సుఖశాంతులకు మార్గంపవిత్ర ఖురాన్ అవతరించిన మాసం రంజాన్. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. ఖురాన్ బోధనలు అల్లాహ్ దగ్గర నుంచి జిబ్రయీల్ దూత ముహమ్మద్ ప్రవక్త మనోఫలకంపై అవతరింపజేసేవారు. ఈ బోధనలను ఎప్పటికప్పుడు కంఠస్థం చేసుకుని తమ సహచరులతో గ్రంథస్థం చేయించేవారు. 1450 సంవత్సరాల క్రితం అవతరించిన ఈ గ్రంథం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పవిత్ర రంజాన్ నెల సందర్భంగా ముస్లిమ్ సోదరులు ఖురాన్ పారాయణాన్ని విధిగా చేస్తారు.
ఖురాన్ విశిష్టతను ముహమ్మద్ ప్రవక్త (స) ఎన్నో పర్యాయాలు విశదీకరించేవారు. రంజాన్ ఉపవాసాల వేళ ఖురాన్ పఠనం రెట్టింపు పుణ్యాన్ని అందిస్తుంది. ఆ పవిత్ర గ్రంథం ద్వారా జ్ఞానాన్ని పొంది, దాన్ని ఇతరులకు బోధించేవారు అందరికన్నా శ్రేష్ఠులని దైవ ప్రవక్త ఉపదేశించారు. ఖురాన్ బోధనలను పాటించి తన జీవితాన్ని సంస్కరించుకొని, ఇతరుల జీవితాలను సంస్కరించే వ్యక్తే ప్రపంచంలో అత్యుత్తమ మనిషి అనేవారు ప్రవక్త. ఖురాన్ అర్థం కాకపోయినా, ధారాళంగా చదవలేకపోయినా… విశ్వాసంతో, అల్లాహ్ మీద భక్తితో చదవాలని చెప్పేవారు.
ఖురాన్‌ను భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి దైవ సాన్నిహిత్యం లభిస్తుంది. ఇందులోని బఖరా సూరా అధ్యాయాన్ని అర్థం చేసుకొని చదివితే కుటుంబ జీవిత నియమాలు, సూత్రాలు వివరంగా తెలుసుకోవచ్చు. అల్ బఖరా, ఆల్ ఇమ్రాన్ సూరాలు ప్రళయం నుంచి మనల్ని రక్షించే పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇవి విశ్వాసులను జీవితాంతం ముందుకు నడిపిస్తాయి. ఈ సూరా సారాంశాన్ని జీవితంలో ఆచరించినవారు ముక్తిని పొందుతారు. ఫాతిహా సూరా, బఖరా సూరా చివరి ఆయత్లు దైవ ప్రవక్త (స)కు అల్లాహ్ ప్రసాదించిన రెండు వరాల వంటివి! అవి ఖురాన్ సారాంశాన్ని, అల్లాహ్ ఏకత్వ సారాన్ని కొన్ని వాక్యాల్లోనే వివరిస్తాయి. ఈ రెండు సూరాలు మనుషుల్ని చెడు నుంచి కాపాడతాయి. ఇక కహఫ్ సూరాలో మొదటి పది ఆయత్లను కంఠస్థం చేసినవారు ఉపద్రవాల నుంచి రక్షణ పొందుతారని ప్రవక్త పేర్కొన్నారు. ఖురాన్ పదాల్లో కూడా శుభం ఉంటుందని ఆయన బోధించేవారు.
మన జీవితంలో అన్నిటికన్నా మొదటి అమానతు అల్లాహ్ ప్రసాదించిన ఈ శరీరమేనని ఖురాన్ బోధించింది. ఈ గ్రంథంలోని ప్రతి పదం, అక్షరం పుణ్యప్రదమైనదే. సర్వ కాల, సర్వావస్థల్లో మానవాళిని కాపాడే దివ్య ఔషధం ఇది. ఖురాన్‌ను జీవిత మార్గదర్శిగా భావిస్తే, స్వీకరిస్తే మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిపోవచ్చు. అందుకే ఇన్ని రకాల శుభాలను చేకూర్చే ఖురాన్ పఠనాన్ని దినచర్యగా చేసుకుందాం… శాంతి, సౌభాగ్యాలను ఆస్వాదిద్దాం!…?
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076