అవధూత చక్రవర్తి అవనీపతి పరీక్షిత్తుతో… రాజా! రుక్మి ఇలా బీరాలు పలుకుతుండగానే ధారాధర నీలదేహుడు, క్షీరాబ్ధి శయనుడు, యదుకుల వీరాగ్రణి కృష్ణ నారాయణుడు నవ్వుతూ ఒక నారాచం (బాణం)తో అతని శరాసనం- విల్లును తుంచేశాడు. రథాశ్వాలను కూల్చి సారథిని చంపాడు. క్రమంగా వాని ఆయుధాలన్నింటిని తునకలు గావించి తనువు తూట్లు పొడిచాడు. ఐనా, అతను రెచ్చిపోయి తేరు దిగి కత్తి పట్టి కార్చిచ్చు మీదికి ఉరికే మిడుత మాదిరి అచ్యుతునిపై వచ్చిపడగా హరి అతని కరవాలా (ఖడ్గా)న్నీ, కవచాన్నీ చూర్ణం చేశాడు. ఒర నుంచి కత్తి దూసి రుక్మి శిరం- తల తెగ నరకడానికి బిరబిరా ముందుకు ఉరికి వస్తుండగా చారులోచన కంగారుపడి సారసాక్షుని-కృష్ణుని వారించింది.
ప్రాణేశ్వరుని పాద పద్మాలు పట్టుకొని ఇట్టులు ప్రార్థించింది- ‘అఖిల లోక శరణ్యా! ఈశ్వరా! దేవదేవుడవని- వెన్నుడ (విష్ణు)వని నిన్ను నిశ్చయించ (గుర్తించ)లేక మా అన్న మీ పట్ల మహాపరాధం గావించాడు. అనాథనాథా! దయానిధీ! నన్ను మన్నన చేసి- ఆదరించి మా అన్నను కాపాడు. ఆపన్న ప్రసన్నా! (ఆపదలో ఉన్నవారిని దయతో కాపాడువాడా)! మా అన్న నిర్దోషి అని నేను విన్నవించడం లేదు. ఇతడు నిజంగా కల్లరే- దుష్టుడే. కాని, జగన్నాథుడు జనార్దనుడు, నల్లదేవర మాకు జామాత- అల్లుడు అయ్యాడనీ, మేమెంతో అదృష్టవంతులమనీ ఉల్లసిల్లుచున్న మా తల్లిదండ్రులు వీని వధ వల్ల పుత్రశోకంతో తల్లడిల్లిపోతారు కదా!’
ఇలా కనికరించమని కోరుతూ కన్నెల్లో మిన్నయైన ఆ కిన్నెర కంఠి రుక్మిణి గద్గద కంఠంతో, భయం వల్ల వణుకుతున్న గాత్రం- శరీరంతో, వాడిన వంచిన ముఖంతో, వీనుల మీదికి పడుతున్న వేణీ కలాపం- జడ వెంట్రుకలతో, కన్నుల్లో ముసురుకొంటున్న కన్నీళ్లతో వెన్నునికి నమస్కరించింది. రోచిష్ణుడు- దివ్యతేజో విరాజమానుడు, జిష్ణువు- జయశీలి, సహిష్ణువు- సహనశీలియైన కృష్ణుడు రుక్మి తల నరకక వెనుక మరలాడు. చిరునవ్వు చిందిస్తూ- బావా! రమ్మని దగ్గరికి తీసుకొని, పట్టి బంధించి వాని గడ్డం, తల జుట్టును కత్తితో పాయలు-పాయలుగా అక్కడక్కడ గొరికి విరూపిని చేశాడు. సరిగా అదే సమయానికి అరి- శత్రు సైన్యాన్ని తరిమికొట్టి యదువీరులు శ్రీహరిని చేరుకున్నారు. అక్కడ బంధింపబడి హతప్రభుడై- కాంతి విహీనుడై, మృతతుల్యుడై- జీవన్మృతుడై, అవనత శిరస్కుడై- సిగ్గుతో తల దించుకొని ఉన్న రుక్మిని చూచి బలరాముడు జాలి పడి, వాని బంధాలు తొలగించి, పరంధామునితో ఇలా పలికాడు..
కం॥ ‘తల మనక భీష్మనందను
తలయును మూతియును గొరుగ దగవే బంధుం
దలయును మూతియు గొరుగుట
తల దరుగుట కంటె దుచ్ఛతరము మహాత్మా!’
‘మహానుభావా! దూరంగా తొలగి పొమ్మనక ఇతని తల, మూతి, మీ సాలు గొరుగుట నీకు తగునా? బంధువైన వాని తల, మూతి గొరు గుట తల తరుగుట- తీయుట కన్నా మిక్కిలి హీనం- నీచం కాదా?’
కం॥ ‘కొందరు రిపులని కీడును
గొందరు హితులనుచు మేలు గూర్పవు నిజ మీ
వందరియందును సముడవు
పొందగ నేలయ్య! విషమబుద్ధి ననంతా!’
‘ఆదిమధ్యాంత రహితా! అనంతా! కానివారని- శత్రువులని కొందరికి కీడు చేయవు. మిత్రులని భావించి మరికొందరికి మేలు కూడా కూర్పవు. (సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియః’ (గీత)- నేను సర్వ ప్రాణుల యెడల సముడను. నాకు ప్రియులు లేరు, అప్రియులు లేరు) నిజానికి నీవు సర్వుల పట్ల సమభావంతోనే మెలుగువాడవు కదా! మరినీకీ భేద బుద్ధి ఎందుకు కలిగిందో?!
శుకుడు- రాజా! ముకుందుని ఇలా మందలించి హలాయుధుడు- బలరాముడు, ఇందువదన రుక్మిణిని ఉద్దేశించి ఇట్లన్నాడు..
శా॥ ‘తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం జూడకుమమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం
గీడున్ మేలును జెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ
తోడంబుట్టవు కర్మ శేష పరిభూతుండయ్యె నెడియ్యెడన్’
‘అమ్మా! రుక్మిణీ! నీ అన్నకు జరిగిన అవమానానికి ఖిన్నురాలవై, దుఃఖిస్తూ, మా అనుజుని- కన్నయ్యను తూలనాడకు- నిందించకు. పూర్వ జన్మల్లో చేసిన పుణ్యపాప కర్మలను బట్టి ఇట్టి సుఖదుఃఖాలను అనుభవిస్తుంటారు. అంతేకాని శిక్షించడానికి గానీ, రక్షించడానికి గానీ ‘కర్త’ అంటూ మరి ఒకడు లేడు. నీ తోడబుట్టినవాడు తన కర్మఫలంగానే ఈనాడు ఈడ- ఇక్కడ ఇట్టి పరాభవానికి గురి అయ్యాడు’.
కం॥ ‘అజ్ఞానజ మగు శోకము
విజ్ఞాన విలోకనమున విడువుము నీకుం
బ్రజ్ఞావతికిం దగునే
యజ్ఞానుల భంగి వగవ నంభోజముఖీ!’
‘అరవిందాననా! రుక్మిణీ! ఈ శోకం నీకు నీ అజ్ఞానం వలన కలిగింది. అందుచేత దానికి ప్రతి- విరుగుడుగా విజ్ఞానమనే విలోకనం- చూపు సంతరించుకొని ఈ అజ్ఞానాన్ని రూపుమాపుకో.
ఓ ప్రజ్ఞావతీ!- మతి (బుద్ధి)మంతులారా!
అజ్ఞానుల వలె శోకించడం
నీకు ఏమాత్రం తగదు’.
బలరాముని హితోక్తులు విని వాస్తవం కని జలజాతేక్షణ (పద్మాక్షి) రుక్మిణి దుఃఖం నుంచి విముక్తిని పొందింది. ఇదిలా ఉండగా ప్రాణాలతో వదలిపెట్టబడ్డ రుక్మి తన వికార రూపానికి పరితపిస్తూ, పోరులో ఏనాటికైనా నిర్వికారి యైన శౌరిని జయించి నా సోదరి రుక్మిణిని విడిపించి తెచ్చుకొని కాని నేను కుండిన నగర ప్రవేశానికి నోచుకోనని ప్రతిన పూని నగరానికి వెలుపలే ఉండిపోయాడు. శుకుడు- రాజా!…
కం॥ ‘రాజీవ లోచనుడు హరి
రాజ సమూహముల గెలిచి రాజసమొప్పన్
రాజితయగు తన పురికిని
రాజానన దెచ్చె బంధురాజి నుతింపన్’
‘ఇలా రాజీవ లోచనుడు- అరవిందాలవంటి నేత్రాలు గల గోవిందుడు, రాజసంతో- మహారాజ ఠీవి ఉట్టిపడగా, తనకు అడ్డుపడ్డ రాజలోకం నడ్డి విరిచి- జయించి, బంధురాజిని- చుట్టాలంతా తనను జగజెట్టి అని ప్రశంసల జల్లులు కురిపిస్తుండగా, రాజానన- ఇందుముఖి రుక్మిణిని అందుకొని- గ్రహించి నగర ప్రజలకు కనువిందు చేస్తూ, రాజిత- పరమ వైభవంతో విరాజిల్లుతున్న ద్వారకకు విచ్చేశాడు ముక్తి ప్రదాత ముకుందుడు. వెంటనే ద్వారవతి- మోక్షపురి అయిన ద్వారకలో శ్రీరుక్మిణీకృష్ణ వైవాహిక శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. సంగీత సభలు, వాద్య గోష్ఠులు, నృత్య ప్రదర్శనలు మొదలయ్యాయి. నరనారీ బృందాలు ఆనందోత్సహాలతో తమ దేహగేహాలను అలంకరించుకున్నారు. గోపాలదేవుని పరిణయోత్సవ ఆహ్వానాలందుకుని భూపాలురందరూ విచ్చేశారు. వారి ద్విరద (గజ) సమూహాల గండ స్థలాలు- చెక్కిళ్ల నుంచి స్రవించే (కారే) మదజలంతో రాజమార్గాలు తడిసిపోయాయి. మంగళాచారాన్ని అనుసరించి ప్రతి ద్వారానికీ ఇరుప్రక్కలా పోకమోకలతోనూ, అరటి బోదెలతోనూ శృంగారించారు. అంగరంగ వైభవంగా కర్పూర కుంకుమలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. ఒద్దిక- ప్రేమానురాగాలతో అగరు ధూపాలు వేశారు. ముద్దుముద్దుగా అంతటా పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులను, వాకిళ్లను, గడపలను, స్తంభాలను అలంకరించారు. రంగురంగుల పూలతో, మేలైన పూమాలలతో, రాజిల్లే రత్న తోరణాలతో, ధ్వజ పతాకాల రెపరెపలతో ద్వారకా నగరం అపురూపంగా విరాజిల్లింది’.
మ॥ ‘ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాదు బాం
ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్య్ర సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్’
‘ఆ శుభలగ్నాన భక్తులకు అభయమొసగే ఆ కృష్ణ ప్రభువు తన శాశ్వత కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ ఇభయాన (గజగమన) వైదర్భిని శాస్త్రీయంగా వివాహమాడాడు. ఆ రుక్మిణి హరి చేతోహారిణి- కృష్ణుని మనసును హరించేది. ఆత్మాభిమాన, గాంభీర్యాది గుణగణ వైభవంతో ఒప్పేది, అకలంకులకు- నిష్పాపులకు సకల సంపదలు కలిగించేది, శిష్టులను- సాధు, సుజనులనూ, స్వ- బంధు జనులనూ సత్కరించేది, పుణ్యమార్గంలో సంచరించేది, తన కృపావృష్టి కురిపించి భక్తుల అష్టదరిద్రాలను నష్టపరచేది, కల్యాణ వేష భూషణాలను ధరించిన మహా గుణమణి యైన రమణీ శిరోమణి’.
కం॥ ‘సతులుం దారును బౌరులు
హితమతి గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో
న్నత వర్ధిష్ణులకును మా
నిత రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్’
‘అపార కృపా సాగరులై అపరిమిత ఖ్యాతి వహించిన వారూ, మహోన్నత తేజో విరాజమానులూ అయిన రుక్మిణీ కృష్ణులకు, దంపతులుగా విచ్చేసిన ద్వారకా పురవాసులు హితమతి- మంచి మనసుతో భాసురమైన కానుకలు తెచ్చి సమర్పించారు. కరి వరదుడు హరి ఈ తెరగున- విధంగా తనను వరించిన తరళేక్షణ రుక్మిణిని అరుదు- అపూర్వంగా హరించి తెచ్చి పెండ్లాడటం అనన్యసామాన్యమైన అద్భుత కార్యమని ఆయా దేశాల భూపాల (రాజ) మణులు, వారి రాణులు పరమాశ్చర్యం పొందారు’.
ఆ॥ ‘అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణి తోడ
గ్రీడ సలుపుచున్న గృష్ణు చూచి
పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి
ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు’
‘మహాత్మా! ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో రమిస్తున్న- సుఖిస్తున్న రమానాథుని శ్రీకృష్ణుని చూచి ద్వారకా నగర ప్రజలంతా వంత- సంతాపం మాని రవ్వంత కూడా ఆతంకం- భయం లేకుండా ఎంతో ఉల్లాసంగా విలసిల్లారు’ అని శుక యోగీంద్రుడు, శాపగ్రస్తుడైనా పాపరహితుడైన ధరాపతి (రాజు) పరీక్షిత్తుకు రుక్మిణీ కల్యాణ గాథను వినిపించాడు.
మన పోతన ఆనవాయితీగా పెట్టుకున్న ఆచారాన్ని పాటిస్తూ దశమ స్కంధ పూర్వ భాగాంతంలో తన ఆరాధ్య దైవమైన ఇనవంశోత్తముడు, రాముని సంబోధన, కీర్తనతో కూడిన కంద, మాలినీ ఛందస్సులతో కథను ముగించాడు…
కం॥ ‘కువలయ రక్షాతత్పర
కువలయదళ నీలవర్ణ కోమల దేహా
కువలయ నాధ శిరోమణి
కువలయ జన వినుత విమలగుణ సంఘాతా!’
‘భూమండల రక్షణలో దక్షుడ, తత్పరుడవైన శ్రీరామా! కలువ రేకుల వలె నల్లని కాంతితో నిగనిగలాడే దేహం కల జగత్పతీ! ధరారమణు (రాజు)లకు శిరోమణి- సాటిలేని మేటి అయిన వాడా! ధరణి (భూమి) ప్రజల ప్రశంసలందుకున్న వరసుగుణ భూషణా! నీకు వందనాలు!’
మా॥ ‘సరసిజనిభహస్తా! సర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
పరహృదయవిహారీ! భక్తలోకోపకారీ!
గురు బుధ జనపోషీ! ఘోర దైతేయ శోషీ!
‘స్వామీ! నీ కరములు కమలాలవలె కడు మనోహరములు. సర్వలోకాలలో అఖర్వ (అపార) ఖ్యాతిగలవాడవు. పరమ మంగళ స్వరూపడవు. అన్ని దిక్కులా వన్నెకెక్కిన తరగని కీర్తిమంతుడవు. శత్రువుల గుండెలను ఖండించువాడవు. భక్తుల యోగక్షేమాలు అరయుటలో ఆసక్తి గలవాడవు. గురువులను, పండితులను చక్కగ సంతోషపెట్టువాడవు. కర్కశులైన రక్కసులను ఉక్కడగించిన వాడవూ అయిన రామా! పరంధామా! నీకు ప్రణామాలు!