ఒక వ్యక్తి మిట్టమధ్యాహ్నం వేళ పనిమీద బయలుదేరాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోసాగింది. ఇంతలో ఓ ఇరుకు బావి కనిపించి అటుగా వెళ్లాడు. కష్టం మీద బావిలోకి దిగి దోసిళ్లతో నీళ్లు తీసుకొని దాహం తీర్చుకున్నాడు. బావి పైకి వచ్చేసరికి.. గట్టున ఓ కుక్క దాహంతో అలమటిస్తూ కనిపించింది. దాన్ని చూడగానే చలించిపోయాడు. కష్టం అనుకోకుండా.. మళ్లీ బావిలోకి దిగి తన తోలు మేజోళ్లలో నీళ్లు పట్టుకొని, దాన్ని నోట కరుచుకొని .. అతికష్టం మీద పైకి వచ్చాడు. నీళ్లు తాగించి కుక్క ప్రాణాలు నిలబెట్టాడు.
ఈ సాయంతో అల్లాహ్ అతని పాపాలను మన్నించి స్వర్గలోకానికి వారసుడిగా చేశాడు. ఓ సారి అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ (రజి) అనే పండితుడి దగ్గరికి ఒకవ్యక్తి వచ్చాడు. తన మోకాలికి అయిన పుండును చూపుతూ.. ఏడేండ్లుగా బాధపెడుతున్నదని బావురుమన్నాడు. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గడం లేదని విన్నవించుకున్నాడు. దానికి ఆ పండితుడు ‘మంచినీటి కటకటతో ఇబ్బందిపడుతున్న ప్రజల దాహార్తి తీర్చు. వారి కోసం ఓ బావి తవ్వించు. అప్పుడు నీకు ఉపశమనం లభిస్తుంది’ అన్నాడు.
పండితుడు చెప్పినట్టు చేయడంతో అతని గాయం మానింది. ప్రాణుల దాహార్తిని తీర్చడం వల్ల పరలోకంలో స్వర్గమే కాదు, ఈ ప్రాపంచిక జీవితంలోనూ మన సమస్యలు పరిష్కారమవుతాయని పై రెండు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ‘భూలోకవాసులపై కరుణ చూపండి ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడు’ అని చెప్పారు ప్రవక్త(స). ఎండలు మండుతున్న ఈ వేసవిలో పశుపక్ష్యాదుల కోసం ఇంటి చుట్టూ పాత్రల్లో నీరు పెట్టడం సత్కార్యం అనిపించుకుంటుంది. అలాంటి వాళ్లు దైవకృపకు పాత్రులు అవుతారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసిన వాళ్లు దేవుడి కరుణను పొందుతారు.
– ముహమ్మద్ ముజాహిద్
96406 22076