ప్రతి రోజూ ఓ వ్రతం.. ప్రతి వారం విశేష సారం.. ప్రతి ఇంటా సంతోషం..మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీనదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు.. కలగలిపితే శ్రావణ మాసం.ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పుచ్చుకునే వాయనాలు, గుప్పిట పట్టినన్ని శనగలు.. ఇలా ఇంటింటా లక్ష్మీదేవి కళకళలాడుతుంది. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది.‘శ్రావణం నా రూపం’ అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. పావన శ్రావణం విశేషాలివి..

‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అన్నారు ఆదిశంకరాచార్యులు. సమస్త జీవరాశుల్లో మానవ జన్మ అన్నిటికన్నా గొప్పదని పేర్కొన్నారు.
‘ఉభాభ్యాం పుణ్య పాపాభ్యాం మానుష్యం లభతేవశః (లభతే అవశః)’ అన్నారు శంకర భగవద్పాదుల శిష్యులు సురేశ్వరాచార్యులు. అంటే పుణ్య, పాప ఫలంగా సంప్రాప్తించిందే మానవ జన్మ అని అర్థం. వీటిని పరిశీలిస్తే మానవ జన్మ గొప్పదా?, పుణ్యపాప ఫలాలు అనుభవించడమే మనుష్య జన్మ ఉద్దేశమా? అని అడిగితే, రెండూ వాస్తవాలే! మానవ జన్మను మహోన్నతంగా మార్చుకోవడానికి రుషులు, మునులు అనేక మార్గాలను సూచించారు. వారు నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తే మానవ జన్మ మహిమాన్వితం అవుతుంది. మనిషికి ధర్మాన్ని బోధించేవి నాలుగు. అవి వేదాలు, స్మృతులు, సదాచారాలు, మన ఇంటిలోని పెద్దలు. వీటి నుంచి సరైన శిక్షణ పొంది మన జీవితాలను సంస్కరించుకోగలిగితే ఆదిశంకరులు చెప్పినట్టుగా మానవ జన్మ గొప్పది అవుతుంది. వేదాలు, పురాణాలు సూచించిన మార్గాన్ని అనుసరించడానికి అనువైన సమయం శ్రావణ మాసం. ఈ నెలలో ప్రతి రోజూ పుణ్యప్రదమే. ఆధ్యాత్మిక సాధనకు అనువైనదే.
స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా ప్రకటించాడు. ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు.
‘యశ్చ శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః’ మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. కానీ, శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణం (వినడం)తోనే సకల కార్యాలు నెరవేరుతాయని చెబుతుంది స్కాంద పురాణం. అందుకే ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు. తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ, వెయ్యి కండ్లతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని శివుడు పేర్కొన్నాడు. అంతేకాదు, ఆదిశేషుడు వెయ్యి నాలుకలతో మహేశ్వరుడి గొప్పదనాన్ని శ్లాఘిస్తూ ఉంటాడట.
నకోపి వాసరోయత్ర వ్రత శూన్యః ప్రదృశ్యతే
ప్రాయేణ తిథయశ్చాపి వ్రతవత్యోత్ర మాసివై
శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారమూ పవిత్రమైందే. ప్రతి తిథి విశేషమైందే. అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ నెలలో. వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే! దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. శ్రావణ మాస విశిష్ఠతను, వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ‘ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు. ‘అర్థవాదోన చాత్రహి’ ఈ విషయాలన్నీ సత్యాలే’ అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు. ‘కామ్యశ్చ ఫలదశ్చాయం నిష్కామస్యతు మోక్షదః’ శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ‘భోగ మోక్షకరి’గా పేరున్న ఈ నెలలో నిశ్చల మనసుతో దైవాన్ని ఆరాధిద్దాం. జీవితాన్ని పావనం చేసుకుందాం.

శ్రావణం రాకతో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. ఆద్యంతం వ్రతాలు, పండుగలు పలుకరిస్తుంటాయి. ఏడు వారాల్లో ఏడు వ్రతాలు, పదహారు తిథుల్లో (అమావాస్యతో కలిపి) పదహారు వ్రతాలు సూచించారు. నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య ఇలా రకరకాల పండుగలు శ్రావణ వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
‘అభిషేక ప్రియః శివః’ అన్నారు పెద్దలు. నిండు మనసుతో నాలుగు చెంబుల నీళ్లు పోసినా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. శక్తి ఉన్నవాళ్లు నిత్యం సకృద్రుద్రాభిషేకం గానీ, అతి రుద్రాభిషేకం గానీ, మహా రుద్రాభిషేకంతో గానీ ఈశ్వరుడిని అభిషేకిస్తే మేలు కలుగుతుంది. శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి. అంతేకాదు, తనకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని గానీ, ఇష్టమైన వస్తువును గానీ దానమిచ్చి వదిలిపెట్టే సంప్రదాయమూ ఉంది. ఈ విధంగా నెలంతా శివారాధనలో గడిపితే ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని పొందుతారని స్కాంద పురాణం చెబుతున్నది. తమతమ కోరికలు తీర్చుకోవడానికి లక్షపూజా విధానాన్ని ఈ శ్రావణంలో ఆచరిస్తుంటారు.
సంపదల కోసం లక్ష బిల్వార్చన
ప్రశాంత జీవనానికి లక్ష దూర్వాలతో అర్చన
పూర్ణాయుష్షు కోరుతూ లక్ష చంపక పుష్పార్చన
హరిహరుల అనుగ్రహం కోసం లక్ష తులసీ దళాలతో
విద్య కోసం లక్ష మల్లికా పుష్పాలతో
పుత్ర సంతానం కావాలనుకునేవారు లక్ష వాకుడు (ములక) పూలతో
దుస్వప్న దోషాలు తొలగిపోవడానికి మంచి ధాన్యంతో అర్చించాలని స్వయంగా పరమేశ్వరుడే సూచించాడు.
ఏవంహి సర్వపుష్పైశ్చ సర్వకామార్థ సిద్ధయే,
లక్షపూజాం ప్రకుర్యాచ్చేత్ సుప్రసన్నో హరో భవేత్
ఈ నెలలో శ్రావణ మాస వ్రతం (నక్త వ్రతం) ఆచరిస్తారు కొందరు. శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలు బహుళ అమావాస్య వరకు వ్రతం కొనసాగిస్తారు. ఈ నెల రోజులపాటు ఈశ్వరారాధనను చేస్తూ ఉపవాసం ఉంటారు. రాత్రి పూట మాత్రమే భోజనం చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపైనే నిద్రిస్తారు. దీక్షతో సాధన సంపత్తిని పెంచుకోవడానికి, ఈశ్వర అనుగ్రహం సంపాదించడానికి శ్రావణ వ్రతం చేస్తారు.
శాస్త్రుల
వేంకటేశ్వర శర్మ
98499 09165