Quran | ఖురాన్ అంటే పఠించునది అని శాబ్దిక భావం. అంటే నిత్యపఠనానికి ఉపయోగించే పాఠ్యగ్రంథం. ఖురాన్లో ఈ గ్రంథాన్ని మరో నాలుగు పేర్లతో పేర్కొన్నారు. అవి అల్ ఫుర్ఖాన్ (మంచీ చెడుల మధ్య విచక్షణ చేసి చూపేది), అల్ హుదా (మార్గదర్శిని), అన్ నూర్ (వెలుగు నింపేది), అల్ కితాబ్ (మహత్తర గ్రంథం). ఈ పవిత్ర గ్రంథం ఆవిష్కృతమైన నెల రంజాన్.
ఖురాన్ గ్రంథ జ్ఞానాన్ని ముహమ్మద్ ప్రవక్త మనోఫలకంపై అవతరించిన శుభమాసమే రంజాన్. సమస్త దుఃఖాలను, కమ్ముకొని ఉన్న కారుచీకట్లను దూరం చేసి వెలుగులు ప్రసరింపజేసే మార్గదర్శిని ఇది. ‘ఖురాన్ చదవడం అంటే అల్లాహ్ మాటలను వినడమే’అంటారు ఉలేమాలు. అల్లాహ్ను ఎలా వేడుకోవాలి, ఏం వేడుకోవాలి అనే విషయాలను ఖురాన్లో స్పష్టంగా వివరించాడు ప్రభువు. ఖురాన్ అవతరించిన ఈ రంజాన్ మాసంలో కనీసం ఒక్కసారైన ఈ గ్రంథాన్ని చదవాలి, వినాలన్న నిబంధనను ముస్లింలు తప్పకుండా పాటిస్తారు.
ఖురాన్ జీవన విలువల దిక్సూచి. దైవభీతినీ, జీవన రీతినీ తెలుపుతుంది. మనో వ్యాధులకు దివ్య ఔషధం ఈ గ్రంథం. వ్యక్తివికాసాన్ని అందించే సాధనం. ‘ఎవరైతే నా తాడు (ఖురాన్)ను గట్టిగా పట్టుకుంటారో వారు ఎన్నటికీ విఫలం కారు’ అంటాడు అల్లాహ్. ఖురాన్లోని బోధలు ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అల్లాహ్ ఆదేశాలను తెలియజేయడానికీ, ఆయన అభీష్టాలు అర్థం చేసుకోవడానికి దివ్య ఖురాన్ అవతరించింది. ఈ పవిత్ర గ్రంథం మార్గ నిర్దేశనంలో అల్లాహ్ ఆదేశాలను ఆచరించి ఆయన ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. ఏ పనులు వద్దని వారించడం జరిగిందో వాటికి దూరంగా ఉండి, అల్లాహ్ ఆగ్రహం నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076