క ఉవాచ రాజా! ముచుకుందుని మాటలు విని అమోఘ సంకల్పుడు ముకుందుడు మేఘ గంభీరమైన గాత్రంతో ఇలా పలికాడు. ‘క్షాత్రవంతా! నా జన్మ కర్మగుణ గోత్ర నామాల గురించి చెప్పమన్నావు. భూరేణువులనైనా లెక్కింప వచ్చునేమో గాని, వానిని గణించి వక్కాణించడం ఎల్లలోకాలకు వల్లభుడ ఏలికనైన నా వల్ల కూడా కాదు. విరించి వరించగా కనికరించి భూ భారాన్ని హరించి ధర్మస్థాపన గావించడానికి యదుకులాన వసుదేవ పుత్రునిగా అవతరించాను. నన్ను వాసుదేవుడంటారు. కంసనామంతో హింసారతుడై చెలరేగిన కాలనేమిని కడతేర్చాను. శిష్ట జనులకు కష్టాలు కలిగించే దుష్టదానవులను నామమాత్రావశిష్టులు గావిస్తున్నారు. ఓ దోషరహితా! నీ దృష్టి అనే అగ్గి సోకి బుగ్గిపాలైన వాడు రోషయుతుడైన కాలయవనుడు. నా అనన్య భక్తుడవైన నిన్ను అనుగ్రహించడానికి, ఓ భద్రపురుషా! నేను ఈ అద్రి (పర్వత) గుహకు వచ్చాను. రాజర్షీ! నీ కిష్టమైన వరాలు వేడుకో ఈడేరుస్తాను. నా భక్తులు ఎన్నటికీ శోక సంతప్తులు కారు.’ శుకుడు రాజా! హరి ఇలా ఆనతీయగా ముచుకుందుడు అతనిని కరివరదుడు, నరహరి నారాయణునిగా ఎఱిగి నతి (నమస్కృతి) గావించి, ఇరువది ఎనిమిదవ మహాయుగంలో క్షితి భూమిపై రమాపతి అచ్యుతుడు అవతరిస్తాడని మున్ను గర్గ మహాముని అన్న మాటను మతి జ్ఞప్తికి తెచ్చుకొని ఇలా నుతించాడు…
ఉ॥ ‘పూనియనేక జన్మముల బొంది తుదిం దన పుణ్యకర్మ సం
తానము పేర్మి గర్మ వసుధా స్థలి బుట్టి ప్రపూర్ణ దేహుడై
మానవుడై గృహేచ్ఛ బడు మందు డజంబు తృణాభిలాషియై
కానక పోయి నూతబడు కైవడి నీ పదభక్తి హీనుడై’.
ప్రభూ! ఎన్నో జన్మలెత్తి చివరికి తాను చేసుకొన్న పుణ్యకార్యాల ఫలంగా కర్మభూమిలో ‘దేహే విద్యాధికారిణి’ ముక్తికి మూలకారణమైన బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అత్యంత అనుకూలమైన దేహం పొంది, పురుషుడై పుట్టి కూడా, గోవిందా! నీ పాదారవిందాల యందలి భక్తి లేక మూఢుడు దురాశాపరుడై, మేక గడ్డిమేత మీది ఆశతో కళ్లు కనిపించక, ఒళ్లు తెలియక, వెళ్లి వెళ్లి పెళ్లున నూతిలో పడినట్లు, గుడ్డివాడై ‘గృహమంధకూపం’ ఇల్లనే చీకటి నూతిలో పడి చెడిపోతున్నాడు. కళత్ర పుత్ర ధనాదులు మరగి, మహారాజ్య వైభవంతో మదించిన మనస్సుగల వాడనై, ఈ మేను దేహంపై పేరాస పెట్టుకొన్న నేను నిన్ను తెలుసుకోలేక చాలా కాలం వ్యర్థంగా గడిపాను.
క॥ ‘నరవర సంజ్ఞితమై రథ
కరి సేవితమైన యొడలు కాలగతిన్ భీ
కర మృగ భక్షితమై దు
స్తర విట్క్రిమి భస్మ సంజ్ఞితం బగునీశా!’
‘అభవా! ఈశా! ‘ప్రభువు’ అని పేరు వహించి, విభవంతో రథ గజాల మీద ఎక్కి తిరిగిన శరీరం కాలవశమై చిక్కి భీకర మృగాలచే భక్షింపబడితే పురీష మలమనీ, మురిగి కుళ్లిపోతే పురుగులనీ, కాలిపోతే భస్మం బూది అనీ పిలువబడుతోంది. దిక్కులన్నీ జయించి, సాటివారు పెక్కురు కని కొనియాడుతుండగా ఉన్నతపీఠం సింహాసనం, అందలం ఎక్కి కూర్చున్న చక్రవర్తి కూడా సుందరీమణులకు ఆటబొమ్మయి, మందిరాలలో మన్మథ సుఖాలు అనుభవిస్తాడే గాని తన డెందం హృదయంలో నిన్ను అన్వేషించడు కదా!’ ఈశ్వరా! మనసును బంధించి, మహిత గొప్ప భోగాలను మాని, ఇంద్రియాల మదాన్ని అణచి, తపమాచరించి చివరికి అవర తుచ్ఛమైన ఇంద్ర పదవిని ఆశిస్తాడే కాని ప్రవర శ్రేష్ఠమైన నీ ఉపేంద్ర అమృత స్థానాన్ని ఉపాసించడు.
సీ॥ ‘సంసారియై యున్న జనునకు నీశ్వర!,
నీ కృప యెప్పుడు నెఱయ గల్గు
నప్పుడు బంధంబులన్నియు దెగిపోవు;
బంధ మోక్షంబైన బ్రాప్తమగును
సత్సంగమంబు, సత్సంగమంబున నీదు,
భక్తి సిద్ధించు, నీ భక్తి వలన
సన్ముక్తి యగు, నాకు సత్సంగమము కంటె,
మును రాజ్యబంధ నిర్మూలనంబు’
తే॥ ‘గలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవగాని తక్కినవి వలదు
ముక్తి సంధాయివగు నిన్ను ముట్ట గొలిచి
యాత్మ బంధంబు గోరునే యార్యుడెందు?’
ఓ కంసారీ! నీ కృప కలిగినప్పుడే పురుషుడికి సంసార బంధాలు తొలగిపోతాయి. అప్పుడే సత్పురుషులతో సంబంధం సాంగత్యం లభిస్తుంది. ఆ సత్సంగ మహిమ చే, దయాంతరంగా! నీ యందు భక్తి సిద్ధిస్తుంది. ఆ భక్తిచే ముక్తి చేకూరుతుంది. ఆర్యపూజ్యా! నాకు సత్సంగం కంటే ముందే రాజ్యబంధం తెగిపోయింది. దేవా! అది నీ అనుగ్రహ విశేషం! అందుకే, నీ సేవాభాగ్యమే కాని తక్కినవేమీ నాకు అక్కరలేదు. ముకుందా! ముక్తిని ప్రసాదించే నిన్ను సేవించి, విజ్ఞుడైన వాడెవడూ అద్దానికి (ముక్తికి) ప్రతిబంధకాలైన శబ్దాది విషయ భోగాలను వాంఛించడు గదా! కరుణావరుణాలయా! నేను నిన్ను శరణు వేడుతున్నా, బహుకాలంగా బాహాటంగా ప్రారబ్ధ కర్మఫలాలతో చాలా బాధలు పడుతూ, మరల ఆ పూర్వ వాసనలతోనే అపూర్వంగా పరితపిస్తూ, ఆశ విడువక పగవారైన ఆరు (పంచేంద్రియాలు, మనసు) ఇంద్రియాలను పోరులో గెలవలేని నాకు, ఓ వారిజాక్షా! నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆపన్నుడనైన నన్ను మన్నించి, అభయ సంపన్నుని గావించి రక్షించమంటూ వేడుకొన్న ముచుకుందుడితో ప్రపన్నార్తిహరుడు గోవిందుడు ప్రసన్నుడై ఇలా పలికాడు..
ఉ॥ ‘మంచిది నీదు బుద్ధి నృపమండన! నీవు పరార్థమెట్లు వ
ర్తించిననైన గోరికల దిక్కున జిక్కవు మేలు, నిర్మలో
దంచిత వృత్తినన్ గొలుచు ధన్యులబద్ధులు నెట్లు నీకు ని
శ్చంచల భక్తి గల్గెడిని సర్వము నేలుము మాననేటికిన్’
‘ఓ రాజకులైక భూషణా! నీ ధిషణ బుద్ధి శుద్ధమైనది. నీవు పరుల కొరకు ఎలా ప్రవర్తించినా మితిలేని కోరికల ప్రలోభాలకు లోబడలేదు. నిర్మలమైన మతి కలిగి అనన్య భక్తితో నన్ను కొలుచువారు ధన్యజీవులు. ప్రబుద్ధులు మాయా నిద్ర నుంచి జాగృతులైన అట్టివారు సిద్ధ పురుషులు సంసారబద్ధులు కారు. నరేంద్రా! నీకు నా యందు దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నా. నాపై చిత్త ధ్యాన ముంచి నిర్నిమిత్తంగా కర్తవ్యబుద్ధితో సమస్తం పరిపాలించు. అమానీ! ఏదీ మానవలసిన పనిలేదు. మానవనాథా! పూర్వం నీవు క్షాత్రధర్మాన్ని అవలంబించి వేడుక కొరకు జంతువులను వేటాడి చంపావు. కాన, తపమాచరించి ఆ అపచారం వల్ల కలిగిన పాపాన్ని అపాకరించుకో తొలగించుకో. తరువాతి జన్మలో ‘మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే’ సర్వప్రాణుల యందు మైత్రి స్నేహం కలిగిన విప్రవరుడ బ్రాహ్మణ శ్రేష్ఠుడవై, క్షిప్రం శీఘ్రంగా నన్ను చేరుకోగలవు’ అని వాసుదేవుడు ముచుకుందునికి వీడ్కోలు పలికాడు. ముచుకుందుడు మాధవునికి ప్రదక్షిణ ప్రణామాలు చేసి గుహ నుంచి బయటికి వచ్చాడు. అల్ప ప్రమాణాలతో ఉన్న మానవ, పశు, వృక్ష, లతాదులను గమనించి, కలియుగం రాబోతున్నదని గ్రహించి మహత్తరమైన ఉత్తర దిక్కునకు పయనమయ్యాడు. నర నారాయణులకు నిత్య నివాసమైన బదరికాశ్రమం చేరి తపోనిష్ఠుడై, శాంతుడై శ్రీకాంతుని సేవించసాగాడు.
శుకుడు రాజా! భువన సుందరుడు మధుసూదనుడు మథురా నగరానికి విచ్చేసి పట్టణాన్ని ముట్టడించి ఉన్న యవన సైన్యాన్ని కదన రంగంలో యమ సదనానికి పంపాడు. ఇలా మ్లేచ్ఛులను మట్టుపెట్టి మథురాపురిలోని సిరిసంపదలను ద్వారకా నగరికి తరలించే తరుణంలో జరాసంధుడు పదునెనిమిదివ సారి ఇరవై మూడు అక్షౌహిణీ సైన్యంతో మథురా నగరం మీద దండెత్తాడు. ఇది చూచి రామకృష్ణులు సంగ్రామ ప్రయత్నం మాని సామాన్య మానవుల మాదిరి, పిరికిపందల పగిది (వలె), జంకిన వారి తీరున, సిరి విత్తమంతా అక్కడే విడిచి, పలాయనంలో తమ సత్తా చూపిస్తూ, పద్మాల వంటి మెత్తని పాదాలతో కారడవిలో పడి జోరుగా పరిగెత్తసాగారు. రామకృష్ణుల బల, ఐశ్వర్య మహిమల జ్ఞానం లేని జరాసంధుడు పారిపోతున్న వారిని చూచి పరిహసిస్తూ ‘నేను మిమ్ము విడువను. ఎక్కడ దాగినా వెంటపడి అంతమొందిస్తా’ అంటూ సకల సేనలతో వారిని వెంబడించాడు. రామకృష్ణులు ఎన్నో ఆమడలు దూరంగా వెళ్లి ‘ప్రవర్షణం’ అను పేరుగల పెద్ద పర్వతాన్ని ఆరోహించారు. అమరేంద్రుడు అధికంగా వర్షం కురిపించడం వలన ఆ అద్రికి ఆ సార్థక నామం. గండరగండడు మాగధుడు రోషావేశంతో ఆ దొడ్డకొండ చుట్టూ దండు విడిశాడు. కాని, ఆ కొండకోనలో ఎక్కడా రామకృష్ణులను కనుగొన లేక వారి వినాశం కోరి, కట్టెలు పేర్చి ఆ గిరిని దగ్ధం చేయండని సైనికులను ఆదేశించాడు. వారు వెలిగించిన మహాగ్ని దరికొని మండి ఆ గిరిని దహించి వేసింది. అప్పుడు పదకొండు యోజనాల పొడవైన ఆ కొండ శిఖరం నుంచి రామకృష్ణులు జరాసంధుని బలగాల కంటపడకుండా కుప్పించి బయటికి దూకి ద్వారకకు చేరుకున్నారు.
జరామరణాల నుంచి విముక్తి పొందాలని అందరూ కోరుకుంటారు. పుట్టి, తెలివి తెచ్చుకున్న తరువాత మనిషిని పట్టి పీడించే, ఎట్టి పరిష్కారానికీ- విరుగుడుకీ లొంగని గట్టి జగజెట్టి దుఃఖాలు ఈ రెండే! వ్యాధి వచ్చి చేరిన తరువాత నివారణ చర్యలకంటే శతవిధాల అది ప్రవేశించకుండా నిరోధించడం మంచిది కదా! మరేమిటి ఉపాయం? అంటే ‘జరామరణ మోక్షాయ మా మా శ్రిత్య యతన్తి యే’ అని గీత సప్తమాధ్యాయం- ‘జ్ఞానవిజ్ఞాన యోగం’లో- ‘జరామరణ దుఃఖ విముక్తి కొరకు నన్నాశ్రయించి సాధన చెయ్యండి’ అని భగవానుని ఉపదేశం. ఇది సిద్ధాంత వాక్యం. దీనికి భాగవతంలోని దృష్టాంతం.. జరాసంధ కాలయవనులు మానవ జీవితంలో వార్ధక్య మరణాలకు ప్రతీకలు. మథుర మానవ దేహానికి చిహ్నం. జరావస్థ- వృద్ధాప్యంలో ఇంద్రియాలన్నీ శిథిలావస్థకు చేరుకుంటాయి. కృష్ణ పరమాత్మ పదిహేడు పర్యాయాలు జరాసంధుని ఓడించి పంపాడు.
కాని, వాడు పదునెనిమిదవసారి కాలయవనుని వెంటపెట్టుకు వచ్చాడు. విచిత్రంగా తన కంటె ముందుగా మథుర (శరీరం) మీదికి కాలం- మృత్యువునే ఉసికొల్పాడు. అనగా వృద్ధాప్య ఆగమనంతోనే మృత్యుభయం మొదలవుతుంది. జరామరణాలు రెండూ ఏకకాలంలో దాడిచేస్తే, ఎంతటి శక్తిమంతునికైనా తట్టుకోవడం కష్టం. అప్పుడు భగవంతుడు చూపిన తిరుగులేని తరుణోపాయం ఏమిటి? ద్వారక అనే బ్రహ్మవిద్యను- భగవంతుని ఆశ్రయించడమే ఏకైక రక్షా కవచం. భగవంతుడు కూడా మథురను వదిలి ‘ద్వారక’ను ఆశ్రయించాడు కదా! జరామరణాలు ద్వారకా దుర్గాన్ని ఛేదించలేవు. అనగా అవి బ్రహ్మనిష్ఠుని ఏమాత్రం బాధించలేవు. పరమాత్మ కాలయవనునికి దీర్ఘ నిద్రనిచ్చి భక్తుడైన ముచుకుందునికి మాయానిద్ర నుంచి జాగృతి- జాగరణ కలిగించాడు. స్వరూప సాక్షాత్కారం అనుగ్రహించాడు. జరాసంధుడు- వృద్ధాప్యం వెంటాడితే రామకృష్ణులు ‘ప్రవర్షణ’ పర్వతాన్ని అధిరోహించారు, ఆశ్రయించారు. ఎక్కడ నిరంతరంగా భక్తి జ్ఞానాల వృష్టి- వర్షం కురుస్తూ ఉంటుందో అదే ప్రవర్షణ గిరి. భగవల్లీలా కథావృష్టిలో తడవటమే భక్తులందరి తక్షణ కర్తవ్యం.