తిరుమల : ఆపద మొక్కులవాడు వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో (Tirumala) భక్తులు నిలువు దోపిడికి గురవుతున్నారు. కొందరు టీటీడీ (TTD) ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మోసాలకు పాల్పడుతుండడం కలవరానికి గురిచేస్తుంది.
తాజాగా తిరుమలలో ఓ ఐదుగురు రూ. 300 ప్రత్యేక దర్శన (Special Darsan) నకిలీ టికెట్లను (Fake Ticktes) విక్రయించినట్లు గుర్తించడంతో విజిలెన్స్, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం నకిలీ టికెట్లతో ప్రత్యేక దర్శనానికి యత్నించిన భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపి వేశారు. వారిని విచారించగా ట్యాక్సీ డ్రైవర్లు తిరుపతికి చెందిన శశి, చెన్నైకి చెందిన జగదీశ్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసిట్లు భక్తులు చెప్పడంతో అధికారులు ఆ దిశగా విచారణ మొదలు పెట్టారు.
నిందితుల్లో ఒకరైన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. ఈయనతో పాటు అగ్నిమాపకశాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్ నిందితుల్లో ఉన్నారు. మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఇప్పటి వరకు హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది వద్ద నిందితులు రూ. 19 వేలు వసూలు చేసి నకిలీ టికెట్లు అందజేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ వింగ్, పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.