శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునితో- రాజా! బ్రహ్మణ్యదేవుడు కృష్ణస్వామి అగ్నిద్యోతన బ్రహ్మణుని ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె స్వరూప స్వభావ సౌందర్య విశేషాల ప్రాభవం సావధానంగా విని, తన చేతితో ఆయన చేయి పట్టుకొని చిరునగవు చిందిస్తూ, బెట్టు చేస్తూ- ఆధిక్యతను ప్రకటిస్తూ ఇట్టుల పలికాడు..
ఉ॥ ‘కన్నియ మీద నా తలపు గాఢము, కూరుకు రాదు రేయి నా
కెన్నడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే
మున్నె యెరుంగుదున్ బరులమూక లడంచి కుమారి దెత్తు వి
ద్వన్నుత! మాను ద్రచ్చి నవవహ్నిశిఖన్ వడి దెచ్చు కైవడిన్’
ఓ పండిత పూజ్యా! ఆ అండజయాన రుక్మిణిపై నాకున్న ప్రేమ చాలా గాఢం- కడు మెండు. కనుకనే ఇటీవలి రాత్రుల యందు నా కంటికి కూడా కూరుకు- కునుకు కరవైపోయింది. నా పట్ల ద్వేషం కల రుక్మి మా వివాహం ఓర్వేలేక కీడు తలపోయగలడన్న సంగతి నాకు మున్నె- ముందుగానే తెలుసు. అయ్యా! అరణిని- కొయ్యను మథించి నవాగ్నిని- కొత్తదగు అగ్నిజ్వాలను- యజ్ఞాగ్నిని వెలికి తెచ్చిన విధంగా, శత్రు మూకలను అణచి వేసి ఆ కలికిని- కన్యారత్నాన్ని ఇచ్చటి కొని తెచ్చుకుంటా.
కం॥ ‘వచ్చెద విదర్భ భూమికి
జొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన బోరన్’
ఓ భూసురోత్తమా! నేను భాసురంగా విదర్భ దేశానికి విచ్చేస్తా. భీష్మకుని రాజధాని కుండిన నగరంలోకి అలవోకగా ప్రవేశిస్తా. చిటికెలో నా చెలువ రుక్మిణిని తెచ్చుకుంటా. విరోధులు నిరోధిస్తే- అడ్డువస్తే ఆయోధనం (యుద్ధం)లో వారిని వధిస్తా.
శుకుడు- రాజా! ఇలా పలికి బలానుజుడు కమలాపతి కృష్ణుడు రుక్మిణి కల్యాణ ముహూర్తం అడిగి తెలుసుకున్నాడు. ద్వారకానాథుని ఆదేశానుసారం దారుకుడు రథాన్ని సన్నద్ధపరిచాడు. సిద్ధ సంకల్పుడు అచ్యుతుడు అగ్నిద్యోతనునితో కూడి రథమధిరోహించి ఒక్క రాత్రిలో విదర్భ దేశం చేరాడు. అక్కడ భీష్మకుడు రుక్మికి వశపడి రుక్మిణిని శిశుపాలునికి ఇవ్వడానికి అంగీకరించి శుభకార్యానికి.. నగరాలంకరణ, కన్యాపరమైన వైదిక సంస్కారాలు, గ్రహశాంతి హవనాలు, నూతన వధూవరుల క్షేమానికై విప్రులకు వివిధ దానాలు వగైరా ఏర్పాట్లు చేశాడు. ఈ పెండ్లి తప్పక జరిపిస్తామంటూ శిశుపాలుని పక్షాన జరాసంధ, సాల్వ, విదూరథ, పౌండ్రక వాసుదేవాదులు చతురంగ బలాలతో, ఇంకా ఇతర దేశాల రాజులు అనేకులు కుండిన నగరానికి కదలివచ్చారు. భీష్మకుడు శిశుపాలునికి విడిది ఏర్పరచి వరపూజ గావించాడు. ఈ సమాచారం విన్న బలరామన్న, కన్యను తెచ్చుకొనడానికి వెన్నుడు- కన్నయ్య ఒక్కడే వెళ్లాడని, అని (సమరం) జరగవచ్చని ఎంచి తమ్మునికి సహాయంగా సైన్యంతో బయల్దేరి వచ్చాడు.
ఇంతలో వాలుకన్నుల రుక్మిణి ఏకాంత మందిరంలో కూర్చుని లోకాలన్నిటికి కన్నువంటి వాడైన పన్నగశాయి- యదు వల్లభుడు తన సందేశం విని కూడా తన్ను కదియ- చేర రాడేమో అని సందేహిస్తూ తనలో తాను ఇలా బాధ పడుతోంది..
శా॥ ‘లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాడు గోవిందుడు
ద్విగ్నంబయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుం
డగ్నిద్యోతను డేటికిం దడసె నా యత్నంబు సిద్ధించునో
భగ్నంబై చనునో విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?’
‘అయ్యో! రేపే గదా లగ్నం- సుముహూర్తం. పెళ్లి సమయం దగ్గర పడుతోంది. అయినా గోవిందుడు ఎందుకు రాడబ్బా? నా మది ఉద్విగ్న- కలవర పడుతోంది. ఇందీవర శ్యామునికి- యదు సింహునికి నా ప్రణయ వార్త అందిందో లేదో? ఈ భూసురేంద్రుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేశాడు? ఇంతకూ నా ప్రయత్నం సిద్ధిస్తుందో లేక భగ్నమైపోతుందో? నా విధి రాత- దైవ నిర్ణయం ఎలా ఉందో ఏమో!’ పై శార్దూల వృత్తం పుష్క రేక్షణ- పద్మాక్షి రుక్మిణీదేవి చిత్తంలోని ఆందోళన- ఆదుర్దాను ఆవిష్కరించే- వ్యక్తం చేసే పద్యం. ఇందు ప్రాస స్థానంలోని సంయుక్తాక్షరం ‘గ్న’కారం దుష్కరమైనది. అయినప్పటికి కవి వతంసుడు పోతన్న, పద్యాన్ని చివరిదాకా సుకరంగా, సమర్థవంతంగా పరిష్కరిస్తూ రుక్మిణమ్మ మదిలోని త్రాసని- భయాన్ని ఈ కఠిన ప్రాస ద్వారా పుష్కలంగా కావ్య రసాత్మకంగా పండించాడు.
మ॥ ‘ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింప దలంచునో దలపడో యార్యా మహాదేవియున్
నను రక్షింప నెరుంగునో యెరుగదో నా భాగ్యమెట్లున్నదో’
మహనీయుడైన ఆ మహీసురుడు- బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లాడో లేదో? మార్గాయాసంతో మధ్యలోనే ఎక్కడైనా చిక్కి- ఇరుక్కుపోయాడేమో? అప్పద్మనేత్రుడు నా వలపు సందేశం విని తప్పుగా తలచాడేమో? లేక ఒప్పుగానే భావించి, నన్ను మెచ్చి ఇప్పటికే కుండిన నగరం విచ్చేశాడేమో? సర్వేశ్వరుడు నా మనోరథానికి అనుకూలిస్తాడో లేదో? ఆర్యామహాదేవి- లక్ష్మీ, సరస్వతీ, పార్వతుల ముగ్గురమ్మల మూలపుటమ్మ భర్గుని భార్యమణి దుర్గమ్మ అయినా నన్ను కాపాడి కడతేరుస్తుందో? లేక ఎడ మొహం పెట్టి రాపాడు- కష్టపెడుతుందో. ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో?
శుకుడు- రాజా! డోలాయమాన మానస అయి ఆ హేలావతి ఇలా పరిపరి విధాల భావిస్తోంది.. అసలీ బాపడు ద్వారకకు వెళ్లి ఉండడు. అందుకే వసుదేవ నందనుడు రాలేదని సందేహిస్తుంది. మరోమారు ద్వారకకు వెళ్లి మురవైరిని, మార జనకుని- మాధవుని ఆహ్వానించి తెచ్చే ఆత్మబంధువు తనకు మరొకడు లేడు కదా అని వాపోతున్నది. అన్న రుక్మి కూడా నీతి మాలి- కన్నవారిని కాదని తన్ను శిశుపాలుని పాలు (అధీనం, వశం) చేయ పాల్పడు- పూనుకొను చున్నాడని పరితపిస్తుంది. ఇక మధురాతి మధురాలైన తరువాతి పద్యాలన్నీ భక్తకవిగా ఖ్యాతిగన్న మన పోతన్న గారివే!
ఉ॥ ‘చెప్పదు తల్లికిం దలపు జిక్కు దిశల్ దరహాస చంద్రికం
గప్పదు వక్త్ర తామరసగంధ సమాగత భృంగ సంఘమున్
రొప్పదు నిద్ర గైకొన దురోజపరస్పర సక్తహారముల్
విప్పదు కృష్ణమార్గగత వీక్షణ పంక్తులు త్రిప్ప దెప్పుడున్’
ఆ పల్లవాధర రుక్మిణి మనసులోనే తల్లడిల్లుతున్నది కాని, ఆ ఆవేదన తల్లికి చెప్పుకోదు. ఆ జక్కవ చంటి (చక్రవాక పక్షివంటి స్తనములు గల) రుక్మిణి బిక్కమొహంతో దిక్కులు చూస్తుందే కాని, దరహాస- చిరునవ్వుల వెన్నెలలు చిందింపదు. ముఖపద్మ సౌరభానికి ముసురుతున్న తేట- తుమ్మెదల కూటువు- గుంపులను తోలదు. ఆదమరచి నిదురపోదు. వక్షస్థలిలో పరస్పరం మెలి- మెలికెపడ్డ ముత్యాల దండల చిక్కులను మక్కువతో చక్కగ చేసుకోదు. నందగోకుల విహారి, శౌరి వచ్చేదారిపై గురిపెట్టిన వీక్షనాలను- చూపులను ఆ అంబుజేక్షణ క్షణకాలమైనా పక్కకు తిప్పదు.
చ॥ ‘తుడవదు కన్నులన్ వెడలు తోయకణంబులు కొప్పు జక్కగా
ముడవదు నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన దన్న మేమియుం
గుడువదు నీరముం గొనదు కూరిమి గీరము జేరి పద్యమున్
నొడువదు వల్లకీ గుణ వినోదము సేయదు డాయ దన్యులన్’
శుకుడు- రాజా! ఆ కిన్నెరకంఠి రుక్మిణి కన్నుల నుంచి జాలువారే- కారే కన్నీటి బొట్లు తుడవదు. ఎన్ని విన్నపాలు చేసినా అన్నపానాలను అహరిం- స్వీకరించదు. చెలిమితో చెంతనున్న పెంపుడు చిలుకకు ఇంపుగా పద్యం చెప్పదు. ఆ కీరవాణి రుక్మిణి వీణను మీటుతూ వినోదింపదు. ఆ అలివేణి అసలెవ్వరినీ తన దెసకు- బసకు రానివ్వదు.
సీ॥ ‘మృగనాభి యలదదు మృగరాజ మధ్యమ
జలముల నాడదు జలజగంధి
ముకురంబు సూడదు ముకుర సన్నిభ ముఖి
పువ్వులు దురుమదు పువ్వు బోణి
వనకేళి గోరదు వనజాత లోచన
హంసంబు బెంపదు హంసగమన
లతల బోషింపదు లతికా లలిత దేహ
దొడవులు దొడవదు తొడవు తొడవు’
ఆ॥ ‘తిలక మిడదు నుదట దిలకినీ తిలకంబు
కమల గృహము జొరదు కమల హస్త
గారవించి తన్ను గరుణ గైకొన వన
మాలి రాడు తగవు మాలి యనుచు’
మురారి శౌరి తన మొర ఆలకించి కరుణతో తన్ను కరగ్రహణం చేయ త్వరగా రాడేమి? తగవు (న్యాయం, ధర్మం) తప్పెనా ఏమి?- అని మృగరాజ మధ్యమ (సింహం నడుము వంటి సన్నని నడుము గల) ఆ వాల్గంటి రుక్మిణి మృగనాభి- కస్తూరి ఒంటికి పూసికొనదు. జలజ- పద్మం వంటి మనోజ్ఞమైన ఒడలు- దేహం కల ఆ తరలాక్షి జడలో విరులు- పువ్వులు తురమదు. వనజాత లోచన- ఆ పద్మ నయన మనసు పోక వన విహారానికి కూడా చనదు. ఆ అంచయాన- హంస గామిని రాయంచ (రాజహంస)ను కూడా పెంచదు. లతాంగి- లత (తీగ) వలె లలితమైన మేను కల ఆ నెలత లతలను పోషించదు. అలంకారాలకే అలంకారమైన ఆ కనకాంగి ఆభరణాలు ధరించదు. తిలకినీ తిలకంబు- సీమంతినులకే- స్త్రీలకే సిగబంతి (తలమానికం)గా ఉన్న ఆ ఇంతి ఫాలతలాన- నుదుట తిలకం దిద్దదు. మదనా (మన్మథా)గ్ని జ్వాలలలో మ్రగ్గుతున్నా మంద మారుతాన్ని- చల్లని పిల్లగాలిని కూడా ఒల్లనంటోంది- ఇష్టపడటం లేదు.
అంతర్ముఖియై సంతతమూ తన ప్రాణేశుని చింతన వలన నిరతిశయ ఆనందానుభవం కలది కావున రుక్మిణీకాంత ఇతర భోగ్య- భోజ్య పదార్థాలు కోరదు. ఇలా నిర్వికల్ప సమాధి యందు ఉండుట వలన ఇంద్రియ వ్యవహారాలేవీ లేకనే సహజానంద సంద్రంలో మునిగి ఉన్నదని పరమార్థం! (సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ ,98668 36006