Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలోని శనగల బసవన్నకు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రయోదశి సందర్భంగా సర్కారీ సేవగా ప్రదోషకాలంలో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ప్రతి మంగళవారం రోజున, త్రయోదశి సందర్భంగా దేవస్థానసేవగా కైంకర్యాలు న్విహించడం ఆనవాయితీగా వస్తున్నది. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో భక్తులు నందీశ్వరస్వామి పూజను పరోక్షసేవలో జరిపించుకునేందుకు దేవస్థానం భక్తులకు అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మొదట కార్యక్రమం విజయవంతంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, ఫలోదకాలు, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు.

ఆ తర్వాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు. పురుషసూక్తం, వృషభసూక్తం పఠిస్తూ శాస్త్రోక్తంగా విశేషాభిషేకం చేశారు. నూతన వస్త్రాలను సమర్పించి.. విశేష పుష్పార్చనలు జరిపించారు. తర్వాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. పరోక్ష సేవలో మొత్తం 19 మంది భక్తులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన భక్తులు సైతం విశేష పూజలో పాల్గొన్నారు. పరోక్ష సేవలో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116 చెల్లించాల్సి ఉంటుంది. srisailadevasthanam.org, aptemples.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని దేవస్థానం ఈవో పెద్దిరాజు కోరారు. వివరాలకు 83339 01351/52/53 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం చేస్తున్నట్లు వివరించారు.