త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్
ఉర్వారుక మివ బంధనా న్మృత్యోర్ముక్షీయమామృతాత్
శతాక్షరీ పరమా విద్యా త్రయీమయీ సాష్టార్ణా త్రిపురా పరమేశ్వరీ॥
మంచి పరిమళం గలిగిన, పుష్టిని వృద్ధి చేసే, త్య్రంబకుడికి (పరమేశ్వరుడికి) ప్రణామం. దోసపండు… తొడిమ నుంచి ఎలా సునాయాసంగా విడివడి పోతుందో నన్ను మృత్యువు నుంచి ఆ విధంగా విడివడేలా చేయి స్వామీ! అమృతం నుంచి కాదు!! ఇది ఈ మంత్రంలోని భావం. ఇది శతాక్షరి, పరమవిద్య, త్రయీమయి, అష్టార్ణతో, పరమేశ్వరి, త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్ పేర్కొన్నది.
(త్రిపురతాపినీ ఉపనిషత్)
సప్త పతివ్రతలలో ఉత్తమ స్థానాన్ని అలంకరించిన సాధ్వి అరుంధతీ దేవి. తన భర్త అయిన వశిష్ఠ మహర్షి సరసన నక్షత్ర మండలంలో సుస్థిర స్థానాన్ని పొందగలిగిందామె. అందుకే లోకంలో వివాహానంతరం నూతన వధూవరులు అరుంధతిని దర్శనం చేసుకోవడం ఆచారంగా కొనసాగుతున్నది. తండ్రి అయిన కర్దమ మహర్షి గురుకులంలో విద్యార్థులకు నేర్పే వేదాంతాన్ని అరుంధతి చిన్నప్పుడే ఆపోశన పట్టింది. అరుంధతీ వశిష్ఠుల తపస్సుకు సేవా తత్పరతకు మెచ్చి బ్రహ్మ దేవుడు నందిని అనే గోవును బహుకరించాడు. ఆశ్రమంలో ప్రతి సంవత్సరం పదివేల మందికి విద్యాదానంతోపాటు నిత్యం అన్నదానమూ జరిగేది. పరమేశ్వరుడే బాలుని రూపంలో వారి ఆశ్రమంలో చేరి వారిని అనుగ్రహించాడు.
అరుంధతి మృత్యుంజయ మంత్రంతో కరుణుడు అనే అతణ్ని రక్షించిన సంఘటన ఒకటి ఉంది. ధనంజయుడు అనే బ్రాహ్మణుని కొడుకు కరుణుడు. అతని భార్య శుచిస్మిత. దాయాదులతో వైరం వచ్చి భవానీ తీరంలోని నృసింహుని వద్దకు వెళ్తాడు కరుణుడు. అక్కడ నైవేద్యంగా ఉంచిన నిమ్మకాయ వాసన చూస్తాడు. అది గమనించిన అక్కడివారు కోపంతో నూరేళ్లు జోరీగవై పొమ్మని కరణుణ్ని శపిస్తారు. అతడు వెంటనే ఈగగా మారిపోతాడు. పగ తీరని దాయాదులు ఈగను పట్టి మరిగే నూనెలో విసిరేసి చంపేస్తారు. శుచిస్మిత తన భర్త మృతదేహంతో అరుంధతిని ఆశ్రయిస్తుంది. ఆ సాధ్వి మృత్యుంజయ మంత్రాన్ని అభిమంత్రించి విభూతిని ఈగమీద చల్లింది. ఈగ తన స్వరూపాన్ని పొందుతుంది. అంతటి విశిష్టమైన మృత్యుంజయ మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా, మృత్యుభీతి నశిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ