గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల మహిళలు ఉదయం నిద్ర లేవగానే వాకిలి ఊడ్చి, ఆవుపేడ నీళ్లు చల్లి, ముగ్గులు పెడతారు. ఇలా, ఆవుపేడ నీళ్లు చల్లడాన్నే కళ్లాపి చల్లడం, చాన్పి చల్లడం అంటారు. కొందరు రోజువారీ కాకపోయినా పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో పేడనీళ్లతో కళ్లాపి చల్లుతారు. పూజ చేసుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా గోమయం (ఆవుపేడ)తో శుద్ధి చేయాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఆవుపేడ నీటితో స్థలాన్ని శుద్ధి చేయటం, చాన్పి చల్లడం వెనుక ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి.
దేశవాళీ ఆవు పేడ కలిపిన నీటినే కళ్లాపిగా చల్లుతారు. ఎందుకంటే, భారతీయ గోవుకు ఉన్న గొప్ప శక్తి మరే ఇతర గోవులకు లేదు. ఆవుపేడ క్రిమి సంహారిణి. అంతేకాదు దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములు ఉంటాయి. కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. ఒక గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. మిత్రక్రిములు (మంచి బ్యాక్టీరియా) అంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ సజావుగా సాగడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.
యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వల్ల ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. దేశవాళీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలుచేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారకమైందిగా ఉంటుంది. కానీ, దేశవాళీ ఆవుపేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.
వర్తమానంలో మనం అనేక కారణాల వల్ల రేడియేషన్ ప్రభావానికి గురవుతున్నాం. ఈ రేడియేషన్ బారి నుంచి ఆవుపేడ మనల్ని కాపాడుతుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. ఇంటి పైభాగంలో ఆవుపేడతో అలికితే ఇంట్లోకి రేడియోధార్మికత ప్రవేశించదు. ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ కారణంగానే పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికే సంప్రదాయం ఏర్పడింది. ఆవుపేడతో అలికిన ప్రాంతం హానికారక బ్యాక్టీరియాకు దూరంగా ఉంటుంది.
ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే ఉపయోగిస్తారు. ఆవుపేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్లాపి చల్లుతారు. ఇల్లు అలుకుతారు. ఇంటిని శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. పాదాల పగుళ్లకు కూడా ఇవి ఒక కారణం. రసాయనికమైన ఫినాయిల్కు భిన్నంగా ఆవుపేడ కళ్లాపి చల్లడం ద్వారా విడుదలయ్యే వాయువులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
ఈ విధంగా గోమయం అనేకరకాలైన వ్యాధులను నివారించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఇంతటి సర్వోన్నతమైన వైజ్ఞానిక కోణం ఉన్నది కాబట్టే, మన పూర్వికులు ఆచారాలు, సంప్రదాయాలు, శాస్ర్తాలు పేరుతో ఆవుపేడ నీటితో చాన్పి చల్లడాన్ని మన సంస్కృతిలో భాగం చేసారు.
– శ్రీ భారతి