శ్రీ శుక ఉవాచ- పరీక్షిత్ భూపాలా! అలా చూచి గోపాల కృష్ణుని రూప లావణ్య గాంభీర్య చాతుర్య వీర్య వైభవ ప్రాభవ తేజో విశేషాలకు దేహ తాపం తీరిపోగాతోయజలోచన రుక్మిణి పరవశించింది. భావజ- మన్మథ శరా(బాణా)లకు గురియై వ్యథ చెందుతూ త్వరగా అరవిందాక్షుని రథారోహణానికి కుతూహలపడుతున్న అలివేణి రుక్మిణిని… అథోక్షజుడు కథానాయకుడు కృష్ణుడు అవలోకించాడు.
వైరి రాజవర్గం చూస్తుండగానే శౌరి గంధ సింధురం- మదించిన ఏనుగువలె మంద గమనంతో విలాసంగా విచ్చేశాడు. నక్కల నడుమ ఉన్న మాంసపు ముక్కను మృగరాజు- సింహం ఎగరేసుకుపోయినట్లు, పగవారిని- శత్రువులను తిరస్కరించి తెగటార్చుతూ- నశింపజేస్తూ నగధరుడు- గిరిధారి రాకుమారి కరగ్రహణం చేసి అరదం (రథం) ఎక్కించుకున్నాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లగా గ్రద్దన దరవరం- పాంచజన్య శంఖం పూరించాడు. హలాయుధుడు తోడురాగా, బలానుజుడు కృష్ణుడు యాదవ బలగంతో ద్వారకా నగర మార్గం పట్టాడు. అప్పుడు జరాసంధునికి లోబడిన నరాధిపు-రాజులందరూ మురారి పరాక్రమం కని సహించలేకపోయారు. ఇలా అనుకున్నారు…
మ॥ ‘ఘన సింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్
మన కీర్తుల్ గొని బాల దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
సనుచున్నా రదె? శౌర్యమెన్నటికి? మీ శస్ర్తాస్త్రముల్ గాల్పనే?
తనుమధ్యన్ విడిపింప మేని నగరే ధాత్రీ జనుల్ క్రంతలన్’
‘అదిగో! గొప్ప మృగరాజుల- సింహాల కీర్తిని మ్రుక్కడి- నీచమైన మృగాలు ఆశించిన మాదిరి ఈ గొల్లలు వెల్లనైన- తెల్లని మన యశస్సు నెల్ల దోచుకొని హరిని వరించిన పల్లవాధర రుక్మిణిని హరించి, కండకావరంతో తెగించి పోతున్నారు. ఇప్పటికి చొప్పడనట్టి- పనికిరాని మన ప్రతాపం మరి ఎప్పటికి? మన శస్ర్తాస్ర్తాలు అగ్గిలో పడేసి బుగ్గి చేయడానికా? ఈ వల్లవు- గొల్లలకు ఒగ్గ (లోబడ)టానికా? తను మధ్యన్- సన్నని నడుము గల ఆ కన్నియను గొల్లల బారి నుండి క్రన్నన- శీఘ్రంగా విడిపించకపోతే ఊరి ప్రజలు సందుగొందుల్లో సైతం మనలను గేలి చేయరా?
శుకుడు- రాజా! ఇలా ఒకరికొకరు చెప్పుకొని రోషం పూని పంతాలు పలుకుతూ సాయుధులై జరాసంధుడు, అతని సామంతులు చతురంగ బలాలతో యాదవ వీరులను వెంబడించి కాదంబక- శర వర్షం కురిపించారు. అరివీరులు హరి సేనను పరిపరి విధాల శరము- బాణాలతో కప్పివేయడం చూచి భయపడి హరి మధ్య (సింహం నడుము వంటి సన్నని నడుము గల) చకిత హరిణేక్షణ (బెదిరిన జింక కన్నుల వంటి కన్నులు గల) రుక్మిణి వ్రీడ-సిగ్గుతో కరివేలుపు ముఖాన్ని పరికించింది. అలా పరిశీలించగానే శ్రీహరి..
కం॥ ‘చొచ్చెదరదె యదువీరులు
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
జచ్చెదరును నేడు చూడు జలజాతాక్షీ!’
‘ఓ పంకజాక్షీ! నిశ్శంకగా చూస్తూ ఉండు. మన వంక- పక్షాన ఉన్న యాదవ వీరులు శత్రు సైన్యంలో చొచ్చి- ప్రవేశించి వారిని వ్రచ్చు- చీల్చి చెండాడుతారు. వైరులు హెచ్చుగ నొచ్చి- బాధపడి, విచ్చి (ముక్కలై) పోతారు. చివరికి చచ్చిపోతారు’ అని సారసాక్షుడు కృష్ణుడు చారులోచన రుక్మిణిని ఊరడించాడు.
అంతట బలరామాది యదువీరులు కదనరంగంలో విజృంభించి విరోధుల చతురంగ బలాలను చెదరగొట్టారు. మదగజాలు ముక్కలై పోయాయి. గుర్రాలు బెదిరి పారిపోయాయి. రథాల కప్పులు విరిగిపడ్డాయి. పదాతి- కాల్బలం కూలిపోయింది. తలలు తెగి నేలరాలాయి. గదలు, గుదియలు (బరిసలు), కత్తులు, కటారులు తుత్తునియలై పోయాయి. నెత్తుటేరులు ప్రవహించాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నక్కలు, కాకులు, గ్రద్దలు, రాబందుల బృందాలకు ఆ రణరంగం ఆనందం కలిగించింది. ఆ సమయంలో భయంతో పారిపోతూ జరాసంధాది ప్రముఖులందరూ ఒకచోట చేరారు. పెళ్లాన్ని పోగొట్టుకున్న వానివలె తమ యెదుట ఖిన్నుడై పొక్కుచున్న- వెక్కివెక్కి ఏడుస్తున్న శిశుపాలుని కని పగతుర- శత్రువుల చేతుల్లో చిక్కక ప్రాణాలతో బతికి ఉన్నావు కదా! శిశుపాలా! ఎందుకలా కుందుతావు- దుఃఖిస్తావు! ఇలా ఊరడిస్తూ, శిశుపాలుని చేరదీసి వారలంతా ఊరకుండక మరలా అతనితో ఇలా పలికారు….
ఆ॥ ‘బ్రతక వచ్చు నొడల బ్రాణంబులుండిన
బ్రతుకు గలిగెనేని భార్య గలదు
బ్రతికితీవు భార్యపట్టు దైవ మెరుంగు
వగవ వలదు చైద్య! వలదు వలదు’
‘బొందిలో ప్రాణాలుంటే, ఓ రాజ చందురుడా! ఎలాగైనా బతకవచ్చు. బతికి ఉంటే నీకు సతీమణి- భార్య దొరక్కపోదు. ఇందు ఇసుమంత కూడా సందేహం లేదు. కాకపోతే సుందరి రుక్మిణి మాత్రం నీకు చెందదు. తలవంపులుగా తలపక ఆ ఎలనాగపై పెంచుకున్న మోహాన్ని చంపుకో! ముందు ముందు నీవు ఇలలో ఎందరు మందగమనలనైనా ఇల్లాళ్లుగా పొందగలవు. అసలు పెళ్లాం మాట పెరుమాళ్లెరుగు. నీవు బతికి మా కళ్లముందున్నావు. అదే మాకు పదివేలు. ఊరక వగవ- వాపోవ వద్దు’. ‘వగవ వలదు వలదు’ అన్న పునరుక్తి, పెద్దలు శిశుపాలునికి ఇలా పరిపరి విధాల సుద్దులు- సూక్తులు పలికారని సంకేతం. వృద్ధుడు జరాసంధుడు మరల కల్పించుకొని ఇలా వేదాంత పరంగా బోధించాడు- శిశుపాలా! తోలు బొమ్మలాడించే వాడి చేతిలో కీలుబొమ్మలాగా మానవుడు మాధవుని మాయకు లోనై అస్వతంత్రుడై సుఖదుఃఖాలలో నటన గావిస్తూ ఉంటాడు. మునుపు నేను మథురపై పదిహేడు మారులు దండెత్తి ఓడి పట్టుబడి, జగజెట్టి కృష్ణుని కృపతో విడువబడి, పదంపడి- పిమ్మట ఇరవైమూడు అక్షౌహిణీ సైన్యంతో పద్దెనిమిదవ సారి పోరి అరివర్గాన్ని తరిమికొట్టి విజయం సాధించా. నేనెప్పుడూ జయాపజయాలలో మోదఖేదాలు పొందలేదు. చేదినరేశా! ఇంతేకాదు, కాలమనుకూలమై యాదవులు మనలను కూలగొట్టారు. అది మనకనుకూలమైనప్పుడు పగవారిని మనమూ తెగనాడ- నశింపజేయగలం. ఈ మాత్రానికి ఇంతగా వంత- సంతాప పడనవసరం లేదు.
శుకుడు- నరాధిపా! జరాసంధాదులు చేది ధరాభృత్తు శిశుపాలుని పరితాపం వారించి వారివారి దేశాలకు తరలిపోయారు. శిశుపాలుడూ సపరివారంగా తన నగరికి చేరాడు. రుక్మి మాత్రం కృష్ణుని సాహస చేష్టను సహింప జాలక ఒక అక్షౌహిణీ సేనతో వెన్నుని వెన్నాడుతూ తన సారథితో ఇట్లన్నాడు..
ఉ॥ ‘బల్లిదు నన్ను భీష్మజనపాల కుమారుని జిన్నజేసి నా
చెల్లెలి రుక్మిణిం గొనుచు జిక్కని నిక్కపు బంటువోలె నీ
గొల్లడు వోయెడిన్ రథము గూడగ దోలుము తేజితోల్లస
ద్భల్ల పరంపరన్ మదము బాపెద జూపెద నా ప్రతాపమున్’
‘నేను భీష్మక ప్రభువు పుత్రుణ్ని. బల్లిదుణ్ని- మహాబలవంతుణ్ని. నన్ను పిల్లవానివలె చులకన చేసి నా చెల్లెలు రుక్మిణిని తనకిల్లాలుగా గైకొని ఈ గొల్లవాడు చిక్కని నిక్కపు బంటువోలె- ఏకవీరుని (ఒంటరిగా నిలిచి పోరు యోధుని) వలె తరలిపోతున్నాడు. మన అరదాన్ని- రథాన్ని కూడా వాని వద్దకు మరలించు. పదును కలిగి ప్రకాశించే పృషత్కా- బాణాలను ప్రయోగించి వాని పొగరు అణచివేస్తా. నా మగతనం- ప్రతాపం చూపిస్తా’, ఈ తీరున రుక్మి, హరి పరాక్రమం అరయక- తెలియక సారథిని గద్దంచి తేరును- రథాన్ని అంటతోలించి- ఓ యాదవా! కన్నయ్యా! వెన్న దొంగా! ఒక్క క్షణం ఆగవయ్యా’ అంటూ నిరాదరణగా వదరుతూ నారి సారించి మూడు వాడి నారాచా- బాణాలతో వాడు మురారిని నొప్పించి ఇలా అన్నాడు..
సీ॥ ‘మా సరివాడవా మా పాప గొనిపోవ?
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి?
వెయ్యది నడవడి? యెవ్వడెరుగు?
మానహీనుడ వీవు? మర్యాద లెరుగవు;
మాయగైకొని కాని మలయ రావు
నిజరూపమున శత్రు నివహంబుపై బోవు,
వసుధేశుడవు గావు వావి లేదు’
ఆ॥ ‘కొమ్మనిమ్ము, నీవు గుణ రహితుండవు
విడువు విడువ వేని విలయ కాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వమెల్లగొందు గలహమందు’
నల్లనయ్యా! మా చెల్లెలిని తీసుకువెళ్లడానికి నీవు మాకు సాటివాడవా? కావు- అని పైపైన నింద. ‘నత్వత్సమస్త్యభ్యధికః కుతోన్యః’ (గీత)- నీకు సమానుడే లేనప్పుడు నీకంటే అధికుడుంటాడా అని లోన స్తుతి- ప్రశంస. నీవు ఏపాటి వాడవు- ఎంత మాత్రపు వాడివి? (‘అప్రమేయో హృషీకేశః!’ (విష్ణు సహస్రం)- అప్రమేయుడవు అనగా ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు విషయం కానివాడవు, అందని వాడవు కదా!) నీ వంశమేది? (సృష్టికి మూల కారణం కనుక ఇలలో భగవంతునికి కులగోత్రాలుండవు) ఎక్కడ పుట్టావో? ఎక్కడ పెరిగావో? నీ నడవడి ఎట్టిదో ఎవరికీ అంతుపట్టదు (‘న జాయతే మ్రియతే వా కదాచిత్’ (గీత) జీవులకు తప్ప దేవునికి- జనార్దనునికి జన్మమరణాలు లేవు, అనగా షడ్భావ వికార శూన్యుడు. పరమేష్ఠి- బ్రహ్మాది దేవతలకు కూడా అతని ప్రవర్తన తెలియదు). నీకు మానం లేదు- స్వాభిమాన, ఆత్మాభిమాన రహితుడవు. (వాస్తవానికి ‘మాతృ మానమేయాలు’- ఈ త్రిపుటి లేనివాడు.
అనగా ఎట్టి కొలతలకు అందనివాడు. ‘అమానీ మానదో మాన్యః’ (విష్ణు సహస్రం)- సృష్టి, స్థితి, లయాలకు కారణమైనా ‘నిరభిమాని’ అని కూడా అర్థం). మర్యాద లెరుగవు- మట్టు మర్యాదలు తెలియనివాడవు. (సంస్కృతంలో ‘మర్యాద’ అంటే హద్దు సీమ. పరమాత్మ దేశకాల వస్తు పరిచ్ఛేద (పరిమితి) రహితుడు కాన, హద్దుల పద్దులకు బద్ధుడు కాక నిత్య సిద్ధుడుగా ‘వ్యాపకః’- అన్ని కాలాల్లో అంతటా ఉండువాడు). ‘మాయ గైకొని కాని మలయ రావు’- ‘మలయ’ శబ్దానికి తిరుగు, వ్యాపించు, ఉద్యమించు, వర్తిల్లు, చలించు (కదలు) అని అనేకార్థాలు. ఇచ్చట మాయ- వంచన లేక సంచరించలేని, చలించలేని, ఎదుటపడని- కనిపించని వాడవు అని నిందార్థం.
(‘సంభవామ్యాత్మ మాయయా’ (గీత)- మాయను స్వీకరించి అవతరించు- నామరూపాలలో వ్యక్తమగువాడు అని స్తుతి). స్వ-నిజ రూపంతో వైరి వర్గం మీదికి వెళ్లవు (అనగా అచ్యుతుడు అరూపుడు. ‘సర్వము తానయైనవాడు’- అన్ని రూపాలూ తానే కాన శత్రువు అంటూ లేనివాడు). నీవు క్షత్రియుడవు కావు. (అజన్మ- జన్మేలేని వానికి జాతి ఏమిటి?) నీకు వావి వరుసలు లేవు. (సర్వ జీవులకు ‘అంతర్యామి’ అయినవానికి స్వపరభేదం- అంతా తానే కాన- లేదు. పరమాత్మకి ‘పరాంగనలు’ ఉంటారా?) నీవు గుణ రహితుడవు- సద్గుణాలు లేనివాడవు. (భగవంతుడు ప్రాకృత- త్రిగుణ రహితుడు. సమస్త కల్యాణ గుణాభిరాముడు). అరే గొల్లా! మా చెల్లాయిని వదిలిపెట్టు. విడువకపోతే ప్రళయకాల బడబాగ్ని జ్వాలల వంటి వాడి గల తొడుగు (బాణా)లతో దందడి- యుద్ధంలో నీ గర్వం సర్వం అడచి- హరించి వేస్తా! లోకంలో సందడి చేస్తా!
సంస్కృత భాగవతంలో ‘వ్యాజస్తుతి’ (నిందలో స్తుతి, స్తుతిలో నింద) అలంకారంతో అలరారే గంభీరమైన ఒకే శ్లోకం ఈ సందర్భంగా అనుష్టుప్ ఛందస్సులో ఉంది. పోతన అమాత్యుడు అవ్యాజ కరుణతో అద్భుతమైన ఈ సీస పద్యంలో ‘వ్యాజస్తుతి’ ద్వారా రుక్మి ముఖతః పరబ్రహ్మమైన కృష్ణ తత్తాన్ని నిందారూపంగా వర్ణించి, దానిని వందనీయం గావించి, తేజరిల్ల జేసి మిక్కిలి అభినందనీయుడయ్యాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006