శుక యోగి పరీక్షిన్నరేంద్రునితో… రాజా! రుక్మిణీ కన్నియ పేరెన్నిక ప్రఖ్యాతి గన్న తన ప్రణయ సందేశంలో ప్రపన్నార్తి హరుడు, శ్రీమతాం వరుడు, జగద్గురుడు శ్రీకృష్ణునితో ఇలా విన్నవించుకుంటున్నది రక్షక భటులను, బంధువులను సంహరించ శిక్షించకుండా అంతఃపుర కక్ష్యలో సంచరించే నిన్ను, ఓ జలజాక్షీ! వెంట గొనిపోవడానికి ఎలా వీలవుతుంది? అని నీరజాక్షా! నీవు భావిస్తే, ఈ రభస అల్లరి, రచ్చతో నిమిత్తం లేకుండా నన్ను స్వీకరించే ఎత్తుగడ ఉపాయం సిగ్గుపడక నేనే మనవి చేస్తా, చిత్తగించు.. వివాహానికి ముందు నవవధువును మా కులదేవత, ఇలవేల్పు ఐన చలిమలచూలి శైలసుత (శివవల్లభ)ను కొలవడానికి మా వారు పంపుతారు. నేను ఊరి వెలుపల కొలువుతీరిన ఆర్యామహాదేవి పార్వతికి మొక్కు చెల్లించే మహత్కార్యానికి నా సదనం నుండి అనివార్యంగా బయలుదేరి వస్తాను. ఆ తరుణంలో అదను చూసుకొని ఓ గదాగ్రజా! అవార్య చరితా (అడ్డగింపరాని నడవడి గల దొడ్డదేవరా!) నన్ను భార్యగా జంటగా నిరాటంకంగా నీ వెంట గొనిపో.
మ॥ ‘ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురే నట్టి నీ
యనుకంపన్ విలసింప నేని వ్రత చర్యన్ నూఱు జన్మంబులన్
నిను జింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!’
‘ప్రాణనాథా! సాధు మహాత్ములు తమ అజ్ఞాన బాధ నివృత్తి (రాహిత్యం) కొరకు ఆదిభిక్షువు, ఐదు మోముల వేల్పు గౌరీపతి వలె, ఏ పరమ పురుషుని పురుషోత్తముని పాదపద్మాలలో ప్రభవించిన పవిత్ర గంగా జలాలలో వాలాయం నిరంతరం ఓలలాడాలని చాల ఉబలాట పడతారో, అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి అర్హురాలను కాకున్నచో తీవ్రమైన బ్రహ్మచర్య వ్రత నిష్ఠ (దీక్ష) పూని, ఓ విష్టరశ్రవా! (దర్భముడి వంటి చెవులు గలవాడా, వ్యాపన శీలమైన కీర్తి కలవాడా) ఓ సువ్రతా! శత జన్మలకైనా అప్రతిహతంగా నిన్నే పతిదేవునిగా వరిస్తా. నిన్నే నుతిస్తూ, ధ్యానిస్తూ, ఓ వసుదేవసుతా! నా అసువు ప్రాణాలను నీకే సమర్పిస్తా. శిశుపాలునికి మాత్రం వశురాలను కాను. ఇందు ఇసుమంతైనా సందియం లేదు.’
భగవంతుని కైంకర్యం (సేవాభాగ్యం) కోరుతూ (రుక్మిణీ తవ కింకరీ మూలం) పుత్తడి బొమ్మ రుక్మిణీదేవి పంపిన సరికొత్త ‘వివాహ మంగళ ప్రశస్తంబైన’ తళుకొత్తు ప్రణయ సందేశానికి పై మత్తేభం భగవదాయత్త చిత్తంతో ఉత్తమంగా భరతవాక్యం మంగళం పలికింది. మూలంలోని రత్నాల వంటి సప్త ఏడు శ్లోకాలనే ఏడడుగులతో నారీ రత్నం రుక్మిణి నరోత్తముడు నారాయణునితో యాదవ శిరోరత్నం కృష్ణునితో మనసా మదిలోనే పదిలంగా ‘సప్తపది’ (ఏడడుగుల నడక)ని సంభావించింది.
ఆంధ్ర భాగవతంలో.. రుక్మిణీ సతి తన ప్రణయ సందేశానికి ఇతిశ్రీ పలుకుతూ ఇంకా ఇలా అన్నది..
సీ॥ ‘ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని
కర్ణ రంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగా లేని,
తనులత వలని సౌందర్యమేల?
భువన మోహన! నిన్ను బొడగానగా లేని,
చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగాలేని
జిహ్వకు, ఫలరస సిద్ధియేల?
ఆ॥ నీరజాత నయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల? యెన్ని జన్మములకు’
‘ప్రాణపతీ! అతి మధురాలైన నీ భాషలు వాక్కులు ప్రీతితో విననోచని శ్రుతుల చెవుల వల్ల కలిమి ప్రయోజనం శూన్యం. పరమపురుషా! యోగేశ్వరేశ్వరా! నీకు భోగ్యం అనుభవింప యోగ్యంగాని ఈ సుకుమార శరీర లావణ్యం సౌందర్యం, ఇందిరావరా! భువనసుందరా! అది ఎందుకూ కొరగానిదే కదా! జగన్మోహనా! ఘనమైన నీ కమనీయ రూపాన్ని కరవుతీర కనలేని తిలకించి పులకించలేని చేరెడు చేరెడు కన్నులున్నా, బ్రతకని బిడ్డ బారెడన్నట్లు, వాని వలని ఫలమేమి? ప్రియతమా! మధురతమమైన నీ అధర సుధారసం ఆస్వాదించని రసనేంద్రియానికి నాలుకకు ఇతర ఫలరసాలు వృథలు ఎంత సరసాలైనా అవి అరసాలు, విరసాలు, కురసాలే కుత్సిత రసాలే! వనమాలీ! నీవు ధరించు నవ వనమాలికా సౌరభం సుగంధం ఆఘ్రాణించ మూకొనలేని నాసిక ముక్కు నుంచి మరే మంచి ప్రయోజనం చేకొనగలమని ఆశించగలం? ధన్యచరితా! చంద్రాస్యా! ఏకైక ఉపాస్యుడవైన నీకు దాస్యం అనన్య భక్తి సాధనల ద్వారా సేవ చేయలేని జన్మలు ఎన్ని ఎత్తితేనేమి? అవన్నీ బొత్తిగా వ్యర్థమైన, కేవలం గాలి నిండిన కొలిమితిత్తులు, జాలి పడదగిన క్షణికాలైన నీటి బుడగలే కదా!’
భగవంతుని పరంగా విషయకంగా ప్రవర్తించే ఇంద్రియాలే సార్థకాలు. అలా హితం కూర్చని ఇతరాలన్నీ నిరర్థకాలు’ అనే భాగవత ధర్మాన్ని పోతన్న ప్రసంగానుకూలంగా ఎడనెడ ఎన్నో రీతుల కడు మన్ననతో ఆదరపూర్వకంగా లోకానికి విన్నవించాడు.
రుక్మిణి ‘ప్రణయ సందేశం’లో గీతాప్రోక్తమైన ‘భజతాం ప్రీతి పూర్వకం’ (విభూతియోగం) అన్న ప్రేమా భక్తి, దాని విశుద్ధ, స్వచ్ఛ, నిర్మల స్వరూపం అంతర్వాహినిగా గోచరిస్తుంది. ఇందు అధైర్యం లేదు, నిండైన ధైర్యం తప్ప. చాంచల్యం లేదు, మెండు దార్ఢ్యం దృఢత్వం తప్ప. సంశయం లేదు, చెక్కు చెదరని ఆశ, మొక్కవోని ఆత్మవిశ్వాసం తప్ప. ఈ ప్రేమలో ఆర్తి తప్ప ఆర్భాటం లేదు, అహంకారమూ లేదు. పోతన అమాత్యుని గోపీ భాషలో ‘వాచా శతకంబులేల వర్ణింపంగా’ (వంద రకాల వాక్యాలతో వర్ణించడమెందుకు?) అన్న విధంగా, ఒక్క మాటలో చెప్పాలంటే, రుక్మిణి ప్రేమాభక్తి (ప్రేమపూర్వకమైన సేవాధర్మం)లో ‘సమర్పణ’ తప్ప ఏ సమయాలూ షరతులూ లేవు. ‘ఈ ప్రేమ కోసం రుక్మిణితోపాటు హృషీకేశుడు కృష్ణుడు కూడా తపించాడు’ అంటూ వ్యాఖ్యాతలు పరవశించిపోయారు. శుకుడు రాజా! రుక్మిణి సందేశాన్ని శ్రీకృష్ణస్వామికి వినిపించి, వశిన్యాది వాగ్దేవతలు లలితామాత అప్రాకృతిక సౌందర్య లాలిత్యాన్ని వర్ణించిన విధంగా, వశీకృత చిత్తేంద్రియుడు, విప్రవరుడైన అగ్నిద్యోతనుని రూపంలో అమాత్యుడే తనకత్యంత ఇష్టమైన అంత్యప్రాసల అచింత్యమైన అందాలలో వైదర్భి (రుక్మిణి) అలౌకిక రూపసౌందర్య సౌభాగ్య విశిష్టతలను వెన్నునికి ఇలా వివరించి వినిపించాడు.
సీ॥ ‘పల్లవ వైభవా స్పదములు పదములు,
కనక రంభా తిరస్కారులూరు
లరుణ ప్రభా మనోహరములు కరములు,
కంబు సౌందర్య మంగళము గళము
మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు,
చక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు,
జితమత్త మధుకర శ్రేణి వేణి
ఆ॥ భావజాశుగముల ప్రాపులు చూపులు
కుసుమ శరుని వింటి కొమలు బొమలు
చిత్తతోషణములు చెలువ భాషణములు
జలజనయన ముఖము చంద్ర సఖము’
మారజనకా (మన్మథుని కన్నవాడా)! మా రాకుమారి రుక్మిణమ్మ చరణాలు చిగురుటాకుల కన్నా సుకుమారాలు. అంతఃపుర దాసీజనం సంతతం ఘనంగా అభివర్ణించుకొనునట్లు ఆమె ఊరువులు తొడలు మార్దవం (మృదుత్వం)లో అపరంజి పసిడి అరటిబోదెలను అధఃకరిస్తాయి తిరస్కరిస్తాయి. ఆ ఇంతి కరాలు అరచేతులు బాలారుణ కాంతుల వలె మనోహరాలు. గళం కంఠం శంఖంవలె పుంఖానుపుంఖం ఒకదాని వెనుక మరొకటిగా, సౌందర్య మంగళ ప్రభలను ఎదమీద వెదజల్లుతూ ఉంటుంది. నడుము ఉన్నదా లేదా అన్నంత సన్నగా వన్నెలీనుతూంటుంది. చన్నుగవ కన్నుల పండుగగా చెన్నొందు వెలుగొందుతుంది. ఆమె ఫాలభాగం నుదురు కుదురుగా వెలుగుతున్న అర్ధచంద్రుని గేలి చేస్తుంది. నిండైన జడ గండుతుమ్మెదల పిండును సమూహాన్ని జయిస్తుంది. చూపులు చేతోభవుని మన్మథుని తూపులు బాణాలు. కనుబొమలు కుసుమశరుని మదనుని పదునైన వింటికొమలు- కొనలు. ఆ చెలువ భాషణాలు పలుకులు చిత్త తోషణాలు మనస్సంతోషకరాలు. బృందావన చంద్రా! ఆ అరవింద నేత్ర ముఖం చంద్రబింబం.
ఉ॥ ‘ఆ యెలనాగ నీకు దగు నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన బెండ్లియగు దప్పదు జాడ్యములేల నీవు నీ
తోయము వారి గూడుకొని తోయరుహానన దెత్తుగాని వి
చ్చేయుము శత్రులన్ నుఱుము సేయుము చేయుము శోభనంబిలన్’
అగ్నిద్యోతనుడు విజ్ఞతతో బ్రహ్మజ్ఞు కృష్ణునికి కల్యాణ శుభాశీస్సులు అందజేస్తూ ఇలా అన్నాడు… దామోదరా! జగజ్జాలములున్న బొజ్జగల దొరా! మాకు విద్య నేర్పిన ఒజ్జ గురువుల మీద ఒట్టు వేసి వారి సాక్షిగా చెపుతున్నా అంబుజాక్షా! నీకు రుక్మిణి, రుక్మిణికి నీవు, మీరిరువురూ చక్కని ఈడు జోడుగా ఉంటారు. (పరమార్థంలో మీరు ఉభయులూ అనాదులైన (ఆదిలేని) ప్రకృతి పురుషులు ‘ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి’ అని గీత. ప్రకృతి జడం. తనతో పురుషుడు కలిస్తేనే అది చైతన్యవంతం). జగత్తుకి కల్యాణకరమైన మీ పరిణయం తప్పక జరుగుతుంది. పంకజనాభా! ఇంకా జాడ్యము లేల జాగేల? నీవు నీ పరివారంతో కూడి ఆ కంజముఖిని రుక్మిణిని కొనితెచ్చుటకు వెంటనే బయలుదేరు. శౌరీ! వైరి వర్గాన్ని పోరులో చీల్చి చెండాడు. లోకానికి మేలు చేకూర్చు. పై రెండు సీస పద్యాలు, ఉత్పలమాల వృత్తం పోతన స్వాంత చేతనా జనితాలు, సొంతాలు! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006