రంజాన్ మాసం అనగానే కేవలం ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు మాత్రమే గుర్తుకురావు. అంతకుమించి ఆత్మను శుద్ధి చేసుకునే ఒక అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణం స్ఫురణకు వస్తుంది. ఈ పవిత్ర మాసంలో ముస్లిం లోకం అత్యంత భక్తి శ్రద్ధలతో వేచి చూసే అపురూప ఘడియ ‘లైలతుల్ ఖదర్’. మానవాళికి మార్గదర్శిగా నిలిచిన పవిత్ర ఖురాన్ అవతరించిన శుభ తరుణమిది. సాధారణంగా ఏ రంగంలోనైనా కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. కానీ, లైలతుల్ ఖదర్ రాత్రి అల్లాహ్ తన ప్రియమైన దాసులకు ప్రసాదించిన అపరిమితమైన ‘ఆధ్యాత్మిక వరం’.
ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన వెయ్యి నెలల నిరంతర ప్రార్థన కంటే మిన్న అని ఖురాన్ ఘంటాపథంగా తెలియజెప్పింది. సగటు మానవుడి పూర్తి జీవితకాలాన్ని దైవ చింతనలో గడిపితే ఎంతటి పుణ్యం లభిస్తుందో, అంతటి ఫలాన్ని కేవలం ఈ ఒక్క రాత్రిలో పొందే వీలుండటం సృష్టికర్త కరుణకు నిదర్శనం. తక్కువ ఆయుష్షు కలిగిన తన అనుచరులు, పూర్వకాలపు దీర్ఘాయుష్మంతులతో పుణ్యకార్యాల్లో పోటీ పడాలన్న ప్రవక్త ముహమ్మద్ ఆకాంక్షకు దైవం ఇచ్చిన వరమిది.
ఈ రాత్రి కేవలం సంఖ్యాపరమైన గణాంకం కాదు; అది ఒక పవిత్ర అనుభూతి. ప్రధాన దేవదూత జిబ్రాయీల్ (అలైహిస్సలాం) సారథ్యంలో వేల సంఖ్యలో మలైకాలు (దేవదూతలు) భూమిపైకి దిగివచ్చి, ప్రార్థనలో తరిస్తున్న భక్తుల కోసం శాంతిని, కరుణను వేడుకుంటారు. సూర్యోదయం వరకు ధరణిపై అణువణువూ దైవిక కాంతి, ప్రశాంతత వెల్లివిరుస్తుంది. అజ్ఞానపు చీకట్లను చీల్చుతూ జ్ఞానజ్యోతి (ఖురాన్) వెలిగిన రాత్రి కాబట్టే దీనికి ‘ఘనత వహించిన రాత్రి’ అనే పేరు సార్థకమైంది.
లైలతుల్ ఖదర్ ఏ రోజో కచ్చితంగా వెల్లడించకపోవడంలోనూ ఒక గూఢార్థం దాగి ఉంది. రంజాన్ చివరి పది రోజుల్లోని బేసి రాత్రులలో (21, 23, 25, 27, 29) దీనిని అన్వేషించాలని ఇస్లాం సూచిస్తున్నది. కేవలం ఒక్క రోజు ఆరాధనకే పరిమితం కాకుండా, చివరి పది రోజులూ భక్తులు మసీదుల్లో ‘ఇతికఫ్’ (ఏకాంత వాసం) ఉంటూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని పరమాత్మునితో అనుసంధానం కావడానికి ఇది ప్రేరణనిస్తుంది. ప్రార్థన.. పశ్చాత్తాపం.. పరివర్తన ఈ రాత్రిని కేవలం జాగరణతో గడపడం కాకుండా, అర్థవంతమైన ఆచరణతో సద్వినియోగం చేసుకోవాలి.
గతంలో చేసిన తప్పులకు ‘తౌబా’ (పశ్చాత్తాపం) కోరడం, దానధర్మాలు చేయడం, తోటి మనుషుల పట్ల కనికరం చూపడం ఈ రాత్రి విశిష్టత. ‘ఓ అల్లాహ్! నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ప్రేమిస్తావు, నన్ను క్షమించు’ అన్న చిన్న ప్రార్థనలో అనంతమైన అంతరార్థం ఉంది. యంత్రంలా మారిపోయిన నేటి మానవ జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఒక సంజీవని. లైలతుల్ ఖదర్ అందించే ఈ అమృత ఘడియలు కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు, శాంతిని కాంక్షించే ప్రతి హృదయానికీ సందేశాత్మకమైనవి. పవిత్రతను సంతరించుకుని, పాపాలను ప్రక్షాళన చేసుకుని, నవ సమాజం వైపు అడుగులు వేయడానికి ఈ రాత్రి ఒక దిక్సూచిగా నిలవాలి.
-ముహమ్మద్ ముజాహిద్ ,96406 22076