- అవనీ మండలానికి అధినాథుడైన వానిని అవలోకించావా? ప్రియక పాదప!- ఓ ప్రేంకణమా! ప్రియులతోటి విహార విలాస విభ్రమాలు కలవానికి పొడగాంచావా?.. అంటూ అరవిందాననలు బృందావనంలో నందసూనుని, అందాల కృష్ణుని అన్వేషించారు.