విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని తరిస్తుననారు. దాదాపు 12 టన్నుల పండ్లు, కూరగాయాలతో అమ్మవారితో పాటు ఆలయాన్ని అందంగా అలంకరించడం ఆకట్టుకున్నది.
విజయవాడ కనకదుర్గమ్మకు ఏటా నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు కన్నులపండువగా సోమవారం నుంచి మొదలయ్యాయి. ఏటా ఆషాఢమాసంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లను, ఆలయాన్ని 12 టన్నుల తాజా పండ్లు , కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. తొలుత దాతలు అందజేసిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మూలవిరాట్ దుర్గమ్మను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు.
శాకంబరీ ఉత్సవాల తొలిరోజు సోమవారం నాడు విఘ్నేశ్వర పూజ, రుత్విక్ వరుణ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, కలశ స్థాపన పూజలు నిర్వహించనున్నట్లు ఆయల స్థానాచార్యుడు శివప్రసాద శర్మ వెల్లడించారు. శాకంబరీని పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలిగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మూడు రోజులపాటు శాంకబరీ దేవిగా దర్శనవ్వనున్న అమ్మవారిని కరుణకటాక్షాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సీజన్లో దాదాపు లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.