విముక్తి గురించి తెలుసుకొనే సమాచారం అందరికీ ఇవ్వాలి. ముక్తి మార్గం, భక్తి సాధనం, మంత్రోపదేశం, విజ్ఞాన సమాచారం అందరిదీ. వెయ్యేళ్ల కాలం కిందట సమాచార హక్కు అవసరమని చెప్పినవాడు రామానుజుడు. ఆలయాలలో అన్ని కులాలవారికి ప్రవేశం జరిపించి, అందరికోసం చెరువులు తవ్వించి, విజ్ఞానం, మంత్రోపదేశం కొందరికే పరిమితం కాదనీ, అందరూ పొందాలనే సర్వసమతా సూత్రాన్ని బోధించి పాటించిన జగద్గురువు రామానుజుడు. ఆధునిక భావాలకు ఆద్యుడు ఆయన. అందుకే రామానుజుడు సంస్కర్త, జ్ఞానం అందరిదని ప్రకటించి ఊరుకోకుండా అందరికీ తెలియజేయాలని జీవితం అంకితం చేసిన గురువు.
జాతి మత కుల భేదాలు లేకుండా అందరికీ ఆలయ సమీపంలోని కూటములలో మధ్యాహ్న భోజనం ఇవ్వాలనే ఆలోచనను మొదట అమలుచేసిన వాడు రామానుజుడు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఆలయాలలో అన్నదానానికి, ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాలకు ఆయనే ఆద్యుడు.
ఆయన గోష్ఠీ సమరాంగణ సార్వభౌముడు, అహింసా వాది, సంవాదం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చుననే సూత్రాన్ని ఈ నాడు ప్రపంచం బోధిస్తున్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానానికి తొలి కర్త, కర్మ, క్రియ రామానుజుడే. గాంధీ అహింసా సిద్ధాంతాన్ని వెయ్యేళ్ల కిందటే ఆచరించి చూపిన మార్గదర్శి.
ఊళ్లో చెరువులు ఉండాలనీ, అవి అందరికీ నీరివ్వాలనీ, ఎవ్వరినీ నిరాకరించకూడదని నియమాలు పెట్టిన జగద్గురువు కూడా రామానుజుడే. తొండనూరులో ఆయన తవ్వించిన చెరువు వెయ్యేళ్లనుంచి అన్ని వర్గాల ప్రజల దాహార్తిని తీరుస్తూనే ఉంది.
మేల్కోటే తిరునారాయణపురం ఆలయంలో ప్రవేశించడానికి మాకెందుకు అర్హత లేదని అక్కడి హరిజన, గిరిజనులు అడిగితే ఇప్పుడే రండి అని ఆలయంలోకి తీసుకువెళ్లిన మహానుభావుడు రామానుజుడు.
‘హిందూ మతంలో అందరి సమానత గురించి ఆలోచించిన సంస్కర్త.. రామానుజుడే’ అని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ప్రశంసించడం గొప్ప విషయం. రామానుజుడి జీవితం మెదడున్న మనలని ఆలోచింపజేసే ఒక సిద్ధాంతం, ఒక ఆచరణ, ఒక సువిశాల సమతా మతం, స్వేచ్ఛా సాధనం.
జననం: శ్రీపెరుంబుదూర్, తమిళనాడు చెన్నై నగరం సమీపంలో.
జననీ జనకులు: శ్రీమతి కాంతిమతి, శ్రీమాన్ ఆది కేశవ సోమయాజి.
జీవనకాలం: క్రీ.శ. 1017-1137.
నాథముని, యామునాచార్యుల తర్వాత శ్రీవైష్ణవ విశిష్టాద్వైతాన్ని ప్రసిద్ధం చేసిన సిద్ధాంత కర్త, భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్యులు. బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం- శ్రీ భాష్యం, భగవద్గీతా భాష్యం, వేదాంత సంగ్రహం అనేవి రామానుజుడి ప్రధాన ప్రామాణిక సైద్ధాంతిక గ్రంథాలు. శరణాగతి, శ్రీరంగ, శ్రీ వైకుంఠ గద్యాలు (గద్యత్రయం), రామానుజుడి ఇతర రచనలు. రామానుజుడి రచనలపై హరాల్డ్ కొవార్డ్ థామస్ ఆక్వినాస్, ఏబీ వాన్ బ్యూటెనెన్ పరిశోధనలు జరిపి ‘ఇవి చాలా ప్రభావం కలిగించిన గ్రంథాల’ని తమ పరిశోధనా సైద్ధాంతిక పుస్తకాలలో నిరూపించారు.
…? మాడభూషి శ్రీధర్