తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 15న పుష్పయాగం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వివరించారు. 14న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 15న ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుపనున్నట్లు తెలిపారు.
మధ్యాహ్నం 2.50 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పుష్పయాగంలో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తామన్నారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని అన్నారు.